ప్రాణం తీసిన పందెం.. బతికున్న బల్లిని తిని..

ప్రాణం తీసిన పందెం.. బతికున్న బల్లిని తిని..

గోడ మీద పాకుతున్న బల్లిని చూస్తేనే ఒళ్లంతా జలదరిస్తుంది. బల్లిని చూస్తే అల్లంత దూరం పరిగెట్టేస్తారు. దాన్ని బయటకు పంపించిందాకా నిద్ర పట్టదు. అది ఎక్కడ పాత్రల మీద పాకుతుందో అని ఒకింత భయం. బల్లులు, తేళ్లు, జెర్రెలు ఆహారంగా తినేవాళ్లు ఉంటారని తెలిసినా.. పందెం కాచి మరీ బల్లిని తిని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఆస్ట్రేలియాలోని బ్రిస్‌బేనెలో నివసిస్తున్న డెవిడ్ డావెల్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అప్పుడప్పుడు డావెల్ స్నేహితులతో పందెం కాసి పచ్చి చేపలు, పచ్చి మాంసం తింటూ ఉంటాడు.

ఇటీవల తన ఇంట్లో పార్టీ ఇచ్చిన డావెల్.. యధావిధిగా స్నేహితులతో బెట్ కట్టాడు. ఈసారి వెరైటీగా ట్రై చేస్తానన్నాడు. వద్దురా బాబు ఛస్తావు అన్నా వినిపించుకోలేదు. స్నేహితుల ముందు తన పరువు పోకూడదనుకున్నాడు. అందుకే అత్యంత ప్రమాదకరమైన గెక్కో బల్లిని తీసుకువచ్చి స్నేహితులు వద్దంటున్నా వినకుండా తినేశాడు. తింటున్నప్పుడే కడుపు గుడగుడా అయింది. అయినా పందెం కోసం ఆపకుండా తినేశాడు. ఆ మరుసటి రోజు కడుపు బాలేక ఆసుపత్రికి పరిగెట్టాల్సి వచ్చింది. అప్పటికే అనర్థం జరిగిపోయింది. బల్లి విషం శరీరంలోని అన్ని అవయవాలకు పాకి పోయింది. సల్మోనెల్లా అనే ఇన్ఫెక్షన్ కారణంగా కడుపులోని పేగులు చిట్లాయి. దీంతో ఆహారం ఊపిరితిత్తుల్లోకి చేరి డావెల్ మరణించాడు.

బల్లులు విషపూరితమైనవి. వాటి విషయంలో అజాగ్రత్త పనికి రాదు. తినే పదార్థాలు ఉన్నచోట బల్లులు, బొద్దింకలు వంటివి పాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

Tags

Read MoreRead Less
Next Story