సెమీస్ బెర్తుపై కన్నేసిన టీమిండియా.. ఆ మ్యాచ్ గెలిస్తే నాకౌట్ బెర్త్..!

సెమీస్ బెర్తుపై కన్నేసిన టీమిండియా.. ఆ మ్యాచ్ గెలిస్తే నాకౌట్ బెర్త్..!

ప్రపంచకప్‌లో సెమీస్ బెర్తుపై కన్నేసిన టీమిండియా రేపు వెస్టిండీస్‌తో తలపడబోతోంది. గత మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై తృటిలో ఓటమి తప్పించుకున్న కోహ్లీసేన విండీస్‌పై అప్రమత్తంగా ఆడాల్సిందే. సెమీస్ రేసుకు దాదాపు దూరమైన కరేబియన్ జట్టుపై గెలిస్తే... మిగిలిన మ్యాచ్‌లలో ఒక్కటి నెగ్గినా భారత్‌ నాకౌట్‌ స్టేజ్‌కు చేరుతుంది. వరుస విజయాల తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌పై తడబడి గెలిచిన టీమిండియా ఇప్పుడు సెమీఫైనల్‌కు చేరువైంది. వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే దాదాపుగా నాకౌట్ బెర్త్ దక్కినట్టే.. అయితే మిగిలిన మూడు మ్యాచ్‌లలో ఒక్కటి గెలిచినా దర్జాగా సెమీఫైనల్లో అడుగుపెడుతుంది. ప్రస్తుతం టీమిండియా ఫామ్‌ చూస్తే రెండు విజయాలు సాధించడం పెద్ద కష్టం కాదు. అయితే ఏ జట్టునూ తేలిగ్గా తీసుకోకుండా... అంచనాలకు తగ్గట్టు రాణించడంతో పాటు అప్రమత్తంగానూ ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై అనుభవమే దీనికి ఉదాహరణ. వన్‌సైడ్‌గా భావించిన పోరులో భారత బ్యాట్స్‌మెన్ పరుగుల కోసం శ్రమించాల్సి వచ్చింది. అయితే మహ్మద్ షమీ హ్యాట్రిక్‌తో చివరి ఓవర్లో విజయాన్ని అందుకున్న కోహ్లీసేనకు విండీస్‌తో పోరు కూడా సవాల్‌గానే చెప్పాలి.

ప్రస్తుత ప్రపంచకప్‌లో మూడు పెద్ద జట్లపై గెలిచిన భారత్‌.. అన్ని విభాగాల్లోనూ పటిష్టంగానే ఉంది. ఆఫ్ఘనిస్థాన్‌పై తడబాటు తప్పిస్తే.. బ్యాట్స్‌మెన్ నిలకడగా రాణిస్తున్నా.. మిడిలార్డర్‌ మాత్రం పూర్తి స్థాయి ప్రదర్శన కనబరచలేదు. దీంతో మరోసారి ఓపెనర్లు, టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ కీలకం కానున్నారు. అటు బౌలింగ్‌లో మాత్రం భారత్‌కు తిరుగులేదు. పేసర్లతో పాటు స్పిన్నర్లూ పోటాపోటీగా వికెట్లు తీస్తున్నారు. గాయంతో విశ్రాంతి తీసుకుంటోన్న భువనేశ్వర్ స్థానంలో షమీని ఈ మ్యాచ్‌కు కూడా కొనసాగించే అవకాశాలున్నాయి.

మరోవైపు ప్రపంచకప్‌లో ఆశించిన స్థాయి ప్రదర్శన చేయలేకపోతోన్న వెస్టిండీస్‌ సెమీస్‌ అవకాశాలు దాదాపుగా చేజార్చుకుంది. అద్భుతాలు జరిగితే తప్ప విండీస్ సెమీస్‌కు చేరడం అసాధ్యమనే చెప్పాలి. ఇప్పటి వరకూ ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచిన విండీస్‌కు భారత్‌ను నిలువరించడం పెద్ద సవాలే. బ్యాటింగ్‌లో నిలకడలేమితో పాటు బౌలింగ్‌లోనూ విండీస్ ప్రభావం చూపలేకపోతోంది. న్యూజిలాండ్‌పై గెలుపు ముంగిట బోల్తా పడిన కరేబియన్ టీమ్‌ బలమైన బౌలింగ్‌తో కూడిన టీమిండియాపై ఎలా ఆడుతుందో వేచి చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story