ఉల్లి లొల్లి.. ఓ వైపు ప్రజలకు కన్నీరు.. మరోవైపు రాజకీయ పోరు

Read Time:0 Second

onion

ఉల్లి రేట్లు జెట్ స్పీడులో ఆకాశన్నంటుతున్నాయి. కిలో ఉల్లి ధర ఏకంగా సెంచరీ మార్క్ దాటేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి గోల మిన్నంటింది. హైదరాబాద్, కర్నూల్ ప్రతీ మార్కెట్లోనూ క్వింటా ఉల్లి ధర 10 వేలకు పైగా పెరిగింది. ఉల్లి రేట్లు రోజురోజుకి పెరిగిపోతున్నా.. ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదంటూ విమక్షాలు విమర్శిస్తున్నాయి. దీంతో సబ్సిడీ ఉల్లిగడ్డ అందించాలని అధికారులను ఆదేశించింది ఏపీ ప్రభుత్వం.

మరోవైపు స్టాక్ మార్కెట్లో బుల్ రంకెలేసినట్లు.. టౌన్ మార్కెట్లలో ఉల్లి రేట్లకు హద్దు లేకుండా పోయింది. క్వింటా ఉల్లి ధర మునుపెన్నడూ లేనంతగా పదివేల మార్క్ దాటింది. దీంతో కిరాణ మార్కెట్లో కిలో ఉల్లిపాయ ధర 130 వరకు చేరుకుంది. భారీ వర్షాలతో మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకలో ఉల్లి సాగు గణనీయంగా తగ్గిపోవటంతో దేశవ్యాప్తంగా ఉల్లి దిగుబడి తగ్గిపోయింది. దీంతో ఉల్లి రేట్లకు అమాంతంగా రెక్కలు వచ్చాయి.

కర్నూలు మార్కెట్లోనే ఉల్లి రేట్లు భగ్గుమంటున్నాయి. వ్యవసాయ మార్కెట్‌లో క్వింటా ఉల్లి ధర రికార్డ్ స్థాయిలో 10 వేల 180 కు చేరింది. హైదరాబాద్ లో మార్కెట్లో కూడా ఉల్లి ధరలు చుక్కలను తాకుతున్నాయి. సెంచరీ దాటి ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి ఉల్లి ధరలు చేరాయి. జనాలకు కోయకుండా కన్నీరు తెప్పిస్తున్నాయి.

పెరిగిన ఉల్లి ధరలతో జనాలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రతీ వంటలోనూ వాడుతుండటంతో వంటింటి బడ్జెట్ పెరిగిపోతుంది. మరోవైపు హోటల్స్ లో ఫ్రీగా ఇచ్చే ఆనియన్ సలాడ్ ను పూర్తిగా మానేశారు. ఉల్లికి బదులుగా కీరదోసతో అడ్జెస్ట్ అయిపోతున్నారు. ఇక ధర ఎక్కువగా ఉందన్న సాకుతో కొన్ని హోటళ్ల వ్యాపారులు టిఫిన్‌ ధరలు అమాంతం పెంచేశారు. కొన్నిచోట్ల ఉల్లి దోశలను వేయటమే మానేస్తున్నారు.

ఉల్లి రేట్ల పెరుగుదలపై స్పందించిన ఏపీ ప్రభుత్వం.. రైతుబజార్లలో సబ్సిడీ ధరలపై అందిస్తోంది. అయితే.. అక్కడా వినియోగదారులకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. ఉదయం 8 గంటలకు వచ్చినవారు మధ్యాహ్నం ఒంటి గంటకు క్యూ లైన్ నుంచి బయటపడుతున్నారు. అంతసేపు క్యూ లో నిలబడితే… తీరా చేతికి వచ్చేది ఒకే ఒక్క కిలో మాత్రేమే. రైతు బజార్లో 5 గంటలు క్యూలో నిలబడి, ఆధార్ కార్డు చూపిస్తే ఒక్క కేజీ ఇస్తున్నారని వాపోతున్నారు జనాలు.

ఉల్లి ధర జనాల్లోనే కాదు ఏపీ రాజకీయాల్లోనూ ఘాటు పుట్టిస్తున్నాయి. కిలో ధర సెంచరీ మార్క్ దాటడంతో లోకేష్ ట్విట్టర్ లో ప్రభుత్వం విమర్శల వర్షం కురిపించారు. ఇక జగన్ ప్రభుత్వం ఉల్లి వారోత్సవాలు జరుపుకోవాల్సిందిగా సెటైర్ పేల్చారు. ప్రభుత్వం ముందు చూపు లేకపోవటంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని విమర్శించారు. అటు తిరుపతిలోని రైతుబజార్లో పర్యటించిన పవన్ కళ్యాణ్.. ప్రభుత్వం ఉల్లిరేట్లను కూడా అదుపుచేయలేని స్థితిలో ఉందని విమర్శించారు. ఒక వైపు రెక్కలు ముక్కలు చేసుకున్న రైతులకు గిట్టుబాటు ధర లేదని.. అటు రైతు బజారులో మాత్రం రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు.

ఉల్లి ధరలపై ఏపీ ముఖ్యమంత్రి  జగన్‌ స్పందించారు. ప్రజలపై ఉల్లి భారం పడకుండా చర్యలు తీసుకోవాలని.. ఉల్లి ధర తగ్గే వరకు కిలో రూ.25కే రైతు బజార్లలో విక్రయించాలని ఆదేశించారు. ధరల స్థిరీకరణ నిధి నుంచి రాయితీ భరించాలని మార్కెటింగ్‌ శాఖను సీఎం ఆదేశించారు. ఉల్లిని అక్రమంగా నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close