కనువిందు చేసిన చంద్రగ్రహణం

కనువిందు చేసిన చంద్రగ్రహణం

దేశవ్యాప్తంగా పాక్షిక చంద్రగ్రహణం కనువిందు చేసింది. అర్థరాత్రి 1.31 నిమిషాలకు మొదలైన గ్రహణం 4.30 వరకు కనిపించింది.. ప్రపంచ వ్యాప్తంగా 179 నిమిషాలపాటు గ్రహణాన్ని వీక్షించే అవకాశం కలిగింది. ఇక చంద్రగ్రహణాన్ని దేశవ్యాప్తంగా కోట్లాది మంది చూసి అద్భుతమైన అనుభూతిని పొందారు. హైదరాబాద్‌, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పుణె నగరాల ప్రజలకు చంద్రగ్రహణం కనువిందు చేసింది. అయితే, కొన్ని చోట్ల ఆకాశం పూర్తిగా మేఘావృతం కావడంతో గ్రహణాన్ని చూసే అవకాశం లేకుండా పోయింది.

అర్ధరాత్రి తర్వాత 12.12 గంటలకు చంద్రుడు భూమి ఉపఛాయలోకి ప్రవేశించాడు. ఈ సమయంలో చంద్రుడి చుట్టూ పలుచని నల్లటి పొర ఆవరించినట్టు కనిపించింది. తర్వాత 1.31 నిమిషాలకు భూమి ప్రచ్ఛాయలోకి చంద్రుడు ప్రవేశించడంతో గ్రహణం ప్రారంభమైంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో గరిష్ఠ గ్రహణం కనువిందు చేసింది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖపై రావడంతో కొద్ది క్షణాల పాటు భూమి నీడ కారణంగా చంద్రుడిని పూర్తిగా చీకటి అలముకుంది. 4.30 గంటలకు భూమి ప్రచ్ఛాయ నుంచి చంద్రుడు బయటకు రావడంతో గ్రహణం ముగిసినట్టయింది. ఈ పాక్షిక చంద్రగ్రహణం అరుణాచల్‌లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశమంతా కనువిందు చేసింది.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వాటిచుట్టూ ఉన్న కొన్ని ద్వీపాలు, ఆఫ్రికా దేశంలో గ్రహణం పట్టే, విడిచే దృశ్యాలను చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. భూమి ప్రచ్ఛాయలోకి చంద్రుడు ప్రవేశించే దృశ్యాన్ని న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఉత్తర, దక్షిణ కొరియా, రష్యాలోని కొన్ని ప్రాంతాల వారు ప్రత్యక్షంగా చూశారు. అలాగే అర్జెంటీనా, చిలీ, బొలీవియా, పెరూ, దక్షిణ అట్లాంటిక్ సముద్రం, బ్రెజిల్‌లోని కొన్ని ప్రాంతాల వారు గ్రహణం ముగిసి చంద్రుడు బయటికొచ్చే దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించారు.

Tags

Read MoreRead Less
Next Story