ప్లాస్టిక్‌ నిషేధం ఒట్టి మాటేనా?

ప్లాస్టిక్‌ నిషేధం ఒట్టి మాటేనా?

పర్యావరణానికి ప్లాస్టిక్‌ పెనుభూతంగా మారింది. ప్లాస్టిక్‌ కవర్లు మొదలు వాటితో చేసిన వస్తువుల విక్రయం, వినియోగానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరి జీవితంలో ప్లాస్టిక్‌ భాగమైపోయింది. దీంతో జనరోగ్యానికి, పర్యావరణానికి పెను ముప్పుగా మారింది. పాలు, కూర‌గాయ‌లు, టీ, టిఫిన్‌, భోజనం.. ఏది తేవాలన్న ప్లాస్టిక్‌ కవర్లు కావాల్సిందే. ప్లాస్టిక్‌ లేనిదే ఏ సరుకు తెచ్చుకోలేని పరిస్థితి. ప్లాస్టిక్‌పై నిషేధం విధించినా.. అవగాహన కల్పించినా ఫలితం శూన్యం. గ్రామాల నుంచి నగరాల వరకు అంతా ప్లాస్టిక్‌ మయం. ఇబ్బడి ముబ్బడిగా వాడడం.. తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేయడం. చెత్తకుండి, నాలాలు సైతం పాలిథీన్‌ కవర్లతో నిండిపోతున్నాయి. ఫలితంగా ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతున్నాయి.

ఏది అవసరమైనా ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులో తెచ్చుకుంటున్నాం. చివరకు రెడీ మేడ్‌ వస్తువులు కూడా ప్లాస్టిక్‌ ప్యాక్‌తో జనంపై రుద్దే పరిస్థితి. ఐతే న‌గ‌రంలోని కొంద‌రు వ్యాపారులు ప్లాస్టిక్‌కు దూరమంటున్నారు.తమ కొనుగోలుదారుల‌కు పేప‌ర్ క‌వ‌ర్లు, క్లాత్‌ సంచుల్లో మాత్రమే వస్తువులను ఇస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. పంజాగుట్టలోని ఓ మటన్‌ షాపు యజమాని ప్లాస్టిక్‌ బ్యాన్‌ చేశాడు. కస్టమర్లు బాక్స్‌ తెచ్చుకోవాలని బ్యానర్‌ కూడా ఏర్పాటు చేయడం విశేషం. ఇలా ప్రతి షాపు యజమాని ఉండాలన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది.

ప్లాస్టిక్‌ను తగలబెడితే దాని నుంచి వెలువడే టాక్సిన్స్‌ యమ డేంజర్‌. ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపిస్తుంది. వాటిని పశువులు తినడం వల్ల వాటికి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఆ పాలు కలుషితమౌతాయి. పాలిథీన్‌ క‌వ‌ర్లు భూమిలో కలిసి పోవడానికి కొన్ని లక్షల సంత్సరాలు పడుతుంది. దాని వినియోగంతో కొని తెచ్చుకునే ప్రమాదం మరొకటి ఉంది. అదే భయంకరమైన కేన్సర్. అతిగా ప్లాస్టిక్‌ వాడకంతో క్యాన్సర్‌ ముప్పు తప్పదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. పిల్లల్లో ఎదుగుదల, జ్ఞాపక శక్తి హరించుకపోవడంతో పాటు కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు. నిషేధం విధిస్తున్నామని, ప్లాస్టిక్‌ వాడినా, విక్రయించిన చర్యలు తప్పవని తరచూ అధికారులు చెప్పే మాట. అది మాటే. తర్వాత షరా మామూలే. ప్రత్యామ్నాయంగా కాగితపు కవర్లు, వెదురు బుట్టలు, బట్ట సంచుల వంటి ప్రకృతి సహజమైన వాటినే వాడడం మంచిది.

Tags

Read MoreRead Less
Next Story