బుజ్జిగాడు పక్క తడిపేస్తున్నాడు.. మాన్పించేదెలా..

పాలు తాగే చిన్నారులు పక్కతడిపినా అమ్మకి విసుగనిపించదు. ఆనందంగా చేసేస్తుంది.  అన్నీ తింటూ అన్ని మాటలు చెబుతూ రాత్రి పూట సుస్సూ వస్తుందని మాత్రం చెప్పకుండా పక్క తడిపితే అమ్మకు చెప్పలేనంత చిరాకు. ఉదయాన్నే ఓ రెండు తగిలించి.. ఎన్ని సార్లు చెప్పాలిరా పడుకునే ముందు బాత్‌రూంకి వెళ్లమని.. అయినా అంత అర్జంట్ వచ్చిందాకా ఉండకపోతే ముందే నన్ను లేపొచ్చుగా అని చీవాట్లు.. పాపం ఆ పసి పిల్లలకు పక్కలో పోస్తున్నామన్న ధ్యాసే ఉండదు.. పని కానిచ్చేస్తారు. మళ్లీ యధా మామూలే.. రోజూ ఇదే తతంగం.. మరి ఓ సారి ఇలా ట్రై చేసి చూడండి. ఏమైనా వర్కవుట్ అవుతుందేమో.. ఆరోగ్య నిపుణులు పేర్కొన్న కొన్ని అంశాలు మీ కోసం..

పిల్లలు పక్క తడిపే అలవాటుని మెడికల్ టెర్మనాలజీలో నాక్టర్నల్ ఎన్యురెసిస్ అని అంటారు. ఈ సమస్య పిల్లలకు ఒక ఏజ్ వచ్చే వరకు కొనసాగుతుంది. అయితే కొందరు పిల్లలు 6,7 సంవత్సరాలు వచ్చే ఆ అలవాటు మానుకోరు. ఇదే కొనసాగితే ఆందోళన చెందే అంశంగా పరిగణించాలంటున్నారు నిపుణులు. పక్క తడపడానికి పలు కారణాలు.. అందులో కొన్ని.. పడుకునే గది ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం, పాలు, నీళ్లు లాంటి ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, పడుకునే ముందు ఏదైనా తాగడం.. వంటి వాటివలన ఈ సమస్య తలెత్తవచ్చు.

బిడ్డ యొక్క మూత్రాశయం తక్కువగా అభివృద్ధి చెందడం లేదా ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలోనే ఉందా అనేది కూడా నిర్ధారించుకోవాలి. ఈ సమస్యలు ఉన్నట్లైతే పిల్లలు మూత్రాన్ని నియంత్రించలేరు. బిడ్డ ఆహారంలో అధికంగా కెఫిన్ లేదా డైయూరిటిక్స్ వంటివి ఎక్కువగా ఉన్నా కూడా మూత్రం ఉత్పత్తి పెరుగుతుంది. ఒక్కోసారి బద్దకం కూడా కారణం కావచ్చు. నయానో భయానో, నచ్చజెప్పో అలావాటు మానేశాడునుకుంటే మళ్లీ ఈ మధ్య మొదలు పెట్టాడని కొందరు తల్లిదండ్రులు వాపోతుంటారు. అప్పుడు ఈ లక్షణాలు గమనించుకోవాలి.. మధుమేహం, ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లాలనిపించడం, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, ఒత్తిడి లేక మానసిక సమస్య, జన్యుపరమైన సమస్యలు..

సాధారణంగా పిల్లలు ఏడేళ్ల వరకు పక్క తడిపినా వైద్యులు సీరియస్‌గా తీసుకోవద్దంటారు. కానీ అదే కొనసాగితే మాత్రం కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. మరి ఈ సమస్యను నివారించడానికి కొన్ని గృహ చిట్కాలు.. పై సమస్యకు జీవన శైలి మార్పులే కాకుండా, ఆహార ప్రణాళికలో కొన్ని మార్పులను జోడించడం ద్వారా కూడా ఈ సమస్యను త్వరగా నివారించొచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం పిల్లల్లో పక్క తడపడం తగ్గించేందుకు కొన్ని ఆహారాలు సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయంటున్నారు.

పిల్లలకు వాల్ నట్స్, కిస్‌మిస్‌లు తినే అలవాటు చేస్తే సమస్యను కొంత వరకు తగ్గించొచ్చు. వీటిల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. పిల్లల ఎదుగుదలకు సహాయపడతాయి. మరొకటి అరటి పండు.. ఇది జీర్ణ వ్యవస్థకు తోడ్పడుతూ, మూత్రాశయంలో అదనపు ద్రవాన్ని నిరోధించడంలో ఉత్తమంగా సహాయపడుతుంది. అయితే రాత్రి పూట తింటే కఫం చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సాయింత్రం వేళల్లో ఇవ్వడం మంచిది. దాల్చిన చెక్కను పొడి చేసి దాన్ని కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా తేనె కలిపి ఇస్తుంటే పక్కతడిపే అలవాటుని నివారించడంలో ఎంతగానో సహాయపడుతుంది. దీనివలన చిన్నపిల్లల్లో వచ్చే మధుమేహాన్ని కూడా నివారించవచ్చు. రాత్రి వేళల్లో పిల్లలు స్వీట్లు, చాక్లెట్లు వంటివి తినకుండా చూడాలి. ఓ నెల, రెండు నెలల పాటు ఇవి కంటిన్యూ చేస్తే బుజ్జిగాడు పక్క తడపకుండా అమ్మా అర్జంట్ అని చెప్పేస్తాడు. మరి ఈ రోజు నుంచే మీ ప్రయత్నం ప్రారంభిస్తారు కదూ.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *