విష రసాయనాలతో ప్రమాదకరంగా మారిన గోదావరి

విష రసాయనాలతో ప్రమాదకరంగా మారిన గోదావరి

జీవనది గోదావరి.. గరళ గోదారిగా మారుతోంది. తెలుగు రాష్ట్రాల గొంతును, సాగును తడిపే గోదావరి ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. విష రసాయనాలతో నురగ ప్రవాహమై పోటెత్తుతోంది. పలు ప్రాజెక్టులు కాలుష్య కాసారాలతో నిండిపోయాయి. మనుషులకే కాదు.. నీటిలోని మూగజీవాలకు, మత్స్య సంపదకు ముప్పు వాటిల్లుతోంది.

బాసరకు సమీపంలోని మహారాష్ట్ర భూభాగంలో ఉన్న ఓ ఆల్కహాల్ ఫ్యాక్టరీ గోదావరి నది స్వచ్ఛతను ప్రశ్నార్థకం చేస్తోంది. వ్యర్థాలను, ఇతర రసాయనాలను విచ్చలవిడిగా గోదావరిలోకి వదులుతోంది. యథేచ్ఛగా రసాయన వ్యర్థాలను గోదావరిలో డంప్‌ చేస్తుండడంతో మూగజీవాలు, చేపలు మృత్యువాత పడుతున్నాయి. మహారాష్ట్ర భూభాగంలో పదేళ్ల క్రితం ప్రారంభమైన ఆల్కహాల్‌ ఫ్యాక్టరీలో... మొదట ముడిసరుకు మాత్రమే తయారయ్యేది. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఆ ఫ్యాక్టరీ ఇప్పుడు వందెకరాలకు విస్తరించింది. ఆల్కహాల్‌ను తయారు చేస్తోంది. ఫలితంగా మొలాసిస్‌, బార్లీ వ్యర్థాలు భారీగా ఉత్పత్తి అవుతున్నాయి.

ఏడాది పొడవునా ఆ వ్యర్థాలను నిల్వ ఉంచుతున్న ఫ్యాక్టరీ యాజమాన్యం.. ఎగువన భారీ వర్షాలు, వరదలు వచ్చే సమయంలో గోదావరిలో కలిపేస్తోంది. తాజాగా ఆ వ్యర్థాలు ఇప్పుడు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు చేరాయి. నదీజలాల రంగు పూర్తిగా మారిపోయింది. నురగ విషం కక్కుతోంది. ఈ రసాయన వ్యర్థాలతో నది పరీవాహక ప్రాంతాల్లోని పంటల దిగుబడి తగ్గి పోయే ప్రమాదం ఏర్పడింది. అంతే కాదు ఇవి తాగిన మనుషులు రోగాల బారిన పడే పరిస్థితి వస్తోంది.

ఈ ఫ్యాక్టరీ జల కాలుష్యాన్నే కాదు వాయు కాలుష్యాన్ని కూడా రెట్టింపు చేస్తోంది. గడిచిన రెండు రోజులుగా వ్యర్థాలకు సంబంధించిన ఘాటైన వాసనలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. ముక్కులు పగిలేలా వాసన వస్తోంది. వాయుకాలుష్యం ప్రభావంతో బాసరలో ఉండే దాదాపు 7 వేల మంది విద్యార్థులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అక్కడ శ్వాస తీసుకోవడం అతి కష్టంగా మారింది. ఇప్పటికైనా అధికారులు గోదావరి కాలుష్యం కాకుండా పరిరక్షించాలని.. ఆల్కహాల్‌ ఫ్యాక్టరీ వదులుతున్న మహా గరళానికి అడ్డు కట్ట వేసి.. జీవనదిని పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story