విక్రమ్ ల్యాండర్‌పై సన్నగిల్లుతున్న ఆశలు!

చంద్రునిపై పరిశోధనల కోసం వెళ్లిన విక్రమ్ ల్యాండర్‌పై ఆశలు సన్నగిల్లుతున్నాయి. పది రోజులు గడిచిపోయినప్పటికీ ల్యాండర్ నుంచి కమ్యూనికేషన్ దొరకడం లేదు. భూకేంద్రంతో విక్రమ్‌ను కాంటాక్ట్ చేయడానికి ఇస్రో చేసిన ప్రయత్నాలు ఫలితాన్నివ్వడం లేదు. నాసా సహకారంతోనూ ప్రయోజనం కనిపించలేదు. విక్రమ్‌ పరిస్థితిని తెలుసుకోవడానికి నాసా శాస్త్రవేత్తలు లూనార్ రికానసెన్స్ ఆర్బిటార్‌ను పంపించారు. చంద్రుడి ఉపరితలానికి సమీపంలో పరిభ్రమిస్తున్న లూనార్, ఈ నెల 17న విక్రమ్ సమీపంలోకి వస్తుందని నాసా తెలిపింది. అప్పుడు ల్యాండర్ ఫోటోలు తీసి ఇస్రోకు పంపిస్తామని పేర్కొంది. ఐతే, మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత కూడా నాసా నుంచి ఇస్రోకు ఎలాంటి ఫోటోలు అందలేదు. దాంతో విక్రమ్‌పై ఆశలు వదిలేసుకున్నట్లే అనే భావన ఏర్పడుతోంది.

విక్రమ్‌ను కాంటాక్ట్ చేయడానికి ఇస్రోకు మరో 3 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. సెప్టెంబర్ 7వ తేదీన చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి ల్యాండర్‌ను పంపించారు. ఒక లూనార్ డే అంటే 14 రోజులు పని చేసేలా విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌ను డిజైన్ చేశారు. అంటే సెప్టెంబర్ 22 వరకు ల్యాండర్, రోవర్‌లు పని చేస్తాయి. ఐతే, ల్యాండర్‌ను ప్రయోగించి ఇప్పటికే 11 రోజులు గడిచిపోయాయి. ఈ లెక్కన 3 రోజుల్లో ల్యాండర్‌ను కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్‌ జరిగితే అద్భుతం సృష్టించినట్లే. లేకపోతే ఆశలు వదిలేసుకోవాల్సిందే. సెప్టెంబర్ 22 తర్వాత చంద్రునిపై లూనార్ నైట్ ప్రారంభమవుతుంది. అప్పుడు చంద్రుడి దక్షిణ ధ్రువంపై అత్యంత శీతల వాతావరణం ఉంటుంది. ఉష్ణోగ్రతలు మైనస్ 173 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతాయి. ఆ శీతల వాతావరణాన్ని ల్యాండర్, రోవర్‌లు తట్టుకోలేవు.

విక్రమ్‌తో సంబంధాల పునరుద్దరణకు ఇస్రో అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. బైలాలులోని ఇస్రో కేంద్రంలో 32 మీటర్ల పొడవైన యాంటెన్నాను ఏర్పాటు చేసి ల్యాండర్‌తో కమ్యూనికేషన్‌ కోసం ట్రై చేసింది. చివరికి నాసా సహకారం కూడా తీసుకుంది. ఐతే, ఈ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ నేపథ్యంలో ఇస్రో ఓ ప్రకటన చేసింది. ఇప్పటివరకు తమకు మద్దతుగా నిలిచిన భారతీయులందరికీ కృతజ్ఞతలు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల ఆశలు, స్వప్నాలే తమకు స్ఫూర్తి అని, మరింత ఉత్సాహంతో కొనసాగుతామని పేర్కొంది. ఇస్రో ప్రకటనతో విక్రమ్‌పై ఆశలు వదిలేసుకున్నట్లే అనే భావన బలపడుతోంది.

Also watch :

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

భార్యను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరణ..

Thu Sep 19 , 2019
మూడు ముళ్ళు ఏడు అడుగులు ఒకటైన రెండు మనసులు ఎంతో ఆనందంగా అతడితో జీవితాన్ని పంచుకోవాలని కోటి ఆశలతో వచ్చింది గోమతి. ఆశలు అడియాశలు అయ్యాయి కట్టుకున్నవాడే కాల యముడై కడతేర్చాడు ముక్కుపచ్చలారని పసికందు చూస్తుండగానే భార్యను కానరాని లోకాలకు పంపాడు. చిన్న చిన్న మనస్పర్థలతో తరచూ గొడవలు పడుతూ ఆమెకు నరకం చూపించాడు. చివరకు ప్రాణాలు కూడా తీశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి పోలీసులకు దొరికిపోయాడు. నెల్లూరు […]