షూటింగ్‌కు వెళ్లి లేటుగా ఇంటికి వస్తున్నాడని నటుడి భార్య..

షూటింగుల పేరుతో భర్త ఇంటికి లేటుగా రావడాన్ని భరించలేకపోయింది. దీంతో మనస్థాపం చెంది బలవంతంగా ప్రాణంతీసుకుంది టీవీ సీరియల్స్‌లో నటిస్తున్న మధు ప్రకాష్ భార్య భారతి. వీరికి 2014లో వివాహమైంది. మణికొండలోని పంచవటి కాలనీలో భర్త, అత్త మామలు, మరిదితో కలిసి నివసిస్తోంది. భారతి ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తోంది. షూటింగ్ ఉందంటూ రోజూ ఉదయం బయటకు వెళ్లి అర్థరాత్రి సమయంలో ఇంటికి తిరిగి వస్తుంటాడు మధు ప్రకాష్. దీంతో భర్త తనను అసలు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేసేది భారతి బంధుమిత్రుల దగ్గర. ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో సోమవారం (ఆగస్ట్ 5) రాత్రి ఆలస్యంగా వచ్చిన భర్తపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది భారతి. మంగళవారం ఉదయం నిద్ర లేచిన మధు ప్రకాష్ జిమ్‌కు వెళ్లి అక్కడి నుంచే షూటింగ్‌కు వెళ్లిపోయాడు. దీంతో మనస్థాపానికి గురైన భారతి భర్తకు వీడియో కాల్ చేసి తాను తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నానని చెప్పింది. ఆందోళన చెందిన మధు హుటాహుటిన ఇంటికి రాగా బెడ్‌రూమ్ తలుపు వేసి ఉంది. ఎంత పిలిచినా పలకకపోవడంతో మారు తాళంతో తలుపు తెరవగా భారతి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అత్తమామలను ప్రశ్నించారు. భారతి బలవన్మరణానికి కారణం కుటుంబ కలహాలేనా లేక మరేదైనా కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *