మరుభూమిగా మారిన దేవభూమి.. ఇవాళ భారీ వర్షాలు

మరుభూమిగా మారిన దేవభూమి.. ఇవాళ భారీ వర్షాలు

దేవభూమి కేరళ మరుభూమిగా మారింది. కర్నాటకలోనూ వరదలు ధాటికి జనజీవనం చిన్నాభిన్నమైంది. భారీ వర్షాలు, వరదల ఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య 210కి చేరింది. ఇప్పటి వరకూ కేరళలో 91 మంది, మహారాష్ట్రలో 43, కర్ణాటకలో 48, గుజరాత్‌లో 31 మంది మరణించారు. వరద బీభత్సానికి ఇండ్లతో పాటు.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి. దీంతో పెద్దయెత్తున ఆస్తి నష్టం జరిగింది. ఇవాళ భారీ వర్షాలు పడనున్నాయన్న భారత వాతావరణ విభాగం హెచ్చరికల నేపథ్యంలో కేరళలోని మలప్పురం, కోజికోడ్‌ జిల్లాల్లో అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. కేరళ వరదల ఘటనల్లో మంగళవారంనాటికి 91 మంది చనిపోగా, 40 మంది గల్లంతైనట్టు అధికారులు ప్రకటించారు. వరద ఉధృతి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో బాధితులకు అవసరమైన సామాగ్రిని అందిస్తున్నారు.

మరోవైపు కర్ణాటకలో కూడా వరద ఉధృతి తగ్గింది. వర్షాల ప్రభావంతో కర్ణాటకలో ఇప్పటి వరకూ 48 మంది మరణించగా, 16 మంది గల్లంతయ్యారు. వరదల వల్ల రాష్ర్టంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ప్రభావితం అయిన నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాధారణంగా జరపాలని ఆ రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది.

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు మహారాష్ర్టలో 43 మంది చనిపోయారు. కొల్హాపూర్‌, సంగ్లీ జిల్లాల్లో వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలను అధికారులు నిలిపివేశారు. వరదల వల్ల సర్వ స్వం కోల్పోయిన బాధితుల సహాయార్థం మహారాష్ర్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, కేబినెట్‌ మంత్రులు ఒక నెల వేతనాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మంగళవారంనాటికి ఎనిమిది మంది చనిపోయారు. వరద పరిస్థితులను రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సమీక్షించారు. దేశ రాజధాని ఢిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు కురిశాయి.

‘వర్ష రహత్‌' ఆపరేషన్‌ పేరుతో చేపట్టిన వరద సహాయక చర్యల్లో దాదాపు 14వేల మందిని కాపాడినట్టు భారత నౌకా దళం ప్రకటించింది. భారీ వరదలతో అల్లకల్లోలమైన మహారాష్ర్ట, కర్ణాటక, గోవాలో భారత నౌకా దళం సహాయక చర్యలు చేపట్టింది.

Tags

Read MoreRead Less
Next Story