ఆర్టీసీ సమ్మె.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు

చర్చలు ఫలించలేదు.. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రాలేదు.. దీంతో తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు.. కార్మిక సంఘాల పిలుపుతో అర్థరాత్రి నుంచే సమ్మెబాట పట్టారు ఆర్టీసీ కార్మికులు. కొన్ని చోట్ల మొదటి డ్యూటీ నుంచే నివరధిక సమ్మె మొదలు పెట్టారు.. కార్మికుల సమ్మెతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి.. హైర్‌ సర్వీసులు మినహా మిగిలినవన్నీ డిపోలు దాటి కదల్లేదు. పండుగ సెలవులు కావడంతో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు సమ్మెతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరోవైపు సమ్మెను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. 2వేలకు పైగా అద్దెబస్సుల్ని సిద్ధం చేసినట్లు చెబుతోంది. 20 వేల స్కూల్‌ బస్సులు ఉన్నాయని, ఓలా, ఉబర్‌, మెట్రో వాళ్లతోనూ మాట్లాడినట్లు చెబుతోంది. ఇక అద్దెబస్సుల్ని నడిపేందుకు డ్రైవర్లు, కండక్టర్లను యుద్ధ ప్రాతిపదికన నియమించింది.

అయితే, ప్రభుత్వ చర్యలకు ఏమాత్రం భయపడబోమని కార్మిక సంఘ నాయకులు చెబుతున్నారు. ఎస్మాకు భయపడేది లేదని, ఆర్టీసీని బతికించేందుకే సమ్మె చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్మా, పీడీ యాక్టులు తమకు కొత్తకాదని, ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందనటం తప్ప ఒక్క డిమాండ్‌కూ హామీ ఇవ్వటం లేదన్నారు. ప్రభుత్వానికి కార్మికుల సమస్యను పరిష్కరించే ఉద్దేశమే లేదన్నారు ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్‌ అశ్వత్థామరెడ్డి.

Tags

Read MoreRead Less
Next Story