టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్‌ జట్టుకు..

యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ అదరగొట్టింది.. ఉత్కంఠ మధ్య సాగిన మూడో టెస్టులో బెన్ స్టోక్స్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌కు ఊహించని విజయాన్ని అందించాడు.. 219 బంతుల్లో పదకొండు ఫోర్లు, 8 సిక్సర్లు బాది 135 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.. 259 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్‌ మిగిలుండగా ఇంగ్లండ్‌ జట్టు ఛేదించింది. నాలుగోరోజు మ్యాచ్‌ ఎన్నో మలుపులు తిరిగింది.. విజయం ఇద్దరి మధ్యా దోబూచులాడింది.. అయితే ఉత్కంఠ పోరులో చివరకు ఇంగ్లండ్‌ విజయం సాధించింది.

156 పరుగులకు 3 వికెట్ల ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. రూట్ త్వరగానే ఔట్ కాగా.. ఆ తర్వాతి వికెట్‌కు బెయిర్‌స్టో సాయంతో స్టోక్స్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఐదో వికెట్‌కు 86 పరుగులు జత చేయడంతో చేసిన తర్వాత బెయిర్‌స్టో ఔటయ్యాడు. కాసేపటికే బట్లర్, వోక్స్ వెనుదిరిగారు. ఆ తర్వాత ఆర్చర్, బ్రాడ్ వికెట్లు కూడా వెనువెంటనే పడిపోయాయి.. ఆసీస్ బౌలర్లు హేజిల్‌వుడ్ నాలుగు వికెట్లు తీయగా.. లైయాన్ 2 వికెట్లు తీశాడు..

ఇక ఇంగ్లండ్‌ విజయానికి 73 పరుగులు అవసరమైన సమయంలో లీచ్ చివరి బ్యాట్స్‌మన్‌గా స్టోక్స్‌కు జతగా బరిలోకి దిగాడు. అప్పటి వరకు మ్యాచ్‌ ఆస్ట్రేలియా వైపు ఉండగా.. స్టోక్స్‌ దూకుడుతో మొత్తం సీనే మారిపోయింది.. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నాడు స్టోక్స్‌.. చివరి వరకు లీచ్‌ను నాన్‌ స్ట్రయికింగ్ ఎండ్‌కే పరిమితం చేస్తూ 76 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ మిగిలుండగానే 362 పరుగులు చేసి విజయాన్ని నమోదు చేసింది.

టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్‌ జట్టుకు ఇదే అత్యధిక లక్ష్యఛేదనగా విశ్లేషకులు చెబుతున్నారు. అద్భుతమైన బ్యాటింగ్‌తో బెన్ స్టోక్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ అందుకున్నాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల యాషెస్ సిరీస్ 1-1తో సమం అయింది.. వచ్చే నెల 4న నాలుగో మ్యాచ్ ప్రారంభం కానుంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *