కశ్మీర్‌ లోయలో తెలుగు ఐపీఎస్ ఆఫీసర్‌కి స్పెషల్ డ్యూటీ

జమ్మూకాశ్మీర్‌ను కేంద్రం రెండుగా విభజించింది. 370 రద్దుతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలు అధికారులకు ఒక సవాలే అని చెప్పాలి. అక్కడ ప్రభుత్వం లేదు. అంతా అధికారుల పాలనే. భద్రత నుంచి సంక్షేమం వరకు అంతా అధికారులే చూసుకోవాలి. ఇలాంటి సమయంలో సమర్థవంతమైన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను జమ్మూకశ్మీర్‌కు బదిలీ చేసిన కేంద్రం…అందులో ఇద్దరు మహిళా ఆఫీసర్లకు అత్యంత సున్నితమైన కశ్మీర్‌ లోయలో కీలక బాధ్యతలు అప్పగించింది. అందులో ఒక తెలుగు మహిళా అధికారి ఉండడం చెప్పుకోవాల్సిన విషయం.

2016 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి పీడీ నిత్య తెలుగమ్మాయి. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో పెరిగిన ఆమె.. బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ చదివారు. కశ్మీరీ, హిందీ భాషలను సైతం నిత్య అనర్గళంగా మాట్లాడతారు. ఆమె సమర్థతను చూసిన కేంద్రం శ్రీనగర్లో పోస్టింగ్ ఇచ్చింది. ప్రస్తుతం రామ్ మున్షి బాగ్, హర్వాన్ దాగ్చి ఏరియాల బాధ్యతలను ఆమె చూస్తున్నారు. దాల్ సరస్సు పరిసరాల్లోని 40 కిలోమీటర్ల మేర ప్రాంతం సున్నితమైంది. ఆ ఏరియా పరిధిలో ఉండే గవర్నర్ నివాసం, కశ్మీర్‌ రాజకీయపార్టీల నేతలు, వేర్పాటు వాదులను అదుపులో తీసుకొని ఉంచిన భవనాల బాధ్యతలను కూడా నిత్య పర్యవేక్షిస్తున్నారు.

ఇక జమ్మూ కశ్మీర్‌ను యూటీగా ప్రకటించడానికి నాలుగు రోజుల ముందు డాక్టర్ సయ్యద్ సెహ్రిష్ అస్గర్ అనే 2013 బ్యాచ్‌కు చెందిన మహిళా ఐఏఎస్ ఆఫీసర్‌ను కూడా ఆ రాష్ట్రానికి బదిలీ చేశారు. ఆమెకు ఊహించని రీతిలో ఐ అండ్ పీఆర్‌ డైరెక్టర్‌గా శ్రీనగర్‌లో కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రజలతో మమేకమై వారికి ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించడం ఆమె బాధ్యత. కశ్మీర్లోని ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడి ప్రజలకు ఆమె అండగా నిలుస్తున్నారు. కశ్మీరీలు దూర ప్రాంతాల్లో ఉంటున్న తమ బంధువులు, సన్నిహితులకు ఫోన్లు చేయడం కోసం, డాక్టర్ల సాయం పొందడానికి అస్గర్ సహకరిస్తున్నారు.

ప్రస్తుతం కశ్మీర్లో బాధ్యతలు నిర్వర్తిస్తోన్న మహిళా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అస్గర్, నిత్య మాత్రమే కావడం విశేషం. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో ఉన్నతాధికారులుగా మహిళలను నియమించినప్పటికీ వారంతా జమ్మూ, లడక్ ప్రాంతాల్లోనే బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *