కశ్మీర్ భారత్‌దేశానిదే అని అంగీకరించిన పాక్ విదేశాంగమంత్రి

కశ్మీర్ భారత్‌దేశానిదే అని అంగీకరించిన పాక్ విదేశాంగమంత్రి

కశ్మీర్‌పై నానాయాగి చేస్తున్న పాకిస్థాన్, అంతర్జాతీయ వేదికపై తడపడింది. స్వయంగా పాక్ విదేశాంగమంత్రి షా మహమూద్ ఖురేషీ, ఆ దేశం పరువు తీసేశారు. కశ్మీర్ తమదే అంటూ పాకిస్థాన్ చేస్తున్న వాదనలో డొల్లతనాన్ని పాక్ మంత్రి బట్టబయలు చేశారు. ఇంటర్నేషనల్ స్టేజ్‌లపై భారతదేశాన్ని ఇరికించే క్రమంలో మనసులో మాటను బయటపెట్టారు. కశ్మీర్ భారత్‌దేశానిదే అని ఖురేషీ అంగీకరించారు. జమ్మూకశ్మీర్‌ను ఇండియన్ స్టేట్ ఆఫ్ కశ్మీర్ అని ఖురేషీ స్పష్టంగా పేర్కొన్నారు.

కశ్మీర్ కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతాం.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట ఇది. కశ్మీర్‌ కోసం ఎన్ని యుద్ధాలైనా చేస్తాం.. ఇది పాక్ ఆర్మీ చీఫ్ జన రల్ బజ్వా ప్రేలాపన. కశ్మీర్ మాదే, కశ్మీరీలు మావాళ్లే.. పాక్ పాలకుల వాగుడు. నిన్నా మొన్నటి వరకు ఇలా మాట్లాడిన పాకిస్థాన్‌ నాయకులు, అంతర్జాతీయం గా మారిన పరిణామాలతో తమ మాట తీరును మార్చుకుంటున్నారు. కశ్మీర్ విషయంలో వాస్తవ పరిస్థితిని అంగీకరిస్తున్నారు. అందుకే, ఖురేషీ నోటి వెంట ఇండియా స్టేట్ ఆఫ్ కశ్మీర్ అనే మాట వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. కశ్మీర్‌ భారత్‌దే అంటూ ఇన్నాళ్లూ మన ప్రభుత్వాలు చెబుతున్న మాటనే ఖురేషీ పరోక్షంగా చెప్పారని విశ్లేషిస్తున్నారు.

దేశ విభజన అనంతరం దుర్బుద్దితో కశ్మీర్‌లో కొంత భాగాన్ని పాకిస్థాన్ ఆక్రమించుకుంది. నాటి నుంచి పాక్ ఆధీనంలో ఉన్న ప్రాంతాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్‌ గా సంబోధిస్తున్నారు. భారతదేశం మాత్రం కశ్మీర్ మొత్తం తమకే చెందుతుందని, భారత్‌లో అంతర్భాగమని కొన్ని వందల సార్లు స్పష్టం చేసింది. ఐనప్పటికీ పాకిస్థాన్ పాలకులు మాత్రం తీరు మార్చుకోలేదు. పైగా, భారత ఆక్రమిత కశ్మీర్‌ అంటూ అక్కసు వెళ్లగక్కేవారు. కశ్మీర్ మొత్తాన్ని ఆక్రమించుకుంటామంటూ పెడబొబ్బలు పెట్టేవారు. దశాబ్దాల పాటు సాగిన వివాదానికి మోదీ సర్కారు షాకింగ్ డెసిషన్‌తో చెక్ పెట్టింది. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370ని రద్దు చేయడంతో జమ్మూకశ్మీర్‌ను.. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. పీఓకేను కూడా స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేసింది. కశ్మీర్ అంటే పీఓకే, అక్సాయ్‌ చిన్‌లు కూడా వస్తాయని తేల్చి చెప్పింది. కశ్మీర్ వ్యవహారం తమ అంతర్గత విషయమని అంతర్జాతీయ సమాజానికి కుండబద్దలు కొట్టింది. చైనా మినహా ప్రపంచ దేశాలన్నీ ఈ వాదనకు మద్ధతు పలికాయి. దాంతో పాకిస్థాన్‌కు మరో దారి లేకుండా పోయింది. కశ్మీర్‌పై ఎంత రచ్చ చేసినా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో పాక్ పాలకులే మారుతున్నారు. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని ఒప్పుకుంటున్నారు. జమ్మూ కశ్మీర్ భారతదేశ రాష్ట్రమని అంగీకరిస్తున్నారు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story