షాకింగ్.. ప్రపంచకప్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ

వరల్డ్‌కప్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా ఎదురుదెబ్బ తగలింది. ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా మూడు వారాల పాటు టోర్నీకి దూరమయ్యాడు. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ధావన్ చేతివేలికి గాయమైంది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన ధావన్ గాయం కారణంగానే ఫీల్టింగ్‌ చేయలేదు. అయితే తాజాగా భారత ఓపెనర్ వేలికి స్కానింగ్ చేయించగా.. మూడు వారాల విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. దీంతో ధావన్ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమైనట్టే. ధావన్ గాయంపై బీసిసిఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

ఆసీస్‌తో మ్యాచ్‌లో సెంచరీతో ఫామ్‌లోకి వచ్చిన ధావన్ 109 బంతుల్లో 117 పరుగులు చేశాడు. భారత్ తన తర్వాతి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తోనూ, ఆదివారం పాకిస్థాన్‌తోనూ తలపడాల్సి ఉంది. ఈ సమయంలో ధావన్ గాయంతో దూరమవడం కోహ్లీసేనకు ఎదురుదెబ్బగానే చెప్పాలి. అతని స్థానంలో రోహిత్‌శర్మకు జోడీగా ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తోన్న కెఎల్ రాహుల్‌నే ఓపెనర్‌గా పంపించే అవకాశాలున్నాయి. దీంతో నాలుగో స్థానం కోసం రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఒకరిని జట్టులోకి ఎంపిక చేసే ఛాన్సుంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *