పుల్వామా అమరవీరులకు ఘన నివాళి.. వివాదాస్పదమైన రాహుల్ గాంధీ ట్వీట్

Read Time:0 Second

పుల్వామా ఉగ్రదాడికి ఏడాది పూర్తయిన నేపథ్యంలో.. పాక్‌ ఉగ్రమూకల దాడిలో అసువులు బాసిన అమరులను ప్రతి భారతీయుడు ఘనంగా స్మరించుకున్నాడు. జమ్మూకాశ్మీర్లోని లేత్‌పొరాలో ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు.. తోటి వీర జవాన్లకు ఘన నివాళులర్పించారు. వారి త్యాగాలను గుర్తుచేసుకున్నారు.

సరిగ్గా ఆ విషాద ఘటన జరిగి ఏడాది అవుతున్న సందర్భంగా దేశం మొత్తం అమర జవాన్లను గుర్తుచేసుకుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వీర జవాన్లకు ఘనంగా నివాళి అర్పించారు. అమర జవాన్లకు దేశం సెల్యూట్ చేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా దేశం నుంచి ఉగ్రవాదాన్ని తరిమికొడతామన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ వీరజవాన్లకు నివాళ్లర్పించారు. వారు దేశ సేవ, రక్షణ కోసం తమ జీవితాలను అంకితం చేసిన గొప్ప వ్యక్తులని.. ఆ అమరుల త్యాగాలను యావత్ భారతం ఎన్నటికీ మర్చిపోదని ట్వీట్‌ చేశారు.

దేశ రక్షణలో భాగంగా విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను దేశం ఎన్నటికీ మర్చిపోదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ అన్నారు. వీర జవాన్లకు నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు.

మాతృ భూమి సార్వభౌమత కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ల, వారి కుటుంబాల పట్ల దేశం ఎప్పుడూ గర్వపడుతుందని కేంద్ర హోంశాఖామంత్రి అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. అమర జవాన్ల త్యాగాలను గుర్తుచేసుకున్నారు.

పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఢిల్లీలోని నేషనల్ పోలీస్ మెమోరియల్ వద్ద.. కేంద్ర హోంశాఖా సహాయమంత్రి కిషన్‌ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వీరజవాన్ల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. పుల్వామా ఘటనకు.. బాలాకోట్ దాడి ద్వారా పాకిస్తాన్‌ కు భారత్‌ బదులిచ్చిందని అన్నారు.

ఓవైపు పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు దేశం మొత్తం నివాళులర్పిస్తుంటే.. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన ట్వీట్‌ వివాదాస్పదమైంది. పుల్వామా అమరులను స్మరిస్తూ.. ప్రధానికి మూడు ప్రశ్నలు అంటూ ట్వీట్ చేశారు. పుల్వామా ఉగ్రదాడితో ఎక్కువగా లాభపడింది ఎవరు..? ఈ ఘటనపై జరిపిన విచారణలో ఏం తేలింది..? భద్రతా లోపాల వల్ల జరిగిన ఈ దాడికి బీజేపీ ప్రభుత్వంలోని ఎవరు బాధ్యత వహిస్తారని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అయితే రాహుల్ గాంధీ ప్రశ్నలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆయన ఏ సమయంలో ఏం అడుగుతున్నారని మండిపడుతున్నారు. అటాక్ జరిగాక అమరులకు నివాళులు అర్పిస్తున్న సమయంలో రాహుల్ గాంధీ ఫోన్ చూడడంలో బిజీగా ఉన్నారని.. అప్పటి ఫొటోలను రిట్వీట్ చేస్తున్నారు. పుల్వామా దాడి జరిగిన తరువాత.. భారత ఎయిర్ ఫోర్స్ బాలా కోట్ లో ఉన్న ఉగ్రస్థావరాలను మట్టుబెట్టాయని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు.

ఇక, పుల్వామా దాడి ఘటనపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తప్పబట్టారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రాహుల్ గాంధీ వెంటనే ఆయన వ్యాఖ్యలను వెనక్కితీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదిలావుంటే, రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు మహమ్మద్ సలీం కూడా గొంతు కలిపాడు. అంతేకాదు 40 మంది జవాన్ల మృతికి ఎలాంటి స్మారకం అవసరం లేదని వివాదాస్పద ట్వీట్‌ చేశాడు. దీంతో సలీం ట్వీట్‌ పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close