హోరాహోరీ పోరులో ఇంగ్లండ్‌కు షాక్‌

233 పరుగుల లక్ష్యం.. భారీ స్కోర్లతో చెలరేగిపోయే ఇంగ్లండ్‌ జట్టుకు ఇది పెద్ద టార్గెట్‌ ఏమీ కాదు.. సునాయాసంగా విజయం సాధించే సత్తా మోర్గాన్‌ సేనకు ఉంది.. కానీ, లీడ్స్‌లో సీన్‌ రివర్స్‌ అయింది.. 233 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చేతులెత్తేసింది ఇంగ్లండ్‌.. అతి సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆపసోపాలు పడి టోర్నీలో తొలిసారి ఆలౌటైంది.. అదే సమయంలో చిన్న స్కోరును కూడా కాపాడుకోవడంలో సక్సెస్‌ అయి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది శ్రీలంక జట్టు. ప్రపంచకప్‌లో శ్రీలంక, ఇంగ్లండ్‌ మధ్య జరిగిన హోరాహోరీ పోరు క్రికెట్‌ ఫ్యాన్స్‌లో ఉత్కంఠను నింపింది.

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది.. శ్రీలంకకు మొదట్లోనే ఇంగ్లండ్‌ బౌలర్లు షాకిచ్చారు.. స్కోరు బోర్డుపై మూడు పరుగులు కూడా చేరకముందే ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్‌ బాట పట్టడంతో ఓటమి ఖాయమనుకున్నారు ఫ్యాన్స్‌. ఆ తర్వాత మాథ్యూస్‌ చాలా రోజుల తర్వాత బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడటంతో ఈ మాత్రమైనా పరుగులు రాబట్టగలిగింది.. మాథ్యూస్‌ ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌తో 85 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. ఫెర్నాండో 49 పరుగులు, కుశాల్‌ మెండిస్‌ 46 పరుగులు చేశారు.. ఓ దశలో 200 పరుగులు కూడా దాటవని భావించినా.. అజేయంగా నిలిచిన మాథ్యూస్‌ జట్టుకు పోరాడే స్కోరును అందించాడు..

233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మోర్గాన్‌ సేన 47 ఓవర్లలో 212 పరుగులకే కుప్పకూలింది. 82 పరుగులు చేసిన బెన్‌ స్టోక్స్‌ చివరి వరకు ఉన్నా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. జో రూట్‌ అర్దసెంచరీతో రాణించినప్పటికీ కీలక సమయంలో ఔటయ్యాడు. బెయిర్‌ స్టో, మోర్గాన్‌, బట్లర్‌, విన్సే పూర్తిగా నిరాశపరిచారు. స్టోక్స్‌కు అండగా ఎవరూ క్రీజులో నిలవకపోవడంతో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు.. ఈ మ్యాచ్‌లో యార్కర్ల కింగ్‌ లసిత్‌ మలింగ నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించాడు. మలింగకు డిసిల్వా, ఉదానా తోడవడంతో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఒక్కొక్కరుగా పెవిలియన్‌కు క్యూ కట్టారు.. ఇక లంక విజయంలో కీలకపాత్ర పోషించిన మలింగకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమి ముక్కలవుతోందా..?

Sat Jun 22 , 2019
త్వరలో కర్ణాటక ప్రభుత్వం కూలిపోనుందా..? జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమి ముక్కలవుతోందా..? తాజాగా మాజీ ప్రధాని దేవగౌడ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. త్వరలోనే కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ ఆయన అభిప్రాయపడ్డారు.. సంకీర్ణ కూటమిలో ఉండే కష్టాలేంటో తనకు బాగా తెలుసన్నారు దేవేగౌడ. అందుకే కూటమిలో భాగంగా కుమారస్వామి కర్ణాటక సీఎం కావాలని తాను కోరుకోలేదన్నారు. తన కుమారుడి బదులు మల్లికార్జున ఖర్గేను సీఎంగా చేయమని రాహుల్‌ గాంధీని […]