అలా క్రికెట్‌ ఆడటం నాకు నచ్చదు.. నేనే ఆ మ్యాచ్ వద్దని చెప్పా..

యువరాజ్‌సింగ్‌… భారత క్రికెట్‌లో డాషింగ్ ఆల్‌రౌండర్‌… బ్యాట్‌తోనూ,బంతితోనూ తనదైన ముద్ర వేశాడు. సిక్సర్ల వీరునిగా అభిమానులు పిలుచుకునే యువీ కెరీర్‌కు టీ ట్వంటీ ప్రపంచకప్‌ టర్నింగ్ పాయింట్‌గా చెప్పొచ్చు. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్ల రికార్డుతో వరల్డ్‌వైడ్‌గా హీరో అయిపోయాడు.

భారత క్రికెట్‌లో ఎందరో గొప్ప ఆటగాళ్ళు వచ్చినా… యువరాజ్‌సింగ్ లాంటి ఆల్‌రౌండర్లు మాత్రం అరుదగానే ఉంటారు. జట్టు మిడిలార్డర్‌కు కీలకంగా… క్లిష్టసమయాల్లో బంతితోనూ మాయ చేయగల బౌలర్‌గానూ అదరగొట్టడం యువీకే చెల్లింది. యువరాజ్‌ కెరీర్‌ ఆరంభంలోనే తన సత్తా నిరూపించుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్న మ్యాచ్‌లను అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో గెలిపించాడు.

అయితే అంతర్జాతీయ కెరీర్ ప్రారంభానికి ముందు దేశవాళీ క్రికెట్‌లో యువీ సంచలనాలతో ఆకట్టుకున్నాడు. 1999లో పంజాబ్ అండర్ 19 జట్టుకు ఆడిన యువీ కూచ్‌బెహర్ ట్రోఫీ పైనల్లో ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు.404 బంతుల్లో 358 పరుగులు చేయగా… ఇదే మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కూడా బీహార్ జట్టుకు ఆడడం మరో హైలైట్‌. అండర్ 19 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలవడంతో వెంటనే జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అదే ఏడాది వన్డే అరంగేట్రం చేసిన యువీ దిగ్గజ ఆటగాళ్ళు ద్రావిడ్, గంగూలీ, సచిన్‌ల తో కలిసి ఆడిన యువీ అత్యుత్తమ ఆటగాడిగా ఎదిగాడు.

వన్డే కెరీర్‌లో 304 మ్యాచ్‌లు ఆడిన యువరాజ్‌ 8701 పరుగులు చేయగా… 14 శతకాలు, 42 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బంతితోనూ అదరగొట్టిన ఈ ఆల్‌రౌండర్ 111 వికెట్లు పడగొట్టాడు. ఇక టీ ట్వంటీ ఫార్మేట్ అంటే యువరాజ్‌సింగ్‌ జోరు మామూలుగా ఉండేది కాదు. 2007 టీ ట్వంటీ ప్రపంచకప్‌లో యువీ సిక్సర్ల ఫీట్ ఎవ్వరూ మరిచిపోలేరు. ఇంగ్లాండ్‌పై ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదేసిన యువీ… కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు.

తర్వాత జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయిన యువరాజ్‌ 2011 ప్రపంచకప్‌లో రెచ్చిపోయాడు. ఆ టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడి 362 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ ప్రదర్శనతో యువీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ దక్కింది. 2011 ప్రపంచకప్‌తో ఆల్‌రౌండర్‌గా అత్యుత్తమ స్థాయిలో నిలిచిన యువీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం అభిమానులను నిరాశపరిచేదే.

రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత యువీ మీడియాతో మాట్లాడాడు. “నాకు చివిరిగా మ్యాచ్ ఆడే అవకాశం ఇవ్వమని బీసీసీఐని అడగలేదు. ఆఖరి మ్యాచ్‌ అంటూ క్రికెట్‌ ఆడటం నాకు నచ్చదు. గతంలో నేను యో యో టెస్టులో విఫలమైతే రిటైర్మెంట్‌ మ్యాచ్‌ ఏర్పాటు చేస్తామని బిసిసిఐ చెప్పింది. అయితే నాకు అవసరం లేదన్నాను, నా ఆటపై నాకు నమ్మకం ఉంది. ఒకవేళ నేను యో యో టెస్టులో విఫలమైతే ఇంటికి వెళ్లిపోతానని చేప్పాను. తర్వాత యో యో టెస్టు పాస్‌ అయి నేనేంటో నిరుపించుకున్నాను. మిగతా విషయాలు వారికే వదిలేశానని” అన్నారు

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *