ఎవరిని నిలపాలో మాకు తెలియదా : ఎంపీ కోమటిరెడ్డి

ఎవరిని నిలపాలో మాకు తెలియదా : ఎంపీ కోమటిరెడ్డి

హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక కాంగ్రెస్‌లో చిచ్చురాజేసింది. వర్గాలవారీగా విడిపోయిన నేతలు..విమర్శలు, ప్రతివిమర్శలతో ఒక్కసారిగా హీట్‌ను పెంచేశారు. తాజాగా భువనగిరి ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ఇచ్చారు. హుజూర్‌నగర్‌లో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలో తమకు తెలుసని అన్నారు. ఈ మధ్యే పార్టీలోకి వచ్చిన వారి సలహాలు, సూచనలు తమకు అక్కర్లేదన్నారు. హుజూర్ నగర్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తున్న పేరు.. తనకే కాదు జానారెడ్డికి తెలియదన్నారు వెంకట్‌రెడ్డి.

ఈ బైపోల్‌లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేది పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతే అని స్పష్టం చేశారు. గతంలో జానారెడ్డి, ఉత్తమ్‌తో అభిప్రాయబేధాలు ఉన్నమాట వాస్తవమేనని కానీ ఇప్పుడు తామంతా ఒక్కటయ్యామని చెప్పారు వెంకట్‌రెడ్డి. కాంగ్రెస్‌లోని పాతతరం నేతలంతా తననే పీసీసీ చీఫ్‌గా ఉండాలని కోరుతున్నారంటూ చెప్పుకొచ్చారు వెంకట్‌రెడ్డి..

హుజూర్‌నగర్‌లో అభ్యర్థి పేరుపై పార్టీలో ఇంతవరకూ చర్చే జరగలేదని.. అలాంటప్పుడు ఉత్తమ్‌ ఏకపక్షంగా పద్మావతిరెడ్డి పేరును ఎలా ప్రకటిస్తారని రేవంత్‌ రెడ్డి నిలదీస్తున్నారు. పార్టీ అభ్యర్థిగా స్థానిక నేత అయిన చామల కిరణ్‌రెడ్డి పేరును తాను ప్రతిపాదిస్తున్నానని రేవంత్‌ చెబుతున్నారు. పద్మావతి పేరు ప్రకటనపై ఉత్తమ్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వివరణ తీసుకోవాలని... కుంతియాను రేవంత్‌ రెడ్డి కోరినట్టు తెలుస్తోంది.

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఆందోళన నిర్వహించారు. ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.. రేవంత్ తన మాటల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.. అటు హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో పద్మావతిరెడ్డే కాంగ్రెస్ అభ్యర్థి అని ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ అన్నారు... పార్టీని ధిక్కరిస్తున్న రేవంత్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story