ప్రత్యేక హోదాపై పోరు అగదు - యువ టీడీపీ ఎంపీలు

ప్రత్యేక హోదాపై పోరు అగదు - యువ టీడీపీ ఎంపీలు

టీడీపీ పార్లమెంటరీ పక్ష నేతగా గల్లా జయదేవ్‌, ఫ్లోర్‌ లీడర్‌గా రామ్మోహన్‌ నాయుడుని నియమించారు ఆపార్టీ అధినేత చంద్రబాబు. రెండవ సారి లోక్‌సభకు ఎన్నికైన ఈ ఇద్దరు యువ ఎంపీలు గత పార్లమెంట్‌ సమావేశాల్లో తమ వాక్చాతుర్యాన్ని వినిపించారు. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు వంటి అంశాలపై మోదీ సర్కార్‌ను కడిపారేశారు.

తెలుగుదేశం పార్లమెంటరీ పక్ష నేతగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. శ్రీకాకుళం లోక్ సభ సభ్యుడు కె.రామ్మోహన్ నాయుడిని లోక్ సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్ గా ఖరారు చేశారు . రాజ్యసభలో టీడీపీ ఫ్లోర్ లీడర్ గా సుజనా చౌదరి వ్యవహరించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. గుంటూరు లోక్‌సభ సభ్యుడిగా టీడీపీ నేత గల్లా జయదేవ్‌ వరుసగా రెండోసారి కూడా విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిపై 4,216 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. తన కుటుంబం నుంచి రాజకీయ వారసత్వాన్ని పుచ్చుకున్న గల్లా తొలిసారిగా 2014 ఎన్నికల్లో టీడీపీ ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. లోక్‌సభలో నిర్మాణాత్మక పాత్రను పోషించారు. ప్రజలసమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌కి జరుగుతున్న అన్యాయంపై బీజేపీ ప్రభుత్వాన్ని పార్లమెంట్‌లో కడిగిపారేశారు. ప్రత్యేక హోదాపై గళమెత్తారు. మిస్టర్‌ మోదీ అంటూ తన వాగ్దాటితో ఎండగట్టారు. తొలిసారిగా పార్లమెంటులో అడుపెట్టినా.. తన స్పీచ్‌తో అందరిని అకట్టుకున్నారు.. ఆ అనుభవంతోనే జయదేవ్‌ను చంద్రబాబు పార్లమెంటరీ పక్ష నేతగా ఎంపిక చేశారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌లో తమ వాణిని వినిపిస్తామని చెప్పారు గల్లా.

లోక్‌సభలో టీడీపీ పక్ష నేతగా ఎంపికైన రామ్మోహన్‌ నాయుడు చిన్న వయస్సులోనే శ్రీకాకుళం నుంచి 2014 ఎన్నికల్లో తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికైయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెండవసారి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై 6,653ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. తన తండ్రి ఎర్రంన్నాయుడు కుమారుడుగా ప్రత్యేక స్థానాన్ని ప్రజల్లో సంపాదించుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీ అమలుపై లోక్‌సభలో తన గళాన్ని విప్పారు. మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును పార్లమెంటు వేదికగా ఇంగ్లీష్, హిందీలో అదరగొట్టారు. తండ్రికి తగ్గ కుమారుడిగా మంచి వాక్చాతుర్యంతో పార్లమెంట్ లో తన గొంతుని బలంగా వినిపించారు రామ్మోహన్‌ నాయుడు.ఎన్నికలలో టీడీపీ ఓడిపోయినప్పటికీ దివంగత నేత ఎర్రన్నాయుడి కుటుంబ సభ్యులు మాత్రం అందరూ గెలిచారు. టెక్కలి నుంచి ఎర్రన్నాయుడి సోదరుడు అచ్చెన్నాయుడు గెలవగా, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి ఎర్రన్నాయుడి తనయుడు రామ్మోహన్ నాయుడు గెలిచారు. ఎర్రన్నాయుడి కుమార్తె, రామ్మోహన్ నాయుడి సోదరి ఆదిరెడ్డి భవాని రాజమండ్రి సిటీ స్థానం నుంచి గెలుపొందారు. లోక్‌సభలో తమ బలం తక్కువగా ఉన్నప్పటికీ ప్రత్యేక హోదాపై పోరు మాత్రం అగదని స్పష్టం చేశారు యువ టీడీపీ ఎంపీలు.

Tags

Read MoreRead Less
Next Story