వారెన్ బఫెట్‌తో లంచ్ కోసం రూ. 31 కోట్లు

వారెన్ బఫెట్‌తో లంచ్ కోసం రూ. 31 కోట్లు

సాధారణంగా లంచ్ కు ఎంత ఖర్చవుతుంది.? ఓ ఇద్దరు స్నేహితులతో కలిసి వెళ్లినా బిల్లు వెయ్యి దాటదు. మరీ కాస్ట్లీ రెస్టారెంట్, లేదా ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్తే మహా అయితే ఓ 10 వేల బిల్లవుతుంది. కానీ ఓ వ్యక్తి లంచ్ చేసేందుకు ఏకంగా రూ.31 కోట్లు ఖర్చు చేస్తున్నాడు. కేవలం ఒక్కపూట భోజనం కోసం ఎందుకు ఇంత ఖర్చు చేస్తున్నాడో తెలుసా?

వారెన్ బఫెట్.. స్టాక్ మార్కెట్ గురించి కాస్త అవగాహన ఉన్నవాళ్లకి పరిచయం అక్కర్లేని పేరు. తెలివిగా పెట్టుబడులు పెడుతూ వేల కోట్లు సంపాదించాడు. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్ గా ఈయనకు పేరు. ప్రపంచ కుబేరుల్లో టాప్ -5 పొజిషన్ లో ఉంటాడు. మరి ఇలాంటి బఫెట్ తో కలిసి లంచ్ చేయడమంటే మాటలా.. అది కాస్త కాస్ట్లీయవ్వారమే.

అమెరికన్ ఇన్వెస్ట్ మెంట్ గురు.. 88 సంవత్సరాల వారెన్‌ బఫెట్‌ గత 20 ఏళ్లుగా గ్లైడ్‌ ఫౌండేషన్‌ కోసం విరాళాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం అత్యధిక మొత్తాన్ని చెల్లించిన వారితో కలిసి భోజనం చేస్తున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఈ గ్లైడ్ ఫౌండేషన్ పేదలు, కనీసం ఇళ్లు కూడా లేనివారి కోసం పనిచేస్తోంది. వారెన్ బఫెట్ భార్య సుసన్‌.. బఫెట్‌ను ఈ సంస్థకు పరిచయం చేసింది. అది జరిగిన నాలుగేళ్ల తర్వాత ఆమె మరణించింది. కానీ ఆమె కోసం బఫెట్‌ మాత్రం ఛారిటీ లంచ్‌ను కొనసాగిస్తున్నారు.

బఫెట్ తో కలిసి భోజనం చేయడానికి ఆసక్తి ఉన్నవారికోసం బిడ్డింగ్‌ వేస్తారు. అత్యధిక మొత్తానికి కోట్‌ చేసిన వారితో కలిసి భోజనం చేస్తారు. 2000 సంవత్సరంలో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి తొలిసారి 25వేల డాలర్లు వచ్చాయి. 2003 నుంచి ఈబేలో వేలంపాట నిర్వహిస్తున్నారు. ఈ సారి లంచ్‌ కోసం మే26 న బిడ్డింగ్‌ ప్రారంభమైంది. 48 గంటల్లోపే 31కోట్లకు బిడ్‌ దాఖలైంది. ఇది గత ఏడాది కంటే ఇది దాదాపు మిలియన్‌ డాలర్లు ఎక్కువ. ఈ మొత్తాన్ని గ్లైడ్‌ ఫౌండేషన్‌కు అందజేస్తారు. బిడ్ దాఖలు చేసిన వారి వివరాలను రహస్యంగా ఉంచారు. ఈ చారిటీ లంచ్ ద్వారా గ్లైడ్‌ ఫౌండేషన్‌కు ఇప్పటి వరకు 35 మిలియన్‌ డాలర్లు వచ్చాయి. తనతో లంచ్ చేసేందుకు ఏకంగా 31కోట్లుకు బిడ్ దాఖలవడంపై బఫెట్‌ థ్రిల్‌గా ఫీలయ్యారు. శక్తి ఉన్నన్నాళ్లు ఈ చారిటీ లంచ్ కార్యక్రమం నిర్వహిస్తానంటున్నారు. మంచి ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరి ప్రశంసలు అందుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story