వ్యాపారం చేయాలనుకునే మహిళలకు బ్యాంకులు, ప్రభుత్వ పథకాలు భరోసా

వ్యాపారం చేయాలనుకునే మహిళలకు బ్యాంకులు, ప్రభుత్వ పథకాలు భరోసా

ఏదో ఒకటి చేయాలి. ఖాళీగా కూర్చోకూడదు. ఎప్పుడో నేర్చుకున్న టైలరింగ్‌ను ఉపాధిగా మార్చుకుంటే తనతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పించొచ్చు. మహిళల ఆలోచనా విధానం మారుతోంది. మగవారిపై ఆధారపడకూడదన్న భావం పెరుగుతోంది. పెళ్లవకముందు తండ్రి చాటు బిడ్డగా, పెళ్లయ్యాక భర్త చాటు భార్యగా బతకాలనుకోవట్లేదు. తనకున్న అభిరుచులు, ఇష్టా ఇష్టాలనే ఆదాయ మార్గంగా మలచుకోవాలని భావిస్తోంది. ఓ పక్క కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే, తామెంచుకున్న రంగంలో నిలబడడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం మహిళలు సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే మేమున్నామంటూ బ్యాంకులు భరోసానిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలెన్నో ఆసరాగా నిలుస్తున్నాయి. ప్రభుత్వాలు, బ్యాంకులు వివిధ రకాల రాయితీలతో ఆర్థిక భరోసానందిస్తూ, ఆయా రంగాల్లో నైపుణ్యాల శిక్షణనూ మహిళలకు అందిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 'ముద్ర యోజన స్కీం ఫర్ ఉమెన్' తమ కాళ్లపై తాము నిలబడాలనుకునే మహిళలకోసం ప్రవేశ పెట్టిన పథకం ఇది. బ్యూటీపార్లర్లు, టైలరింగ్ యూనిట్‌లు, ట్యూషన్ సెంటర్లు.. వంటివి ఏర్పాటు చేయాలనుకుంటే ఈ పథకం ద్వారా సాయం అందుతుంది. దీనికి కొలేటరల్ సెక్యూరిటీ అవసరం లేదు. ఇందులో మూడు రకాల పథకాలు ఉన్నాయి.

శిశు: ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ప్రాథమిక స్థాయిలో అవసరమయ్యే రూ.50,000లను ఈ పథకం కింద అందిస్తారు.

కిశోర్: ఇప్పటికే వ్యాపారం మొదలు పెట్టిన వారికి ఈ పథకం కింద రూ.50 వేల నుంచి 5 లక్షల రూపాయల్లోపు ఇస్తారు

తరుణ్: మొదలు పెట్టిన వ్యాపారాన్ని మరింత విస్తరింపజేయాలనుకునేవారికి ఈ పథకం ద్వారా పది లక్షల రూపాయల వరకు రుణం అందుతుంది. రుణం అనుమతి పొందాక ఒక ముద్ర కార్డుని అందిస్తారు. క్రెడిట్ కార్డు తరహాలో ఈ కార్డుని ఉపయోగించుకోవచ్చు. ఇందులో రుణం మొత్తంలో పది శాతం ఉంటుంది. దీనికి వ్యాపార ప్రణాళిక, పాన్, ఆధార్ వంటి మరికొన్ని పత్రాలు అవసరం అవుతాయి.

భారతీయ మహిళా బ్యాంకు-ఎస్‌బీఐ బ్యాంకు బిజినెస్ లోన్: ఇప్పుడిప్పుడే వ్యాపారంలో అడుగులు వేస్తోన్న మహిళలకు, రీటైల్ వ్యాపారం విస్తరించాలనుకునేవారికి సూక్ష్మ, ఎంఎస్‌ఎమ్ఈ రుణాలను అందిస్తోంది. దీనిలో 10.15 శాతం అంతకంటే ఎక్కువ వడ్డీతో ఇస్తోంది.

మహిళా ఉద్యమ్ నిధి స్కీమ్: చిన్న తరహా పరిశ్రమలకు చెందిన మహిళలకు పదేళ్ల కాలానికి పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణం అందిస్తుంది. దీనిలో భాగంగా బ్యూటీ పార్లర్లు, డే కేర్ సెంటర్లు, ఆటో రిక్షాలు, ద్విచక్ర వాహనాల కొనుగోలుకు మార్కెట్ రేటుకి అనుగుణంగా పదిలక్షల వరకు లోన్ అందిస్తారు.

also watch

Tags

Read MoreRead Less
Next Story