జైలు నుంచి పారిపోయేందుకు ఖైదీ ‘జబర్దస్త్’ ప్లాన్.. తనను చూడ్డానికి వచ్చిన కూతురిని గదిలో పెట్టి..

దొరికితే కదా దొంగ.. దొరక్కపోతే దర్జాగా బతికేయొచ్చు. కష్టపడి పైసా పైసా కూడబెట్టి.. ఎప్పుడు కట్టాలి మేడలు. అదే అడ్డదారులు తొక్కి సంపాదిస్తే హాయిగా కోటీశ్వరుడైపోవచ్చు. ఆ దొంగ గారి ఇన్‌టెన్షన్ అదే అతడిని కటకటాల పాల్జేసింది. బ్రెజిల్‌లో డ్రగ్స్‌ను తరలించే కరుడుగట్టిన నేరగాళ ముఠా రెడ్ కమాండ్‌ను నడిపిస్తున్న లీడర్లలో సిల్వా ఒకడు. ఆయన ఓసారి పట్టుబడి పోలీసుల చేతికి చిక్కాడు. జైల్లో చిప్ప కూడు తింటూ కూర్చోవాల్సి వచ్చింది. ఇలా ఉండగా ఓ రోజు తండ్రి సిల్వాను చూడ్డానికని 19 ఏళ్ల కుమార్తె జైలుకు వెళ్లింది. అక్కడ ఖైదీలు బంధువులను కలుసుకునే గదిలో కూర్చొని తండ్రితో మాట్లాడింది. కొద్ది సేపటి తరువాత ఆమె తెచ్చిన సిలికాన్ మాస్క్ ధరించాడు సిల్వా. అచ్చంగా ఆమెలా మారిపోయాడు. కూతురిని గదిలోనే ఉంచి.. ఆమె బదులు అతడు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఎవరూ గుర్తుపట్టకూడదని కళ్లజోడు కూడా పెట్టుకున్నాడు. జైలు సిబ్బందికి ఎందుకో అనుమానం వచ్చింది. అతడిని అడ్డగించి మాటలు కలిపారు. ముఖం మార్చుకున్నా గొంతు మారకపోవడంతో అతడి బండారం బయటపడింది. సిబ్బంది సిల్వాను తీసుకెళ్లి మరింత భద్రత ఉన్న సెల్లో వేశారు. తండ్రికి సహకరించిందన్న కారణంతో సిల్వా కుమార్తెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిల్వా మాస్కును తొలగిస్తున్న వీడియోను అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడది వైరల్ అవుతోంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *