ఆగ్రహంతో రగిలిపోతున్న కోనప్ప

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గులాబీలో కల్లోలం. గురుశిష్యులుగా పేరున్న ఇంద్రకరణ్ రెడ్డికి.. కోనేరు కోనప్పకు మధ్య గ్యాప్ పెరిగిందా.?

కొద్ది వారాలుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీనియర్ నేతలుగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి.. ఎమ్మెల్యే కోనప్పకు మధ్య దూరం పెరిగింది. ఒకప్పుడు ఇద్దరు వేర్వేరుకాదు.. ఒక్కటే అన్నట్టుగా ఉండేవారు. కానీ ఇటీవల కాలంలో వారి మధ్య గ్యాప్ తారా స్థాయికి చేరినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఫారెస్టు అధికారులపై దాడి ఘటన నుంచి ఇద్దరి మధ్య వార్ మొదలైందని చెబుతున్నారు. సిర్పూర్ ఎమ్మెల్యేకు ఫారెస్ట్ అధికారుల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో నెలకొన్నాయి. ఈ క్రమంలో ఫారెస్ట్ సిబ్బందిపై ఎమ్మెల్యే వర్గం భౌతిక దాడులకు దిగడంతో కోనేరు కోనప్ప సోదరుడు, అనుచరులు జైలు పాలయ్యారు. అయితే ఈ ఘటనలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తమకు సహకరించకపోవడం, ఫారెస్ట్ అధికారులకు అండగా ఉండటం కోనప్ప వర్గానికి మింగుడు పడలేదు. ఈ సంఘటనపై పార్టీ అధిష్టానం వద్ద తమ తరపున వాదిస్తాడని భావించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి... రివర్స్ అవడంతో కోనప్ప ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

ఎంపీ ఎన్నికల్లో తన నియోజకవర్గంలో పార్టీకి భారీ మెజార్టీ సాధించిపెట్టినా... పదవి రాకపోవడంతో కోనప్ప కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. కీలక పదవి వస్తుందని ఆశించినా... మంత్రి అడ్డుకున్నారన్న ప్రచారం ఆయనలో మరింత ఆగ్రహానికి గురిచేసినట్టు చెబుతున్నారు. తమ నాయకుడికి పదవి రాకుండా ఇంద్రకరణ్ రెడ్డి అడ్డుకుంటున్నారని కోనప్ప వర్గం బాహాటంగానే చెబుతోంది.దీంతో ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి కొమురంభీం జిల్లా కేంద్రంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వర్గం హాజరుకాలేదు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి కూడా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తోపాటు ఆయన వర్గ జడ్పీటీసీలు, ఎంపీపీలు డుమ్మా కొట్టారు. మంత్రి తీరు నచ్చకే తాము కార్యక్రమాలకు రావడం లేదని ఎమ్మెల్యే వర్గం అంటోంది. మొత్తానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురుశిష్యులుగా పేరొందిన ఇంద్రకరణ్ రెడ్డి, కోనప్ప మధ్య విబేధాలు ఏ పరిణామాలకు దారితీస్తాయో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story