'చిత్రం'తో వచ్చాడు.. చిత్రంగా మాయమయ్యాడు..

చిత్రంతో వచ్చాడు.. చిత్రంగా మాయమయ్యాడు..

వెండితెరపై చిత్రంగా వచ్చాడు. ఆచిత్రం చెప్పిన కథ పూర్తి కాకుండానే కనుమరుగయ్యాడు. ఎంతో మందికి మనసంతా నిండిపోయాడు. కానీ అతని మనసును గెలుచుకున్న వారే తగ్గిపోయారు. కోట్లమంది అభిమానులను సంపాదించుకున్న చోటే ఆత్మాభిమానం దెబ్బతింటుంటే, ఆవేశమో, ఆవేదనో.. తెలియని తనమో.. మొత్తంగా ఊపిరి తీసుకున్నాడు. కానీ ఉదయ్.. నీ స్నేహం ఇక రాదు అని తెలిసి ఎన్ని హృదయాలు బరువెక్కాయో నీకు తెలియదోయ్.. నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారీ బాధ కలుగుతుంది.. ఆ తర్వాత చాలా తొందరపడ్డావన్న కోపమూ వస్తుంది.. ఇవాళ ఉదయ్ కిరణ్ జయంతి..

ఆ కళ్లల్లో కోటి కాంతుల వెలుగులు.. నవ్వుల్లో కొండంత ఆత్మవిశ్వాసం.. నవ్వితే పడే బుగ్గ సొట్టల్లో ఎంతమంది అమ్మాయిల మనసులు నలిగిపోయాయో చెప్పలేం. అతి చిన్న వయసులోనే మోయలేని స్టార్డమ్. సినిమా సినిమాకు పెరుగుతున్న అభిమానులు, క్రేజ్.. ఎక్కడికో వెళతాడీ కుర్రాడు అనుకున్నారు చాలామంది. బట్.. ఆ మధ్యలో ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు.. ఆ తర్వాత ఉదయ్ జీవితంలో ఒడిదుడుకులు స్టార్ట్ అయ్యాయి. అప్పటి వరకూ నడిసంద్రంలా ఉన్నవాడు కాస్తా.. ఎగిసి పడే కెరటంలా అయిపోయాడు.. ఆ కెరటం ఇప్పుడు తీరం కూడా దాటి కూడా చాలాకామైపోయింది. బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సినిమాపై ప్రేమతో పరిశ్రమలో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఏం చేయాలన్నా విజయమే కీలకం కదా. ఆ విజయం అతనికి తొలి సినిమాతోనే వచ్చింది. చిత్రంతో ఓవర్ నైట్ పెద్ద స్టార్ హీరో అయిపోయాడు ఉదయ్. ఇది అతను ఊహించనిది..ఆ మాటకొస్తే సినిమా పరిశ్రమ కూడా ఊహించలేదు. కానీ ఊహించనివి జరగడమే కదా జీవితం. దీంతో ఉదయ్ కిరణ్ అనే పేరు పరిశ్రమ అంతా మార్మోగిపోయింది.

ఒక్క విజయం వస్తేనే ఆకాశంలో విహరిస్తున్నారు చాలామంది. కానీ అండదండలు లేనివాడు కదా.. అందుకే అతని కాళ్లు నేలపైనే ఉన్నాయి. తర్వాత వచ్చిన నువ్వు నేను.. తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రేమకథలకు కొత్త దారి చూపెట్టిన సినిమా అది. ఆ సినిమాలోని కథ కంటే ఉదయ్ కిరణ్ నటనే హైలెట్ అయింది.. చీ చీ మీ పెద్దాళ్లున్నారే.. అంటూ ఉదయ్ కిరణ్ అమాయకంగా చెప్పిన డైలాగ్ .. కొన్ని లక్షల మంది హృదయాల్లో నాటుకుపోయింది. ఆ సినిమాతో అబ్బాయిలు ఉదయ్ కి అభిమానులుగా మారితే అమ్మాయిలు ఆరాధించడం మొదలుపెట్టారు. ఒకేసారి వరుసగా రెండు సూపర్ హిట్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఆ హీరో క్రేజ్ అమాంతం పెరుగుతుంది. ఉదయ్ కూడా ఆ క్రేజ్ ను ఎంజాయ్ చేయడానికే అలవాటు పడ్డట్టు కనిపిస్తుంది. అయితే ఇలా వస్తోన్న క్రేజ్ ను ఎలా బ్యాలెన్స్ చేయాలో చెప్పే సరైన గైడెన్స్ అతనికి అప్పుడు లేదు. అలా ఖచ్చితంగా గైడ్ చేసేవారు ఉండి ఉంటే ఉదయ్ కెరీర్, లైఫ్ మరోలా ఉండేదేమో..

రెండు సినిమాలతోనే ఉదయ్ కిరణ్‌కి లవర్ బాయ్ ఇమేజ్ వచ్చింది. అంతకంటే ఎక్కువగా లక్కీ బాయ్ అన్నారు చాలామంది. ఎక్కడున్నా.. ఎక్కడికి వెళ్లినా అడ్వాన్సులు, అభిమానులు, ఇది ఉదయ్ ఊహించాడో లేదో కానీ, అంతలోనే మరో సంచలనం. రెండు సినిమాలతో వచ్చిన ఇమేజ్ ను శిఖరానికి తీసుకువెళ్లిన సినిమా. మనసంతా నువ్వే. ప్రేమకథలకు నిత్య నూతనమైన అర్థాన్ని చెప్పిన ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ పాత్రకు కనెక్ట్ కాని మనిషి లేడంటే అతిశయోక్తి కాదు. నటుడిగా ఆ పాత్రలో ఉదయ్ ఎంత అద్భుతంగా సరిపోయాడో.. మనసంతా నువ్వే అంటూ బాల్య స్నేహాన్ని ప్రేమగా మలచుకుని యవ్వనం వరకూ వేచి చూస్తాడు. కుటుంబం కోసం ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధపడ్డ కుర్రాడిగా ఉదయ్ నటనకు కన్నీళ్లు పెట్టిస్తుంది. అప్పటి వరకూ వచ్చిన రెండు విజయాలు గాలి వాటం అనుకున్న వారికి అతని టాలెంట్ సమాధానం చెప్పిన సందర్భం మనసంతా నువ్వే హిట్. ఏకధాటిగా హ్యాట్రిక్ హిట్లు ఇచ్చాడంటే ఎవరైనా ఆరాలు తీస్తారు.. అభిమానులవుతారు.

మూడు సూపర్ హిట్స్ తో ఉదయ్ కిరణ్ స్టార్ హీరో అయ్యాడు. ఆ స్టార్డమ్ తో కొందరు స్టార్ హీరోలకు వణుకు తెప్పించాడన్నమాటనూ ఒప్పుకుని తీరాలి. కానీ ఇంతలోనే ఊహించని సంఘటనలు. కోట్లమంది అమ్మాయిలు ఆరాధిస్తున్నవాడు కాస్తా పెళ్లికి సిద్ధమయ్యాడు. అదే సంచలనం అనుకుంటే... అంతకంటే సంచలనంగా ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది. ఇక్కడే ఉదయ్ కెరీర్ లో కొత్త మలుపులు మొదలయ్యాయి. అప్పటికి సక్సెస్ మాత్రమే తెలిసినవాడు కదా.. అందుకే సరికొత్త సమస్యలూ వస్తున్న విషయం చాలా లేట్ గా తెలుసుకున్నాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హ్యాట్రిక్ హిట్స్ తర్వాత ఉదయ్ కిరణ్ చేసిన సినిమాలు.. కలుసుకోవాలని, హోళీ రెండూ యావరేజ్ కానీ ఎవరికీ నష్టాల్లేవ్. ఆ తర్వాత నీ స్నేహం హిట్... ఉదయ్ మళ్లీ లేస్తున్నాడనుకున్నారు .. కానీ కాస్త ఇబ్బందే అయినా ఇదే అతని చివరి హిట్ అని చెప్పక తప్పదు.

ఇక ఉదయ్ కిరణ్ కు ఫ్లాపులు వరుస కట్టాయి. ఒకదాన్ని మించి మరొకటి. అయితే అతడి పట్ల క్రేజ్ కానీ, అభిమానులు కానీ తగ్గలేదు. ఇదే అతను సంపాదించుకున్న అతి పెద్ద ఆస్తి. ఆ ఆస్తి తరగలేదు కానీ, సినిమా సినిమాకూ అతని ఆత్మవిశ్వాసం తగ్గుతూ వస్తోంది. అది ఎంచుకునే సినిమాలపై మరింత ప్రభావం చూపించింది. కొంతకాలం పాటు కథలు నచ్చితేనే సినిమా అనుకున్న వాడు కాస్తా.. సినిమా వస్తే చాలు అనుకునే స్థాయికి పడిపోయాడు. టాలీవుడ్ క్రేజ్ తో కోలీవుడ్ కూ వెళ్లాడు. కె. బాలచందర్ లాంటి దర్శకుడితో సినిమా. ఉదయ్ కిరణ్ ఇక్కడ కాకపోయినా అక్కడైనా పుంజుకుంటాడనుకున్నారు. కానీ ఆ సినిమా కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఆ తర్వాత కూడా అక్కడ చేసిన ఏ సినిమా ఉదయ్ కెరీర్ కు ఊపిరి పోయలేదు.. వాటిలో కొన్ని తెలుగులో డబ్ అయితే.. ఓపెనింగ్స్ వచ్చాయి కానీ, ఫలితం మారలేదు.

వరుస ఫ్లాపులతో ఉన్న టైమ్ లోనే తనకు సినిమా నటుడిగా జీవితాన్నిచ్చి తేజ డైరెక్షన్ లో సినిమా అనౌన్స్ అయింది. ఔనన్నా కాదన్నా.. అటు తేజ కూడా సేమ్ సిట్యుయేషన్ లో ఉన్నాడు. కాబట్టి, ఇక ఈ కాంబినేషన్ మళ్లీ సంచలనాలు సృష్టిస్తుందనుకున్నారు. కానీ అలా జరగలేదు. కాకపోతే అప్పటి వరకూ వచ్చిన ఫ్లాపుల కంటే కాస్త నయం అనిపించుకుందీ సినిమా.. ఏకలవ్ యుడు, గుండెఝల్లుమంది, నువ్వెక్కడుంటే నేనక్కడుంటా.. లాంటి వరుస ఫ్లాపులు చుట్టుముట్టాయి. మరోవైపు వయసూ పెరుగుతుండటంతో 2012లో పెళ్లి చేసుకున్నాడు. కొత్త జీవితం అతనికి కొత్త ఆశలనివ్వాలని ఎంతో మంది మనస్ఫూర్తిగా కోరుకున్నారు. కానీ అదీ జరగలేదు. సినిమాలు తప్ప ఏం తెలియని వాడు కావడంతో అటు సినిమాలు లేక ఇంకేం చేయాలో తెలియని పరిస్థితిలో పడిపోయాడు. స్టార్డమ్ వెలుగులు చూసిన వాడు కాస్తా.. మనసులో నైరాశ్యపు చీకట్లు కమ్ముకున్నవాడై పోయాడు. మెల్లగా ఆత్మవిశ్వాసం కూడా అడుగంటిపోయింది.

చివరికి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ అంతకంటే ముందు అతని ఆత్మ ఎంత క్షోభ అనుభవించిందో ఎవరికి తెలుసు.. అతనికి తప్ప. నిజమే అతను ఎత్తును చూసి పల్లాలను తట్టుకోలేకపోయాడు. కానీ ఆ ఎత్తుపల్లాల నడుమ అతని కెరీర్ ఊగిసలాడటానికి కారణాలు ఎవరూ పట్టించుకోలేదు.. చివరికి అతని శవం కూడా అనాథైంది. అప్పుడే అతనికి అభిమానం తోడైంది. కోట్లమంది కన్నీరు పెట్టుకుంటే లక్షలమంది స్వచ్ఛందంగా తరలి వచ్చారు. కడసారి చూపు కోసం కన్నీటితో నివాళులర్పించారు. కనీసం ఈ అభిమానం చూడ్డానికైనా ఉదయ్ బతికుంటే బావుండేది. కానీ ఇదే కదా బతుకు చిత్రం చెప్పే చిత్రమైన కథ.. ఉదయ్ కిరణ్ మరణించినా.. నేటికీ అతని జ్ఞాపకాలు ఎందరిలోనో నిలిచి ఉన్నాయి. ఆ నవ్వులు ఎంతో మంది మనసుల్లో సజీవంగా ఉన్నాయి. అతను తప్పు చేశాడో, ఒప్పు చేశాడో కానీ, ఈ జీవన తెర నుంచి తప్పుకున్నాడు. ఓటమిని తట్టుకోలేక, జీవితాన్ని ఎదుర్కోలేక అంటారు కొందరు. కానీ అసలు విషయం అతనికే తెలుసు.. అతనికి మాత్రమే తెలుసు..

Tags

Read MoreRead Less
Next Story