ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు

Read Time:0 Second

uddav

శివసేన చరిత్రలో కొత్త అధ్యాయం. థాక్రే కుటుంబంలో నవోత్సాహం. ఉద్ధవ్ థాక్రే పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైంది. గురువారం సాయంత్రం 6.40 నిమిషాలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణం చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రితో పాటు సంకీర్ణ కూటమిలోని ఒక్కో పార్టీ నుంచి ఒకరిద్దరు మంత్రుల చొప్పున ప్రమాణం చేస్తారు.

శివసేన కల నెరవేరింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆకాంక్ష ఫలించింది. ముఖ్యమంత్రి పదవి కైవసం చేసుకోవాలనే పంతం నెగ్గింది. చీఫ్ మినిస్టర్‌గా శివసేన నాయకుడు ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముంబైలోని చారిత్రక శివాజీ పార్క్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. గురువారం సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు ఉద్ధవ్ థాక్రే పట్టాభిషేకం జరగనుంది. గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీ, ఉద్ధవ్ థాక్రేతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

సీఎంగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం శివసేన పార్టీ చరిత్రలోనే కొత్త అధ్యాయం. థాక్రే కుటుంబం నుంచి ఇప్పటి వరకు ఎవ్వరూ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించలేదు. అస్సలు ప్రత్యక్ష ఎన్నికల్లోనే ఎవ్వరూ పోటీ చేయలేదు. ఈ ఆనవాయితినీ ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్యా థాక్రే బ్రేక్ చేశారు. తాజాగా, ఉద్ధవ్ థాక్రే మరో రికార్డు సృష్టించారు. ఫడ్నవిస్‌ను పడగొట్టి ఏకంగా ముఖ్యమంత్రి పదవిని కైవసం చేసుకున్నారు.

మొదట నుంచి ట్విస్టులతో రక్తికట్టిన మహారాజకీయంలో కేబినెట్ కూర్పులోనూ అదే ధోరణి కనబడింది. కూటమి ఒప్పందంలో భాగంగా శివసేనకు సీఎం పదవి, ఎన్సీపీ, కాంగ్రెస్ కు చెరో డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే..చివరి నిమిషంలో డిప్యూటీ సీఎం విషయంలో ఈక్వేషన్ మారిపోయింది. బుధవారం రాత్రి శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కీలక నేతలు సమావేశమై మంత్రిపదవులపై చర్చించారు. ఇద్దరికి బదులు ఒక్కరికే డిప్యూటీ సీఎం పదవి ఇవ్వనున్నారు. అదీ కూడాఎన్సీపీకే పదవి దక్కునుంది. ఫ్యామిలి సెంటిమెంట్ తో తిరిగి ఎన్సీపీలోకి వచ్చిన అజిత్ పవార్.. సీఎంతో పాటు డిప్యూటీ సీఎంగా రెండోసారి ప్రమాణం చేసే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ కు స్పీకర్ పదవి, ఎన్సీపీకి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కేలా ఒప్పందం చేసుకున్నారు. అలాగే కూటమిలోని ఒక్కో పార్టీ నుంచి ఒకరిద్దరు మాత్రమే సీఎంతో సహా ప్రమాణం చేయనున్నారు.

ఇక థాక్రే కుటుంబం నుంచి తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఢిల్లీ పెద్దలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రముఖులను ఆహ్వానించింది శివసేన. ఢిల్లీ వెళ్లిన ఆదిత్య థాకరే కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసి ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా స్వయంగా ఆహ్వానించారు. సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ కూడా భాగస్వామ్యం కావటంతో వీళ్లిద్దరు ప్రమాణస్వీకారానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.

తాము ఏ పార్టీ అయినా బేషజాలకు పోకుండా అందరిని కలుపుకొని పోతామని ఇప్పటికే ప్రకటించిన ఉద్ధవ్ థాక్రే తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా ప్రధాని మోదీని కూడా ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను పంపించటంతో పాటు తాను స్వయంగా మోదీకి ఫోన్ చేసి ఆహ్వానించారు. అటు మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ కూడా థాక్రే ప్రమాణస్వీకారానికి హాజరవుతారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్ తో పాటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన నేతలతో పాటు ప్రతిపక్షాల నాయకులు ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close