బీజేపీ సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ ప్రొఫైల్..

బీజేపీ సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ ప్రొఫైల్..

బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఈ నెల 5వ తేదీన హిమాచల్ ప్రదేశ్‌ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. సోమవారం ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు దత్తాత్రేయ. ఈ సందర్భంగా ఆయనను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఘనంగా సన్మానించింది. దర్శన అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఈ నెల 4న హిమాచల్‌ప్రదేశ్ వెళుతున్నట్లు తెలిపారు. 5న హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా ప్రమాణం చేస్తానని పేర్కొన్నారు..

1947 జూన్ 12న హైదరాబాద్‌లో జన్మించిన దత్తత్రాయే... బాల్యంలోనే ఆరెస్సెస్‌లో చేరారు. స్వయం సేవక్‌గా, ప్రచారక్‌గా జాతీయ భావాలు పుణికిపుచ్చుకున్నారు. సంఘ్ ఆదేశాలతో రాజకీయాల్లో అడుగుపెట్టారు. పార్టీ కార్యదర్శిగా బీజేపీలో ప్రస్థానం ప్రారంభించి.. ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ఇప్పుడు గవర్నర్ స్థాయికి ఎదిగారు. 1991లో తొలిసారి సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి గెలిచారు. 1997లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1998లో రెండోసారి ఎంపీగా ఎన్నికైన ఆయన.. వాజపేయి ప్రభుత్వంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 1999లో వరుసగా మూడోసారి ఎంపీగా విజయం సాధించి మరోసారి కేంద్ర మంత్రి అయ్యారు.అయితే 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 2014 ఎన్నికల్లో నాలుగోసారి ఘన విజయం సాధించిన దత్తాత్రేయ.. మరోసారి కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మోదీ మంత్రివర్గంలో కార్మిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో పార్టీ ఆదేశాలతో పోటీకి దూరంగా ఉన్నారు..

దత్తన్నగా అందరికీ పరిచితులైన దత్తాత్రేయ... హంగులు, ఆడంబరాలకు దూరం. ! పార్టీలు, జెండాలు, అజెండాలు అన్న సంకోచాలు లేని వ్యక్తిత్వం ఆయనది. అందరితోనూ సఖ్యతగా ఉంటారు. మొదటి నుంచి తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించిన నాయకుడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ కీలకపాత్ర పోషించారు. ఆయన సేవల్ని గుర్తించిన బీజేపీ అగ్రనాయకత్వం... మరోసారి కీలక బాధ్యతలు అప్పగించింది. హిమాచల్‌ ప్రదేశ్‌కు గవర్నర్ గా‌ పంపుతోంది.

Tags

Read MoreRead Less
Next Story