రివర్స్‌ టెండరింగ్‌తో 1600 కోట్ల భారం : టీడీపీ

రివర్స్‌ టెండరింగ్‌తో 1600 కోట్ల భారం : టీడీపీ

నవ్యాంధ్ర భవిష్యత్తును నిర్ణయించే కీలక ప్రాజెక్ట్‌ అయిన పోలవరం మేఘా ఇంజినీరింగ్‌ చేతుల్లోకి వెళ్లింది.. ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టును చేపట్టడానికి మేఘా సంస్థ ఒక్కటే బిడ్ దాఖలు చేసింది. తద్వారా రివర్స్‌ టెండరింగ్‌లో మరో అడుగు ముందుకు వేసింది రాష్ట్ర ప్రభుత్వం.. పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యామ్‌ వద్ద మిగిలిన పనులకు సంబంధించి రివర్స్‌ టెండర్లు పిలిచింది.. 12.6శాతం తక్కువ మొత్తానికే పనులు చేపట్టేందుకు మేఘా సంస్థ ముందుకొచ్చింది.

ప్రధాన డ్యామ్‌కు సంబంధించిన 1,771.44 కోట్ల పనుల కోసం, 960 మెగావాట్ల జలవిద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి 3వేలా 216.11 కోట్ల పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించింది. ఈ రెండు పనులకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ 4 వేలా 358 కోట్లకు కోట్ చేస్తూ బిడ్‌ దాఖలు చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎల్-1గా వచ్చిన సంస్థ కోట్ చేసిన ధరను ప్రాథమిక అంచనా వ్యయంగా పరిగణలోకి తీసుకుని దాని ఆధారంగా బిడ్డింగ్ నిర్వహించారు. దీనివల్ల ప్రభుత్వానికి 628 కోట్ల నిధుల ఆదా అయ్యింది. గత ప్రభుత్వం 4.8శాతం ఎక్సెస్‌ ధరకు టెండర్లు కేటాయించిందని.. దీనివల్ల ఖజానాపై 154 కోట్ల అదనపు భారం పడిందని జగన్‌ ప్రభుత్వం చెబుతోంది.. గత భారం, ఈ మొత్తం కలుపుకుని 782 కోట్ల రూపాయలు ఆదా అయినట్లు అధికారులు చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం పోలవరం 65వ ప్యాకేజీ పనులకు సంబంధించి చేపట్టిన రివర్స్‌ టెండరింగ్‌లో 58.53 కోట్లు ఖజానాకు లబ్ధి చేకూరింది.

అటు రివర్స్‌ టెండరింగ్‌పై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆరోపణలతో విరుచుకుపడుతోంది. పోలవరం రివర్స్ టెండరింగ్‌తో ప్రభుత్వంపై 1600 కోట్ల భారం పడుతోందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఒకే సంస్థకు పనులు కట్టబెట్టారని విమర్శించారు. కాంట్రాక్టు సంస్థకు 300 కోట్ల మినహాయింపులు ఇచ్చారని ఆరోపించారు. ప్రభుత్వంపై విశ్వసనీయత లేకనే ఒక్కటే బిడ్‌ వచ్చిందన్నారు ధూళిపాళ్ల నరేంద్ర.

మరోవైపు పనులు నిలిపివేయడంపై నవయుగ సంస్థ ఇప్పటికే కోర్టుకు వెళ్లింది.. కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని చెబుతోంది. అటు కోర్టు అనుమతులు లభించిన వెంటనే మేఘా సంస్థ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలు పెట్టనుంది.

Tags

Read MoreRead Less
Next Story