ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ రికార్డుల మోత!

రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ధాటికి ప్రపంచ కప్ లో రికార్డులు నమోదయ్యాయి. బంగ్లాదేశ్ పై 92 బంతుల్లోనే 104 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. ఈ ప్రపంచ కప్ లో నాలుగో సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్ గా చూస్తే 2015లో సంగక్కర ఒకే ప్రపంచ కప్ లో నాలుగు సెంచరీలు సాధించాడు. అతని రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. ఇక ప్రపంచకప్‌లో అతి తక్కువ ఇన్నింగ్సుల్లో 5 శతకాలు బాదింది రోహిత్‌ ఒక్కడే. కేవలం 15 ఇన్నింగ్సుల్లోనే 5 సెంచరీలు చేశాడు. 6 సెంచరీలతో సచిన్ ఫస్ట్ ప్లేసులో ఉంటే..రోహిత్ తర్వాతి స్థానంలో నిలిచాడు. సచిన్ 44 ఇన్నింగ్స్ లో 6 సెంచరీలు చేస్తే..రోహిత్ కేవలం 15 ఇన్నింగ్స్ లోనే 5 సెంచరీలు చేశాడు. ఇదే 5 సెంచరీలు చేసేందుకు సంగాక్కర 35 ఇన్నింగ్స్, రికీ పాంటింగ్ 42 ఇన్నింగ్స్ లు ఆడారు.

బంగ్లాపై సిక్సర్లతో చెలరేగిపోయిన రోహిత్.. ధోని సిక్సర్ల రికార్డ్ ను బ్రేక్ చేశాడు. 228 సిక్సర్లతో భారత ఆటగాళ్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు ధోని. అయితే..230 సిక్సర్లతో రోహిత్ శర్మ.. ధోని రికార్డ్ ను బ్రేక్ చేశాడు. ఓవరాల్ గా చూస్తే అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్ మెన్ గా ఫోర్త్ ప్లేస్ కు చేరుకున్నాడు రోహిత్ శర్మ. 351 సిక్సర్లతో షాహిది అఫ్రిది , 326 సిక్సర్లతో క్రిస్‌గేల్‌ , 270 సిక్సర్లతో జయసూర్య తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

ప్రపంచకప్‌లో నమోదైన అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్య రికార్డును రోహిత్-రాహుల్ జోడీ అధిగమించింది. బంగ్లాతో మ్యాచ్‌లో రోహిత్-రాహుల్ జోడీ తొలి వికెట్‌కు 180 పరుగులు జోడించారు. వరల్డ్‌కప్‌లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం. 2015 వరల్డ్‌కప్‌లో హామిల్టన్ వేదికగా ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ-శిఖర్ ధావన్ ద్వయం 174 రన్స్ సాధించింది. ఈ రెండు ఓపెనింగ్ భాగస్వామ్యాల్లోనే రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఉంది. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. 7 మ్యాచుల్లో 90.66 సగటుతో 544 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్‌ 96 పైనే ఉంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *