పరిషత్ ఎన్నికల్లో డీలా పడిన కాంగ్రెస్ క్యాడర్

పరిషత్ ఎన్నికల్లో డీలా పడిన కాంగ్రెస్ క్యాడర్

అసెంబ్లీ ఫలితాలతో బిక్కమోహం వేసిన కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కాస్తా ఉపిరి స‌ల్పుకునేలా చేశాయి. మూడు చోట్ల ఎంపీ సీట్లు గెల్చుకోవటంతో పాటు వ్యూహాత్మకంగా కొన్ని చోట్ల టీఆర్ఎస్ ను ఓటమికి పరోక్ష కారణంగా నిలిచింది. ఈ పరిణామాలు పార్టీలో కొత్త ఆశలు రేపాయి. కానీ, పట్టుమని పది రోజులు గడవకముందే ఆశలు ఆవిరైపోయాయి. మైండ్ బ్లాంక్ చేసేలా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను చావుదెబ్బ కొట్టింది టీఆర్ఎస్. 2014 స్థానిక ఎన్నికలతో పోలీస్తే ఈ సారి పార్టీ పరిస్థితి దారుణంగా త‌యారైంది.

మండల పరిషత్ ఫలితాల్లో 1396 ఎంపీటీసీలతో పరువు దక్కించుకున్న కాంగ్రెస్... జడ్పీటీసీల్లో మాత్రం డీలా పడింది. 538 జడ్పీటీసీలకుగాను అధికార పార్టీ 436 గెలవ‌గా... కాంగ్రెస్ పార్టీ కేవ‌లం 76 స్థానాలకే ప‌రిమితమైంది. భువనగిరి యాదాద్రిలో మాత్రమే కాంగ్రెస్ కు పాస్ మార్కులు దక్కినా.. మిగిలిన చోట్ల ఫ్లాప్ అయింది. ఉమ్మ‌డి న‌ల్గొండలో ఇద్ద‌రు ఎంపీలు, ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఉన్నా కూడా యాదాద్రి జిల్లాలో మినహా లోకల్ ఫైట్ లో దారుణంగా విఫలమైంది కాంగ్రెస్.

అయితే స్ధానిక సంస్ధ‌ల ఎన్నిక‌ల్లో స‌హాజంగానే అధికార పార్టీకి అనుకూల ఫ‌లితాలు వ‌స్తాయ‌నే అంచనాలు సహజం. కానీ, ప్ర‌తిప‌క్ష పార్టీ మ‌రీ ఇంత ఘోరంగా విఫ‌లం అవుతుందని మాత్రం ఎవరూ ఊహించలేనిది. వందకు వంద శాతం జడ్పీలను కోల్పోయి ఖాళీ చేతులతో దివాళా చూపులు చూసే పరిస్థితికి చేరుకుంది కాంగ్రెస్. జిల్లా పరిషత్ లో తమ అభ్యర్ధులను గెలిపించుకునేందుకు జడ్పీ చైర్మన్ అభ్యర్ధులను కూడా అడ్వాన్స్ గా ప్రకటించేసింది కాంగ్రెస్. కనీసం కాంగ్రెస్ ప్రకటించిన జడ్పీ చైర్మన్ అభ్యర్ధులు కూడా విజయం సాధించలేకపోయారు.

ఈ వైఫల్యానికి నాయ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌, ప్ర‌చార లోప‌మే కారణమని పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారడం, ఓడిన సీనియ‌ర్లు క‌నీసం అభ్య‌ర్ధుల ప్ర‌చారంలో పాల్గొన‌క‌పోవ‌డంతో ఎక్క‌డికక్క‌డ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్య‌ర్ధులు ఒంట‌రి పోరు చేయాల్సి వ‌చ్చింద‌ని, వారికి క‌నీసం ఆర్ధిక స‌హకారం అందించక‌పోవ‌డం కూడా ఓట‌మికి కారణ‌మ‌ని పార్టీ వ‌ర్గాలు అభిప్రాయపడుతున్నాయి. క్షేత్రస్థాయి ఓటర్ నాడిని ప్రతిబింబించే ఎన్నికల్లో చతికలపడటంతో కాంగ్రెస్ కేడర్ డీలా పడిపోతోంది.

Tags

Read MoreRead Less
Next Story