వృద్ధదంపతులను గెంటేసిన కసాయి కొడుకులు

నవమాసాలు మోసి కన్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలను పెంచి పెద్ద చేశారు. వారిని ప్రయోజకులను చేశారు. వృద్ధాప్యంలో…కన్నపేగు తమకు తోడునీడగా ఉంటుందని కలలు కన్నారు దంపతులు. కానీ వారి కలలన్నీ కల్లలు చేశారు కసాయి కొడుకులు. కన్న కొడుకులే కాదు పొమ్మన్నారు. సంపాదించిన ఆస్తిని సొంతం చేసుకుని ఇప్పుడు నిలువు నీడ లేకుండా చేశారు. బుక్కెడు అన్నం పెట్టకుండా తల్లిదండ్రులను రోడ్డున పడేశారు. హృదయ విదారకర ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో చోటుచేసుకుంది.

బెల్లంపల్లి పట్టణం కన్నాల బస్తీకి చెందిన సాహెబ్‌ హుస్సేన్- మహబూబ్‌ బి వృద్ధజంటకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. వీరిలో పెద్ద కొడుకు మృతి చెందగా.. మరో ఇద్దరు కొడుకులు ఉన్నారు. కాయాకష్టం చేసి..పిల్లలను పోషించి పెద్ద చేసిన వృద్ధ దంపతులకు ఇప్పుడు బుక్కెడు అన్నం కరువైంది. ఆలనాపాలనా చూసుకోవాల్సిన కొడుకులు..తల్లిదండ్రులను రోడ్డున పడేశారు.

సాయబ్‌ హుస్సేన్‌ సింగరేణి బొగ్గుబావిలో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందాడు. తనకు ఇచ్చిన క్వార్టర్‌ను చిన్న కొడుకు తన పేరుమీద రాయించుకుని.. తమను ఇంటి నుంచి గెంటివేశాడని వృద్ధదంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి తాళం వేసుకుని వెల్లిపోయారని..చిన్న కొడుకు, కోడలు తమను వేధిస్తున్నారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

Also watch :

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *