మరణమృదంగం.. 23 మంది సజీవదహనం

మరణమృదంగం.. 23 మంది సజీవదహనం

పంజాబ్‌లోని బాణాసంచా ఫ్యాక్టరీలో మరణమృదంగం మోగింది. అగ్నికీలల్లో చిక్కుకొని 23 మంది సజీవదహనం అయ్యారు. మరో 27 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. పేలుడు ధాటికి బాణసంచా ఫ్యాక్టరీ భవనం పూర్తిగా దెబ్బతింది. పరిసరాల్లో ఉన్న మూడు, నాలుగు భవనాలు దెబ్బతిన్నాయి. దీంతో ఇంకా శిథిలాల కింది కొందరు ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. శిథిలాల తొలగింపు చర్యలు కొనసాగుతున్నాయి.

గురుదాస్‌పూర్‌ బటాలాలోని నివాస ప్రాంతాల్లో ఉన్న బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో భారీగా పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. భారీ పేలుడు ధాటికి బాణసంచా ఫ్యాక్టరీ భవనం మొత్తం పూర్తిగా దెబ్బతింది. దీనికి తోడు దగ్గరలో ఉన్న మూడు, నాలుగు భవనాలు సైతం దెబ్బతిన్నాయి. పార్కింగ్‌ చేసిన వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 50 మంది ఉన్నట్టు తెలుస్తోంది.

పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండడంతో NDRF బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు సమాచారం తెలుసుకున్న పోలీసులు, వెంటనే ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. రాత్రి సహాయక చర్యలకు కాస్త ఇబ్బంది అవ్వడంతో.. తెల్లవారుజాము నుంచి శిథిలాల తొలగింపు మళ్లీ మొదలైంది. బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడుపై పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story