వరల్డ్‌ కప్‌లో వరుణుడి ఆట!

వరల్డ్‌ కప్‌లో వరుణుడు ఓ ఆట ఆడేసుకుంటున్నాడు.. వరుణుడి దెబ్బకు ఇప్పటికే మూడు మ్యాచ్‌లు రద్దయ్యాయి. అందులో రెండు శ్రీలంక మ్యాచ్‌లే. శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మ్యాచ్‌కు పూర్తిగా వర్షం ఆటంకం కలిగించడంతో రెండు జట్లు చెరో పాయింట్‌తో సరిపెట్టుకున్నాయి. సెమీస్‌కు చేరుకోవాలంటే బంగ్లాదేశ్‌కు ఈ మ్యాచ్‌లో విజయం తప్పని సరి.. కానీ వర్షం కారణంగా కేవలం ఒకపాయింట్‌ లభించింది. అయితే ఆ జట్టు ప్రస్తుతం ఫాం ప్రకారం.. సంచలనాలు నమోదు చేస్తే సెమీస్‌కు చేరుకోవచ్చు.. అంతకుముందు బ్రిస్టల్‌లో శ్రీలంకతో పాకిస్థాన్‌ మ్యాచ్‌ రద్దయింది. సౌథాంప్టన్‌లో దక్షిణాఫ్రికాతో వెస్టిండీస్‌ పోరులో ఫలితం తేలలేదు. మ్యాచ్‌ల రద్దు ప్రభావం శ్రీలంక, పాక్‌, వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై పడింది.

వరుసగా 2 మ్యాచ్‌లు రద్దవడం శ్రీలంకకు కొంచెం లాభమే! 2 మ్యాచ్‌ల ద్వారా లంకకు 2 పాయింట్లు వచ్చాయి. అంటే ఒక మ్యాచ్‌లో నెగ్గినట్లే! దక్షిణాఫ్రికా పరిస్థితే అగమ్యగోచరంగా తయారైంది. 1992 నుంచి ప్రపంచకప్‌లలో ఆ జట్టుది మెరుగైన ప్రదర్శనే. బలమైన జట్టుగానే బరిలో దిగి నాకౌట్‌ వరకు తిరుగులేకుండా కనిపించేది. ఈసారి మాత్రం పేలవమైన ప్రదర్శనతో అభిమానుల్ని నిరాశ పరుస్తోంది. తొలి 3 మ్యాచ్‌ల్లో ఓడిన దక్షిణాఫ్రికాకు నాలుగో మ్యాచ్‌ రద్దవడం శరాఘాతమే. లీగ్‌ దశలో 9 మ్యాచ్‌ల్లో 6 గెలిస్తే నాకౌట్‌కు చేరుకునే అవకాశముంది! 4 మ్యాచ్‌ల తర్వాత దక్షిణాఫ్రికా ఖాతాలో ఉన్నది ఒకే ఒక్క పాయింటు. అది కూడా వర్షం వల్ల వచ్చిందే. మిగతా ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గినా దక్షిణాఫ్రికా ముందుకెళ్తుందన్న నమ్మకం లేదు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *