పెళ్ళి చేసుకుంటున్నారా? అయితే..

పెళ్ళి చేసుకుంటున్నారా? అయితే..

ఉన్నది ఒక్కటే జీవితం. ఏం సాధించినా అందులోనే. ఆ జీవితాన్ని అర్ధాంతరంగా కాలదన్నుకుంటే? అక్కడితోనే మన కథ పరిసమాప్తమవుతుంది! చాలా మంది ఊహల్లో బతుకుతారు. భవిష్యత్ అలానే ఉంటుంది అనుకుంటారు. ముఖ్యంగా పెళ్ళి చేసుకునే యువతీ యువకులు ఆలోచనలు వాస్తవానికి దూరంగా ఉంటున్నాయి. వారు వాస్తవిక ప్రపంచానికి దూరంగా బతుకుతున్నారు. వివాహ బంధాన్ని మధ్యలోనే కాలదన్నుకుంటున్నారు.

కొత్త మురిపెం కొన్నాళ్ళే అన్నట్టుగా.. పెళ్లైన కొత్తలో ఒకరికొకరి మధ్య అన్యోన్యత ఉన్నా ఆ తర్వాత అది కనిపించదు. నవ జంట కొద్ది రోజులు బాగానే ఉన్నా ఆ తర్వాత ఒక్కొక్కటిగా లోపాలు బయటపడుతూనే ఉంటాయి. ఒకరికొకరు నిందించుకుంటూ ఎదుటివారిలో లోపాలు వెతుకుతుంటారు. చివరకు బంధం బలహీనపడి శాశ్వత తెగతెంపుల వరకు వెళుతుంది. అయితే భార్యాభర్తల్లో ఇలాంటి సమస్య ఎదురుకాకుండా ఉండాలంటే పెళ్లికి ముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఓ సారి తెలుసుకుందాం..

పెళ్ళి ముందు ఉన్న వాతావరణం వేరు వివాహం తర్వాత ఉండే వాతావరణం వేరు. పెళ్ళి తర్వాత ఓ భిన్నమైన వాతావరణంలోకి అడుగు పెడుతున్నామన్న విషయాన్ని మరిచిపోవద్దు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. భిన్నమనస్కులు ఆ వాతావరణంలో ఉంటారు. వారి నుంచి సమస్యలు రాకుండా ఉండాలంటే.. ముందే వారి ఆచార, వ్యవహారాలను ఆలోచన విధానాన్ని తెలుసుకోవాలి. అలా కాకుండా మీ పాత అలవాట్లను వారి ముందు ప్రదర్శించి.. మేమైతే అలా చేస్తామంటూ వాదించడం వల్ల మీపై నెగిటివ్ అభిప్రాయం వుండే అవకాశం ఉంటుంది.

మీ జీవిత భాగస్వామి కోసం మీ అలవాట్లను అప్పటికప్పుడు మార్చుకునే ప్రయత్నం చేయొద్దు. మీ శ్రీవారి కోసం మీ మనసుకు నచ్చని పని చేయడానికి ప్రయత్నించొద్దు. అది మీలో ఒత్తిడిని పెంచి తీవ్ర అసంతృప్తికి దారి తీసే అవకాశం ఉంది. ఇది మీ అన్యోన్యతను దెబ్బతీస్తుంది. మీకున్న భావాలను ఒకరినొకరు పంచుకోండి. ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోండి. అప్పుడు మీకు ఇష్టమైన పని ఎదైనా చేసినప్పడు అది మీ మధ్య అనవసర వాదనలకు తావివ్వదు. మీ ఆలోచనలను ఎదుటివారికి స్పష్టం చేయండి. ఇంట్లో ఉండేవారి మనస్తత్వం ఎలా ఉంటుందో అర్థం చేసుకుని వారిలోని లోపాలు వెతికే ప్రయత్నం చేయకండి. వారు అలానే ఉంటారు అనుకుని పట్టించుకోవడం మానేయండి.

భార్యాభర్తల మధ్య అనుబంధం అనేది నమ్మకం. దీని ఆధారంగానే జీవితం బలపడుతుంది. కలిసిమెలసి జీవితం పంచుకునే క్రమంలో ఒకరి పట్ల ఒకరికి నిర్దిష్టమైన నమ్మకాలు ఏర్పడతాయి. ఒకరికొకరు పొందే ప్రేరణ, ఒకరికొకరు ఏర్పరుచుకునే నమ్మకం, బలమైన ఆత్మీయ బంధానికి దారి తీస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story