కరువు ముప్పు ముంచుకొస్తుంది..ఇక ఆకలి చావులేనా?

కరువు ముప్పు ముంచుకొస్తుంది..ఇక  ఆకలి చావులేనా?

భారతదేశానికి కరువుముప్పు ముంచుకొస్తుంది. వర్షాభావ పరిస్థితులు దేశాన్ని కలవరపెడుతున్నాయి. 42 శాతానికిపైగా భారత భూభాగంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని డ్రాట్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఇది 6% అధికమని తెలిపింది. మే 21 నాటికి 42.18శాతంగా ఉన్న కరువు ప్రాంతం మే 28నాటికి 42.61 శాతానికి పెరిగింది. గతేడాది మే 28 నాటికి దేశంలో 36.74శాతం భూభాగంలో కరుపు పరిస్థితులు నెలకొన్నట్లు పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది.

పశ్చిమ, దక్షిణ భారతదేశంలోని చాలా రిజర్వాయర్లలో నీటి మట్టం గత పదేండ్ల సగటు కంటే చాలా తక్కువగా ఉందని కేంద్ర జల సంఘం వెల్లడించింది. మే 30తో ముగిసిన వారానికి, దేశంలోని 91 ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టం 31.65 బిలియన్ క్యూబిక్ మీటర్లు ఉంది. ఈ రిజర్వాయర్ల మొత్తం నీటి నిల్వ సామర్థ్యంలో ఇది 20 శాతం మాత్రమే. మే 23తో ముగిసిన వారానికి ఇది 21 శాతంగా ఉండేది అని సీడబ్ల్యూసీ తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, రాజస్థాన్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, త్రిపుర, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లోని రిజర్వాయర్లలో గతేడాది కంటే నీటి నిల్వలు భారీగా తగ్గాయని తెలపింది.

భారతదేశంలో జల సంక్షోభం గురించి నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ఆందోళన కలిగిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. మరో రెండేళ్లలో.. అంటే 2020 నాటికి దేశంలోని 21 నగరాల్లో భూగర్భజలాలు అడుగంటుతాయని నివేదిక చెప్పింది. మనం ప్రతి ఏటా నీటి కొరత ఎదుర్కొంటున్నాం. కానీ ఎదురుకాబోతున్న నీటి సంక్షోభం గురించి జనాల్లో అవగాహన అవసరం. మనముందున్న అతిపెద్ద సవాలు ఇదే అంటున్నాయి నీతీఆయోగ్ వర్గాలు.

Tags

Read MoreRead Less
Next Story