ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తా.. – రోజా

ఆంధ్రప్రదేశ్‌లో బ్రహ్మాండమైన మెజార్టీతో ముఖ్యమంత్రి అయిన జగన్.. పదవుల పంపిణీలో తనదైన ముద్ర చూపెడ్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో ఐదుగురు విప్‌లను నియమించారు. చీఫ్‌ విప్‌గా శ్రీకాంత్‌రెడ్డి.. ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, శ్రీనివాసులును విప్‌లుగా ఎంపిక చేశారు. వీరికి తోడుగా తాజాగా మరో ముగ్గురికి విప్‌ పదవులు కట్టబెట్టారు. సామినేని ఉదయభాను, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి లకు విప్‌లుగా అవకాశం కల్పించారు. మరోవైపు మాజీ మంత్రి పార్థసారథి విప్‌ పదవి వద్దనడంతో… ఆయన్ని విప్‌ల జాబితా నుంచి తొలగించారు.

మరోవైపు మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు జగన్. వైసీపీ ఫైర్‌ బ్రాండ్‌ రోజాను.. పారిశ్రామిక మౌలిక వసతుల సమాఖ్య- APIIC ఛైర్మన్‌గా నియమించారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో కీలకమైన బాధ్యతలు అప్పగించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి… ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని రోజా తెలిపారు.

మంత్రి పదవి దక్కని మరో సీనియర్ నేత, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డికి నామినేటెడ్‌ పోస్ట్ లభించింది. అందరూ ఊహించినట్టే తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ.. తుడా ఛైర్మన్‌గా ఆయన్ను నియమించారు. మూడేళ్ల పాటు చెవిరెడ్డి ఈ పదవిలో కొనసాగనున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారందరికీ ఖచ్చితంగా పదవులు లభిస్తాయని వైసీపీ సీనియర్ నేతలు చెబుతున్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన అందరికీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని హామీ ఇస్తున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *