కర్ణాటక ‘ఉప’ ఫలితాలు.. కౌంటింగ్ ప్రారంభం

Read Time:2 Second

Results

కర్నాటకలో అధికార బీజేపీ భవిష్యత్తు మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప కొనసాగడంపై సందిగ్దతకు తెరపడనుంది. అత్యంత కీలకమైన ఉప ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. 15 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభం అయింది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం అయింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించారు.. ఆ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. పది గంటలలోపు ట్రెండింగ్ తెలిసిపోయే అవకాశముంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందబోస్తు ఏర్పాటు చేశారు.

కర్నాటకలో 15 స్థానాలకు ఈనెల 5న ఉపఎన్నికలు జరిగాయి. ఉప సమరంలో 66.25 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా హోస్కొటేలో 90.90 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా శివాజీనగర్‌లో 48.05 శాతం పోలింగ్ జరిగింది. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌లు హోరాహోరీగా పోరా డాయి. మెజార్టీ సీట్లు దక్కించుకోవడానికి అధికార, విపక్షాలు సర్వశక్తులు ఒడ్డాయి. మరీ ముఖ్యంగా, బీజేపీ నాయకత్వానికి ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. ఎక్కువ సీట్లు సాధించకపోతే ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉండడంతో ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్వయంగా రంగంలోకి దిగారు. కేంద్ర, రాష్ట్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్‌లు కూడా బలమైన పోటీ ఇచ్చాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఓటుతో బుద్ది చెప్పాలని ప్రజలకు విజ్ణప్తి చేశాయి. మరి, ఓటరు దేవుడు ఎవరి మాట విన్నాడో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీకే పట్టం కట్టాయి. మెజార్టీ స్థానాలు కమలదళం ఖాతాలో పడతాయని జోస్యం చెప్పాయి. కాంగ్రెస్, జేడీ ఎస్‌లకు నిరాశ తప్పదని స్పష్టం చేశాయి. కన్నడ పబ్లిక్ టీవీ సర్వే ప్రకారం బీజేపీకి 8-10, కాంగ్రెస్ 3-5, జేడీఎస్ 1-2, ఇతరులు ఒక చోట గెలిచే అవకాశముంది. బీటీవీ సర్వే ప్రకారం బీజేపీ 8-12, కాంగ్రెస్ 3-6, జేడీఎస్ 0-2, ఇతరులు ఒక చోట విజయం సాధి స్తారు. బీజేపీ ప్రభుత్వం మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే మరో ఏడుగురు ఎమ్మెల్యేలు కావాలి. బై ఎలక్షన్లలో కమలదళం కనీసం 7 సీట్లు గెలుచుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.

అటు బెట్టింగ్ రాయుళ్లు కూడా బీజేపీవైపే మొగ్గు చూపుతున్నారు. సర్వేలలోనూ బీజేపీకే మెజార్టీ రావడంతో ఆ పార్టీలో ఉత్సాహం పెరిగింది. మరో మూడేళ్లు నిరంతరాయంగా పాలిస్తామని కమలదళం ధీమా గా చెబుతోంది. జేడీఎస్‌, కాంగ్రెస్‌లను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఐతే, సర్వేలతో ఒరిగేదేమీ లేదని, ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయని కాంగ్రెస్, జేడీఎస్‌ అంటున్నాయి.

జూలై-ఆగస్టు నెలల్లో కర్నాటకలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు స్వతంత్రులు రాజీనామా చేయడంతో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ఐతే నాటి అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. ఐతే, అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేయవచ్చని నవంబర్ 13న సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐతే, కర్నాటక చరిత్రలో ఫిరాయింపుదారులు గట్టెక్కిన ఉదంతాలు 10 శాతం మాత్రమే. దాంతో, కమలదళం కాస్త కంగారు పడుతోంది.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close