కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు హెచ్చరిక

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు  హెచ్చరిక

కర్ణాటక సంక్షోభం కథ క్లైమాక్స్ దశకు చేరుకుంది. నాటకీయ పరిణామాల నేపథ్యంలో ముంబయి హోటల్‌లో నుంచి రెబల్స్ ఎమ్మెల్యేలు బెంగళూరు తిరిగి వచ్చారు. దీంతో కాంగ్రెస్‌ - జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వ భవిష్యత్తుపై నెలకొన్న సందిగ్ధత క్రమంగా వీడే అవకాశాలు నెలకొన్నాయి.. తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని గురువారం సుప్రీంకోర్టు కర్ణాటక స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ను ఆదేశించింది. అయితే రాజీనామాలను ఒక్క రోజులో త్లేల్చాలన్న ఉత్తర్వును సవరించాలంటూ... స్పీకర్‌ తరుపున సీనియర్‌ న్యాయవాది అభిషేఖ్‌ మనుసింఘ్వీ లంచ్‌మోషన్‌ పిటీషన్‌ వేశారు. దీనిపై ఇవాళ సుప్రీం కోర్టు తన తీర్పును వెల్లడించే అవకాశముంది...... మరోవైపు సుప్రీం కోర్టు ఆదేశాలతో .... రాజీనామా చేసి తిరుగుబావుటా ఎగురవేసిన ఎమ్మెల్యేలు బెంగళూరు విధానసభకు చేరుకుని స్పీకర్‌ను కలిశారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో మళ్లీ రాజీనామాలను ఆయనకు సమర్పించారు. రాజీనామాలను ఆమోదించాలని కోరారు.

ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించిన నేపథ్యంలో స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలపై తొందరపాటు నిర్ణయం తీసుకోబోనని అసెంబ్లీ స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ స్పష్టంచేశారు. కర్ణాటక అసెంబ్లీ విధానాల ప్రకారం ఎమ్మెల్యేలు స్వచ్చందంగా రాజీనామా చేశారా..? లేక మానసిక ఒత్తిడితో రిజైన్ చేశారో తేల్చాల్సి ఉందన్నారు.. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న తనకు సుప్రీంకోర్టు ఎలా ఆదేశాలు జారీ చేస్తుందని రమేష్ కుమార్ ప్రశ్నించారు. రాజీనామాలపై నిర్ణయం తీసుకోవడానికి సుప్రీంకోర్టు గడువు ఎలా విధిస్తుందని నిలదీశారు స్పీకర్.

బీజేపీ చేస్తున్న కుట్ర పూరిత రాజకీయాలకు తాము బలికామని ముఖ్యమంత్రి కుమారస్వామి తెలిపారు. తన వద్ద కావల్సినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. డీకే కూడా కుమారస్వామికి అండగా నిలిచారు. ముఖ్యమంత్రి పదవి నుంచి కుమారస్వామి తప్పుకోవాల్సిన అవసరం లేదన్నారు.

అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అత్యంత ప్రమాదరక స్థితిలో ఉందంటూ బాంబ్ పేల్చారు మంత్రి క్రిష్ణ బైరెగౌడ. రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ చేసిన ఏడో దాడి ఇది. ఇన్నిసార్లు వాటిని తట్టుకొని నిలబడ్డాం. కానీ ఈసారి పరిస్థితి తీవ్రంగా ఉందని పేర్కొన్నారు.. అయితే సీఎం మారే అవకాశం ఉందేమో కానీ, ప్రభుత్వం సురక్షితంగా ఉంటుంది అని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు హరిహర ఎమ్మెల్యే. ఇదిలా ఉంటే, బీజేపీ శాసనసభాపక్షం అత్యవసరంగా సమావేశమైంది. విధానసౌధలోని పార్టీ చాంబర్‌లో మాజీ సీఎం యడ్యూరప్ప నేతృత్వంలో బీజేపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై బీజేపీ నేతలు సమాలోచనలు జరిపారు.

మరో వైపు ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు అనర్హత అస్త్రాన్ని ప్రయోగించాయి. నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. ముగ్గురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని జేడీఎస్ కోరింది. రాజీనామాలపై నిర్ణయం తీసు కోవడానికి ముందే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్-జేడీఎస్ నేతలు కోరారు. అటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ చీఫ్‌ విప్‌ గణేశ్‌ హుక్కేరీ విప్‌ జారీచేశారు. ఇవాళ జరిగే శాసనసభ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. ఆర్థిక బిల్లు ఆమోదం, ఇతర అంశాలపై చర్చకు హాజరవ్వాలన్నారు. హాజరు కాని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని ఆయన హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story