శ్రీశైలం రిజర్వాయర్‌కు భారీగా వరదనీరు

కర్నాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టు, సుంకేసుల డ్యామ్‌ల ద్వారా శ్రీశైలం రిజర్వాయర్‌కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. జూరాల ద్వారా 3 లక్షల క్యూసెక్కులు వస్తోంది. కొద్దిరోజులుగా వరద వస్తున్నా తక్కువగానే ఉండటంతో కొద్ది గేట్లను మాత్రమే తెరిచి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. అయితే, ఉన్నట్టుండి వరద ప్రవాహం భారీగా పెరిగింది.. దీంతో నిన్న ఉదయం 8 గేట్లను ఎత్తారు. మధ్యాహ్నానికి ఇన్‌ఫ్లో మరింత పెరగడంతో 10 గేట్లను పది అడుగులు ఎత్తి సాగర్‌కు నీటిని మళ్లిస్తున్నారు.. శ్రీశైలం పదిగేట్లను ఎత్తడం నెలరోజుల్లో ఇది రెండోసారి. ప్రస్తుతం నీటిమట్టం 884.5 అడుగులుగా ఉండగా.. 213 టీఎంసీల నీరు నిల్వ నమోదవుతోంది..

శ్రీశైలం డ్యాం నుంచి సాగర్‌కు వస్తున్న ఇన్‌ఫ్లో భారీగా పెరగడంతో మరోసారి డ్యామ్‌ 26 క్రస్ట్ గేట్లు తెరిచారు. గురువారం నీటి వరద తగ్గడంతో గేట్లను మూసివేసిన అధికారులు.. వరద పెరగడంతో మళ్లీ గేట్లను తెరిచారు. మొదట ఆరు గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు.. వరద ఉధృతి మరింత పెరగడంతో 26 గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి 3.5 లక్షల క్యూసెక్కుల నీరు సాగర్‌లోకి వస్తోంది.. నీటిమట్టం గరిష్టస్థాయికి చేరుకుంది.. కుడికాల్వకు పదివేలు, ఎడమకాల్వకు 9 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. క్రస్ట్‌ గేట్ల ద్వారా 3.7 లక్షల క్యూసెక్కులు.. మొత్తం 4.3 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. ఇన్‌ఫ్లో మరింత పెరగడంతో సాగర్‌ నుంచి శ్రీశైలానికి వెళ్లే లాంచీని నేడు రద్దు చేశారు అధికారులు.

నాగార్జున సాగర్‌ నుంచి అవుట్‌ఫ్లో పెరగడంతో ఆ నీరంతా పులిచింతల ప్రాజెక్టుకు పోటెత్తుతోంది.. వరద పోటుతో పులిచింతల దగ్గర కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.. శుక్రవారం సాయంత్రం నాటికి 174.7 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. 3.71 లక్షల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది.. పదిగేట్ల ద్వారా 3.28 లక్షల క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీకి వదులుతున్నారు.. అవుట్‌ ఫ్లో భారీగా ఉండటంతో ప్రాజెక్టు దిగువన ఉన్న గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతోంది.. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు విడిచిపెడుతున్నారు. దీంతో ఆ వరద మొత్తం ప్రకాశం బ్యారేజీలోకి వస్తోంది.. దీంతో బ్యారేజీ అన్ని గేట్లను ఎత్తి నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *