శబరిమల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

sabarimalaశబరిమల అయ్యప్పస్వామి ఆలయ నిర్వహణ అనూహ్య మలుపు తిరిగింది. సర్వోన్నత న్యాయస్థానం మరోసారి అయ్యప్ప ఆలయం విషయంలో స్పందించింది. మణికంఠుని ఆలయ నిర్వహణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. శబరిమల ఆలయ నిర్వహణకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో శబరిమల బోర్డు ఉండాలని నిర్దేశించింది. ఇందుకోసం 2 నెలల సమయం ఇచ్చింది. బోర్డు ఏర్పాటు చేయడానికి ముందు కొత్త చట్టం తయారు చేయాలని, ఆ చట్టాన్ని తమకు సమర్పించాలని సూచించింది.

శబరిమల ఆలయ నిర్వహణపై జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అయ్యప్ప దర్శనానికి ఏటా లక్షలాది మంది భక్తులు వెళ్తుంటారని కోర్టు గుర్తు చేసింది. అలాంటి టెంపుల్‌కి ప్రత్యేక చట్టం ఉండాలని అభిప్రాయపడింది. టీటీడీ తరహాలో శబరిమలకు ప్రత్యేకంగా ఒక ఐఏఎస్‌ను నియమించాలని సూచించింది. కేరళలోని 3 వేల ఆలయాలకు ఒకే ఒక్క IAS అధికారిని నియమించడం భావ్యం కాదని స్పష్టం చేసింది. ఇతర దేవాలయాల కంటే శబరిమల అయ్యప్ప ఆలయాన్ని ప్రత్యేకంగా పరిగణించాలని సూచించింది. చట్టం చేయాలని తాము గతంలోనే సూచించినా ఎందుకు చర్యలు తీసుకోలేదని కేరళ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. శబరిమల నిర్వహణకు ప్రత్యేక చట్టం చేయాల్సిందేనన్న ధర్మాసనం, 2020 జనవరి మూడో వారం నాటికి పూర్తి విధివిధానాలు రూపొందించాలని ఆదేశించింది.

శబరిమల ఆలయ నిర్వహణకు పందలం రాజవంశం చూసుకుంటోంది. ఐతే, ఆలయ నిర్వహణలో తమ హక్కులకు భంగం కలిగిస్తున్నారని పందలం రాజవంశీకులు చెబుతున్నారు. తమ హక్కులను పరిరక్షించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కేరళలోని ఆలయ పాలకమండలి చట్టాల్లో మార్పులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆలయ పాలకమండలిలో మహిళలకు చోటు కల్పించే దిశగా కసరత్తు మొదలుపెట్టింది. ఈ చర్యపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అయ్యప్ప సన్నిధానంలోకి మహిళల ప్రవేశంపై ఏర్పడిన వివాదం సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం పరిధిలో ఉన్నప్పుడు, మహిళా ప్యానెల్ ఎలా ఏర్పాటు చేశారని కేరళ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో, ఆలయ నిర్వహణకు గతంలో తాము రూపొందించిన చట్టం ముసాయిదాను కేరళ ప్రభుత్వం, సుప్రీం కోర్టుకు సమర్పించింది. ఆ చట్టాన్ని పరిశీలించిన కోర్టు, ఇది సరిపోదని శబరిమలకు ప్రత్యేక చట్టం రూపొందించాలని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి మూడో వారానికి వాయిదా వేసింది.

TV5 News

Next Post

అమెరికా-భారత్ మధ్య రూ.7 వేల కోట్ల విలువైన ఒప్పందం

Thu Nov 21 , 2019
భారత నౌకాదళం మరింత బలోపేతం కానుంది. ఇండియన్ నేవీ కోసం భారత ప్రభుత్వం అమెరికా నుంచి భారీగా ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. తాజాగా అమెరికా-భారత్ మధ్య 7 వేల కోట్ల రూపాయల విలువైన ఒప్పందం కుదిరింది. డీల్ ప్రకారం 13-MK-45-5 ఇంచ్/62 కేలిబర్ నావెల్ గన్స్‌ను భారత ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందానికి అమెరికా కాంగ్రెస్ కూడా అనుమతి ఇచ్చింది. అమెరికాకు చెందిన బీఏఈ సిస్టమ్స్ 13-MK-45 నావెల్ […]