తెలంగాణకు భారీ పెట్టుబడులు : మంత్రి కేటీఆర్

తెలంగాణకు భారీ పెట్టుబడులు : మంత్రి కేటీఆర్

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పరిశ్రమలు, ఐటీరంగంలో అనేక కంపెనీలు ప్రభుత్వంతో చర్చిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా పుడ్ ప్రాసెసింగ్, ఏరోస్పేస్, ఎలక్ర్టానిక్స్, లాజిస్టిక్స్, ఐటి రంగాల్లో రానున్న కొన్ని నెలల్లోనే భారీ పెట్టుబడులు రానున్నాయని మంత్రి చెప్పారు. పరిశ్రమలు, ఐటీ శాఖ విభాగాధిపతులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.. రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌ ఐఐసీ చేపట్టిన ఫార్మాసిటీ, జహీరాబాద్‌ నిమ్జ్‌, కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌, సిరిసిల్ల అపారెల్‌ పార్క్‌లతో పాటు ఇండస్ట్రియల్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీల నుంచి వచ్చిన ప్రపోజల్స్‌ను మంత్రికి వివరించారు అధికారులు.

రాష్ర్టానికి ఎన్ని ఎక్కువ పెట్టుబడులు వస్తే అన్ని ఉద్యోగావకాశాలు వస్తాయని కేటీఆర్ అన్నారు. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుబడులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. రానున్న నాలుగేళ్ల కాలానికి అవసరమైతే కార్యాచరణపై విభాగాల వారీగా నివేదిక ఇవ్వాలన్నారు.. వచ్చే నెలలో పలు భారీ పెట్టుబడులకు శంకుస్థాపన చేయనున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. పలు కంపెనీలు ఇప్పటికే టీఎస్‌ ఐపాస్‌ ద్వారా అనుమతులు తీసుకున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న కంపెనీలకు పూర్తి సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు. మౌలిక సదుపాయాల కల్పన పూర్తయిన పార్కుల్లో మరిన్ని కంపెనీలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని మంత్రి కేటీఆర్‌ అదేశించారు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story