వీరికి మంత్రి పదవులు ఖాయమా?

వీరికి మంత్రి పదవులు ఖాయమా?

గ‌తేడాది డిసెంబ‌ర్ 13న కేసిఆర్‌తో పాటు మ‌హ‌మూద్ అలీ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారు. నాలుగు నెల‌ల త‌ర్వాత మ‌రో ప‌ది మందికి మంత్రి ప‌దవులు ద‌క్కాయి. ఇక మిగిలిన ఆరు మంత్రి పదవులను పెండింగ్‌లో పెట్టారు సీఎం కేసిఆర్. దీంతో సెప్టెంబ‌ర్ రెండో వారంలో కేబినెట్ విస్తర‌ణ జ‌ర‌గ‌డం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఖచ్చితంగా పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పడుతుంద‌ని అంద‌రూ ఆశ ప‌డుతున్నారు. ఆగ‌ష్టు 15వ తేదీనుంచి పూర్తి స్థాయిలో పరిపాల‌న ఉంటుంద‌ని సీఎం కేసిఆర్ స్వయంగా ప్రకటించడంతో.. కేబినెట్‌ విస్తర‌ణ ఖాయమని ధీమాగా ఉన్నారు. ఈ మేరకు వ‌చ్చే నెల‌ల్లో పూర్తి స్థాయిలో మంత్రివ‌ర్గ విస్తర‌ణ జరుగ‌బోతున్నట్టు సీనియ‌ర్ నేత‌ల‌కు సంకేతాలు అందాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.

మంత్రి వర్గ విస్తరణ ప్రచారంతో మంత్రి పదవులు దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు ఆశావహులు. అయితే పూర్తి స్థాయి మంత్రి వ‌ర్గ విస్తర‌ణ‌లో అన్ని సామాజిక వ‌ర్గాల‌కు స్థానం కల్పిస్తూ... కొత్త వారికి అవ‌కాశాలు కావాలంటే... ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్న ఒక‌రిద్దరికి ఉద్వాస‌న ప‌ల‌క‌క‌ త‌ప్పేట్టు లేదు. ఇప్పుడున్న మంత్రివ‌ర్గంలో రెడ్డి సామాజిక వ‌ర్గం నుంచి ఐదుగురు, వెలమ సామాజిక వ‌ర్గం నుంచి ఇద్దరు, బీసీ సామాజిక వ‌ర్గం నుంచి ముగ్గురు, ఎస్సీ సామాజిక వ‌ర్గం నుంచి ఒక్కరు, మైనారిటీ నుంచి ఒక్కరు ఉన్నారు. అయితే కొత్త వారికి మొద‌టి ద‌ఫాలో ఎక్కువ అవ‌కాశాలు ద‌క్కాయి. కానీ మిగిలిన ఆరు స్థానాల‌కు మాత్రం పూర్తిగా సీనియ‌ర్లకే ఛాన్స్ ద‌క్కబోతున్నట్టు స‌మాచారం. వెల‌మ సామాజిక వ‌ర్గం నుంచి మాజీ మంత్రులు కేటీఆర్, హ‌రీష్ రావులను కేబినెట్లోకి తీసుకోవడం ఖాయ‌మంటున్నాయి పార్టీ వ‌ర్గాలు. ఇక ఇప్పటికే ఆరుగురు రెడ్డి మంత్రులున్నా.. మ‌ళ్లీ రెడ్డి సామాజిక వ‌ర్గం నుంచి మాజీ మంత్రి స‌బితా ఇంద్రా రెడ్డి, గుత్తా సుఖేంద‌ర్ రెడ్డికి అవ‌కాశాలున్నాయి. ఒక‌వేళ అదే జ‌రిగితే ఖ‌చ్చితంగా ఇదే సామాజిక వ‌ర్గానికి చెందిన ఓ మంత్రికి చెక్ ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని పార్టీలో చ‌ర్చ జరుగుతోంది. ఇప్పుడున్న కేబినెట్‌లో క‌మ్మ సామాజిక వ‌ర్గానికి అవ‌కాశం ఇవ్వలేదు కాబ‌ట్టి విస్తర‌ణ‌లో గ్యారంటీగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు మ‌రో ఛాన్స్ ఇవ్వనున్నట్టు టాక్‌ నడుస్తోంది. ఇక ఎస్టీ సామాజిక వ‌ర్గానికి, మున్నూరు కాపుల‌కు ఈ కేబినెట్‌లో బెర్తు ఏ మేర‌కు ఉంటుంద‌నేది తేలాల్సి ఉంది. అలా చేయాలంటే క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన వినోద్‌కు కేబినెట్ ర్యాంకు ప‌ద‌వి ద‌క్కడంతో... ఆ జిల్లా నుంచి మున్నూరు కాపుకు అవ‌కాశం ఇవ్వాలంటే ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్న సీనియర్‌ మంత్రిని త‌ప్పిస్తారనే మాట వినిపిస్తోంది.

ఏది ఏమైనా చాలాకాలం త‌ర్వాత పూర్తి స్థాయి కేబినెట్ విస్తర‌ణ జ‌రుగ‌బోతుండ‌టంతో ఆశావాహుల సంఖ్య ఎక్కువ‌గా ఉంది. చివ‌రి అవ‌కాశం కోసం ప్రయ‌త్నాలు ముమ్మరం చేశారు ప‌లువురు సీనియ‌ర్లు. దీంతో ప్రస్తుత కేబినెట్‌లో ఉన్నవారిపై ఖ‌చ్చితంగా ప్రభావం ఉంటుద‌ని ఆ పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. చాలా కాలం త‌ర్వాత జ‌రగ‌బోయే ఫైన‌ల్ కేబినెట్ విస్తర‌ణ‌లో ఎవ‌రెవ‌రికి అమాత్య యోగం ద‌క్కేనో.. ఎవ‌రెవ‌కి మంత్రి ప‌ద‌వులు ఊడేనో చూడాలి మ‌రి.

Tags

Read MoreRead Less
Next Story