ఎద్దు ఎంత పనిచేసింది.. మంగళ సూత్రాన్ని..

ఎద్దు ఎంత పనిచేసింది.. మంగళ సూత్రాన్ని..

ఎప్పుడూ గడ్డే పెడతారు.. ఈ రోజు స్పెషల్‌గా ఏదో పెట్టారనుకుని తినుబండారాలతో పాటు ఉంచిన మంగళ సూత్రాన్నికూడా గుటకాయస్వాహా చేసేసింది ఎద్దు. ఇంట్లోకి వెళ్లొచ్చిన ఇల్లాలు అయ్యో ఎంత పని చేశావే గో మాతా.. అయినా తప్పు నీది కాదు లే.. ప్లేటు నీ ముందు పెట్టి వెళ్లాను చూడు నాది తప్పు అని సర్థి చెప్పుకొంది కానీ ఎద్దు కడుపులోకి వెళ్లిన మంగళ సూత్రం బయటకు వచ్చే మార్గం ఎలా అని ఆలోచించింది.

మహారాష్ట్ర అహ్మద్ నగర్‌ జిల్లాలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్రలో పశువుల పండుగలను ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజు పల్లె ప్రజలు తమ ఎద్దులకు పసుపు, కుంకుమ, పూలు పెట్టి అందంగా అలంకరిస్తారు. భక్తితో పూజలు చేసి హారతులిస్తారు. వాటి కోసం కొన్ని తీపి వంటకాలను చేసి నైవేద్యంగా పెడతారు. ఆగస్ట్ 30న గ్రామానికి చెందిన ఓ మహిళ ఎద్దుకు పూజ చేసి కొత్తగా చేయించుకున్న మంగళ సూత్రాన్ని ఎద్దు తలకు తాకించింది. అదే సమయంలో ఇంట్లో కరెంట్ పోవడంతో కొవ్వొత్తి వెలిగించుదామని ఇంట్లోకి వెళ్లింది. తినుబండారాల ప్లేట్‌లోనే మంగళ సూత్రాన్ని ఉంచి లోపలికి వెళ్లింది. ప్లేటు ఎద్దుకి దగ్గరగా ఉండడంతో అందులో ఉన్న పదార్థాలతో పాటు మంగళ సూత్రాన్ని కూడా తినేసింది ఎద్దు.

ఇంట్లోకి వెళ్లిన ఇల్లాలు తిరిగి వచ్చి చూసుకునే సరికి ప్లేటు ఖాళీగా ఉంది. దొంగల పనేమో అని చుట్టూ చూసింది కానీ ఎవరూ వచ్చి వెళ్లిన అలికిడి కనిపించలేదు. దాంతో ఎద్దుపైనే అనుమానం వచ్చింది. తినుబండారాలతో పాటు తినేసి ఉంటుందని అనుకుంది. ఇరుగు పొరుగు వారు ఎద్దు పేడ వేసినప్పుడు బయటకు వస్తుందేమో చూద్దాం అని ఆమెకు సర్థి చెప్పారు. ఆమె రోజూ ఎద్దు పేడను వెతకడం పనిగా పెట్టుకుంది. అయినా గొలుసు బయటకు రావట్లేదు. చివరకు లాభం లేదని పశువుల డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు ఎద్దుని.

ఆయన మెటల్ డిటెక్టర్ సహాయంతో ఎద్దుని పరిక్షించారు. ఎద్దు యొక్క రెటిక్యులంలో బంగారు గొలుసు చెక్కు చెదరకుండా ఉందని నిర్ధారించారు. సెప్టెంబర్ 8న ఎద్దుకి ఆపరేషన్ చేసి బంగారు గొలుసుని బయటకు తీశారు. గొలుసు ఖరీదు రూ.1.5 లక్షలు. ఎద్దుకి ఆపరేషన్ చేసినందుకు డాక్టర్ ఫీజు 5 వేల రూపాయలు. మొత్తానికి గొలుసుని బయటకు తీశారు డాక్టర్. ఎద్దుకి ఆపరేషన్ కుట్లు నయం కావడానికి రెండు నెలల సమయం పడుతుందన్నారు. అంత వరకు దానికి విశ్రాంతిని ఇవ్వాలని ఎద్దు యజమానులకు చెప్పి పంపించారు.

Read MoreRead Less
Next Story