కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో తీర్పు వెల్లడించనున్న ఐసీజే..

కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో తీర్పు వెల్లడించనున్న ఐసీజే..

భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం ఇవాళ ( బుధవారం) తీర్పు వెల్లడించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు తీర్పు రానుంది. మనకు అనుకూలంగానే తీర్పు వస్తుందని భారత్‌ ధీమా వ్యక్తం చేస్తోంది. అటు ఐసీజే ఎలాంటి ఆదేశాలు ఇచ్చిన పాటిస్తామని పాకిస్తాన్‌ అధికారులు కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. ఐసీజే తీర్పు కోసం భారతీయులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు

భారత్‌కు చెందిన రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ కోసం కుల్‌భూషణ్‌ గూఢచర్యానికి పాల్పడినట్టు ఆరోపిస్తూ... పాకిస్థాన్‌ ఆయనను బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో 2016 మార్చి 3న అరెస్టు చేసింది. గూఢచర్యానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్టు నిర్ధారిస్తూ 2017 ఏప్రిల్‌లో మిలటరీ కోర్టు కుల్‌ భూషన్‌కు మరణ శిక్ష విధించింది. అయితే ఇరాన్‌లో వ్యాపారం చేసే తమ నేవీ మాజీ అధికారి కుల్‌భూషన్‌ను పాక్‌ ఉద్దేశపూర్వకంగా కిడ్నాప్‌ చేసినట్లు భారత్‌ ఆరోపించింది. 2017 డిసెంబరులో జాదవ్‌ను ఆయన తల్లి, భార్య కలిసే సమయంలో పాకిస్తాన్‌ మూర్ఖంగా ప్రవర్తించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఒప్పందాలను, తీర్మానాలను ఉల్లంఘించిన పాక్‌పై ఐసీజేలో పిటిషన్‌ దాఖలు చేసింది భారత్‌. జాదవ్‌ మరణ శిక్షను రద్దు చేయాలని.. వెంటనే ఆయనను విడుదల చేయాలని కోరింది. దీనిపై విచారణ చేపట్టిన ఇంటర్నేషనల్‌ కోర్టు...తుది తీర్పు వెలువడే వరకూ మరణ శిక్షను నిలిపివేయాలని పాక్‌ను ఆదేశించింది.

ఈ కేసులో ఐసీజే పునర్విచారణకు ఆదేశిస్తుందా అన్న అనుమానాలు కూడా భారత్‌ను వెంటాడుతున్నాయి. గూఢచర్యానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఇండియాకు చెందిన సరబ్జిత్‌ సింగ్‌కు సైతం గతంలో పాకిస్థాన్‌ మరణ శిక్ష విధించింది. 22 ఏళ్ల పాటు పాక్‌ జైలులో మగ్గిపోయిన సరబ్‌జిత్‌.. జైలులో పాక్‌ ఖైదీలు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ముంబైకి చెందిన టెకీ అన్సారీని కూడా గతంలో ఆ దేశం లాహోర్‌ జైలులో నిర్బంధించింది. అయితే భారత్‌ జోక్యంతో గతేడాది అతన్ని విడుదల చేశారు. ఈ రెండు ఘటనల నేపథ్యంలో జాదవ్‌ కేసుపై పునర్విచారణ జరపాల్సిందిగా అంతర్జాతీయ న్యాయ స్థానం ఆదేశించవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story