రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు..!!

Read Time:0 Second

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లోను వానలు కురుస్తుండడంతో గోదావరి, కృష్ణా నదులు జలకళ సంతరించుకున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో.. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో.. మరో రెండ్రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పడం రైతుల్లో కొత్త ఆశలు చిగురింప చేశాయి.ఏపీ, తెలంగాణలో మూడు రోజులుగా ఎడతెరపి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఊళ్లలోని చెరువులు జలకళ సంతరించుకున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలతో పాటు.. ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురువడంతో గిరిజన గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది.

బుధవారం వాయువ్య బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.. ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌, ఒడిశా పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో తెలులు రాష్ట్రాల్లో మొస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చురుగ్గా నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయి.. కోస్తా, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
రాష్ట్రంలో భారీ వర్షాలకు తోడు.. ఎగువ మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ధవళేశ్వరం దగ్గర 3 లక్షల 20 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే, పోలవరం దగ్గర 24 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది. కఫర్‌డ్యామ్‌ ఎగువ గ్రామాలకు ముంపు భయం వెంటాడుతోంది.

భారీ వర్షాలతో తూర్పు గోదావరి జిల్లా విలీన మండలాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శబరి, గోదావరి నదులతోపాటు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చింతూరు మండలం నిమ్మలగూడెం వద్ద కాజ్‌వే పై వరదనీరు చేరడంతో కుమగూరు, కల్లేరు వెళ్లే రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరి వరద అంతకంతకూ పెరుగతోంది. పోలవరం మండలంలోని కొత్తూరు కాజ్‌వే దగ్గర గోదావరి పది అడుగుల ఎత్తుకు చేరడంతో ఏజెన్సీలోని 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం దగ్గర ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 28 అడుగులు దాటుతోంది. అంతకంతకూ ప్రవాహం ఇంకాస్త పెరుగుతోంది.

మూడు రోజుల నుంచి కురుస్తోన్న తేలికపాటి జల్లులతో భాగ్యనగరం తడిసిముద్దయ్యింది. ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి కాస్త స్వాంతన చేకూరింది. భారత వాతావరణ శాఖ మరో తీపికబురు అందజేసింది. రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది.

 

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published.

Close