చిట్టి న్యూస్

TDP: కురవల మద్దతు టీడీపీకే

కురువ కులస్తులకు రాజకీయంగా పదవులు కేటాయించిన తెలుగు దేశం పార్టీకి తమ మద్దతు ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ కురువ సంఘం నాయకులు ప్రకటించారు. కర్నూలులో కురువ సంఘం నేతలతో ఆ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు సమావేశం అయ్యారు.తమ కులానికి ఇచ్చిన హామీ మేరకు 2ఎంపీ, ఒక ఎమ్మెల్యే స్థానాలను తెదేపా అధినేత చంద్రబాబు కేటాయించారన్నారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తామని హమీ ఇచ్చారు.రాష్ట్రంలోని బీసీలందరు ఏకమై వైకాపాను గద్దె దించాలని బోరంపల్లి ఆంజినేయులు పిలుపునిచ్చారు.

Kyrgyzstan: కిర్గిజ్‌స్థాన్‌‌లో తెలుగు విద్యార్థి మృతి

వైద్య విద్య కోసం కిర్గిజ్‌స్థాన్‌ వెళ్లిన తెలుగు విద్యార్థి అక్కడి జలపాతం సందర్శనకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా మాడుగులకు చెందిన హల్వా వ్యాపారి భీమరాజు రెండో కుమారుడైన దాసరి చందు ఎంబీబీఎస్‌ చదివేందుకు ఏడాది కిందట కిర్గిజ్‌స్థాన్‌ వెళ్లాడు. పరీక్షలు ముగియడంతో యూనివర్సిటీ అధికారులు ఆదివారం విద్యార్థులను సమీపంలోని మంచు జలపాతం సందర్శనకు తీసుకువెళ్లారు. ఏపీకి చెందిన అయిదుగురు విద్యార్థులు జలపాతంలో దిగారు. వారిలో చందు మంచులో కూరుకుపోయి మృతి చెందాడని సోమవారం మధ్యాహ్నం అతడి తల్లిదండ్రులకు సమాచారం అందింది. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడారని అనకాపల్లి ఎంపీ సత్యవతి పేర్కొన్నారు.

Haryana: శ్మశానం గోడ కూలి నలుగురి మృతి..

ప్రమాదాలు ఎప్పుడు.. ఎలా జరుగుతాయో ఎవరూ ఊహించరు. ఒక్కోసారి ఊహించని ప్రమాదాలు షాక్‌కు గురి చేస్తుంటాయి. అలాంటి సంఘటనే హర్యానాలో చోటుచేసుకుంది. గురుగ్రామ్‌లోని అర్జున్ నగర్‌లో శనివారం శ్మశానవాటికకు చెందిన గోడ కూలి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. గోడకు ఆనుకుని కొంత మంది కుర్చీలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో సడన్‌గా ప్రహారీ గోడ కూలి.. అక్కడికక్కడే చిన్నారితో సహా నలుగురు వ్యక్తులు ప్రాణాలు విడిచారు. మరొకరు ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

SSC Results: రేపే ఏపీ పదోతరగతి ఫలితాలు

ఆంధ్రప్రదేశ్ లో పదో పరగతి పరీక్షల ఫలితాలు రేపు(సోమవారం) విడుదల కానున్నాయి.ఈనెల 22న ఉదయం 11 గంటలకు ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. ఏపీలో పది పరీక్షలకు దాదాపు 6.3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

DD News: రంగు మారిన డీడీ న్యూస్‌ చిహ్నం

దేశంలో టీవీ చానెల్స్ మొదలైనప్పటి నుండి ఉన్న ఎంతో గొప్ప చరిత్ర గల డీడీ న్యూస్‌ లోగో కాషాయరంగులోకి మారిపోయింది.భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ టెలివిజన్‌ ఛానల్‌ దూరదర్శన్‌ కేంద్ర ప్రభుత్వం పట్ల స్వామి భక్తిని ప్రదర్శించినాట్లు కనపడుతోంది. ప్రపంచ వార్తలను ప్రసారం చేసే జాతీయ దూరదర్శన్‌ న్యూస్‌ ఛానల్‌ లోగో రంగును తాజాగా కాషాయ రంగులోకి మర్చి తన విధేయతను తెలిపింది. ఇక ఈ మార్పులో కేవలం రంగు మాత్రమే కాకుండా లోగోతో పాటు న్యూస్‌ అనే అక్షరాలను కూడా కాషాయ రంగులోకి మార్చడం వల్ల కేంద్ర అధికార పార్టీ బీజేపీ పై పెద్దయెత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఎంతో చరిత్ర ఉన్న డీడీ న్యూస్‌ లోగో కాషాయరంగులోకి మారిపోయింది. ఇది ప్రసార భారతి కాదు ప్రచార భారతి’ అని గతంలో దూరదర్శన్‌ సీఈవోగా పనిచేసిన టీఎంసీ ఎంపీ జవహర్‌ సర్కార్‌ విమర్శించారు. దూరదర్శన్‌ చర్య మత ఉద్రిక్తతలను పెంచుతుందని కేరళ సీఎం పినరయి విజయన్‌ తీవ్రంగా ఖండించారు.

MUSK: ఈ నెలఖారులో భారత్‌లో మస్క్‌ పర్యటన

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎలాన్‌ మస్క్‌.... భారత్‌లో పర్యటించనున్నారు. భారత్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం కోసం ఎదురుచూస్తున్నానని మస్క్‌.. ఎక్స్‌లో పోస్టు చేశారు. అయితే పర్యటన తేదీని మస్క్‌ వెల్లడించలేదు. ఈ నెలాఖరులో టెస్లా సీఈవో భారత్‌లో పర్యటించనున్నట్లు అంతర్జాతీయ వార్తాసంస్థ రాయిటర్స్‌ తెలిపింది. దేశంలో టెస్లా విద్యుత్‌కార్ల తయారీ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి మస్క్‌.. పెట్టుబడుల ప్రకటన చేసే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. సుమారు 200 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతేడాది జూన్‌లో అమెరికాలో పర్యటించిన ప్రధాని మోదీతో భేటీ అయిన మస్క్‌.. వీలైనంత త్వరలో టెస్లా పరిశ్రమను భారత్‌లో నెలకొల్పుతామని ప్రకటించారు. విద్యుత్‌వాహనాల దిగుమతిపై పన్నులను 85 శాతం తగ్గించే కొత్త ఈవీ పాలసీని భారత ప్రభుత్వం ప్రకటించిన నెలలోనే మస్క్‌ భారత పర్యటన ఖరారైంది. ఈ పాలసీ ప్రకారం.. ప్యాసెంజర్‌ కార్లను తయారు చేసే ఈవీ సంస్థలు.. కనిష్టంగా 29 లక్షల రూపాయల ధర ఉన్న వాహనాలపై 85 శాతం తగ్గించిన దిగుమతి సుంకంతో.. పరిమిత సంఖ్యలో ఐదేళ్ల పాటు యూనిట్లను దిగుమతి చేసుకోవచ్చు.MUSK: ఈ నెలఖారులో భారత్‌లో మస్క్‌ పర్యటన

Maharashtra: మహారాష్ట్రలో కీలక ప్రకటన చేసిన రాజ్ ఠాక్రే

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన మంగళవారం కీలక ప్రకటన చేసింది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి షరతుల్లేని మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఎంఎన్ఎస్ తన ఎక్స్ హ్యాండిల్ ద్వారా ప్రకటన చేసింది. గత నెలలో రాజ్ ఠాక్రే, తనయుడు అమిత్ ఠాక్రే కేంద్రమంత్రి అమిత్ షాను కలిశారు. అంతకుముందు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిశారు. మహారాష్ట్రలో ఇండియా కూటమి సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్దవ్ ఠాక్రే శివసేన సంయుక్త ప్రకటన చేశాయి. మహారాష్ట్రలో 48 లోక్ సభ స్థానాలు ఉండగా ఉద్దవ్ ఠాక్రే వర్గం శివసేన 21 స్థానాల్లో, కాంగ్రెస్ 17 స్థానాల్లో, శరద్ పవార్ ఎన్సీపీ 10 సీట్లలో పోటీ చేయనున్నాయి. మహారాష్ట్రలో ఐదు దశల్లో ఏప్రిల్ 19 నుంచి మే 20 వరకు పోలింగ్ జరగనుంది.

Chandrayaan-4: అభివృద్ధి దశలో చంద్రయాన్‌ 4 -ఇస్రో ఛైర్మన్‌

చంద్రునిపై మరిన్ని ప్రయోగాలు చేసేందుకు ఉద్దేశించిన 'చంద్రయాన్-4' అభివృద్ధి దశలో ఉందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. మంగళవారం నాడు పంజాబ్ రాష్ట్రంలో లుధియానాలోని ఓ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ... అంతరిక్ష పరిశోధన అనేది నిరంతర ప్రక్రియ అన్నారు. ఇందులో మన దేశం గొప్ప పురోగతిని సాధిస్తోందన్నారు. చంద్రుడిపై తదుపరి మిషన్‌కు ఇస్రో కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అంతరిక్ష పరిశోధనతో పాటు వివిధ సాంకేతిక అభివృద్ధి ప్రాజెక్టుల్లో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను భాగస్వామ్యం చేసేందుకు ఇస్రో ప్రయత్నిస్తోందన్నారు. చంద్రయాన్-4 ప్రయోగంలో భాగంగా చంద్రుడిపై నుంచి మట్టి, నీళ్ల నమూనాలను భూమి మీదకు తీసుకు రావాలని ఇస్రో భావిస్తోంది. ఇది దాదాపు 100 రోజులు పని చేసేలా... చంద్రుడిపై కిలో మీటర్ మేర తిరిగేలా రూపొందిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇందుకు రెండు వాహక నౌకలను సిద్ధం చేయాల్సి ఉంటుంది.

PK: జగన్‌ మళ్లీ గెలవడం అసంభవం

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం చాలా కష్టమని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ తేల్చి చెప్పారు. అధికారంలో వచ్చిన తర్వాత వైసీపీ రాష్ట్రాభివృద్ధికి చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా కాకుండా ఓ మోనార్క్‌లా జగన్‌ పాలన కొనసాగిస్తున్నారని ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ ఎడిటర్లతో జరిగిన ముఖాముఖిలో ప్రశాంత్‌ కిశోర్‌ మరోసారి వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సొమ్మును పంచడం తప్పితే ఆయన పాలనతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగిందేమీ లేదని తేల్చి చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేశ్‌ బఘేల్‌లా తాయిలాలివ్వడం తప్ప.. ప్రజల ఆకాంక్షలను జగన్‌ ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పారు. నగదు బదిలీ మాత్రమే చేశారని.. ఉద్యోగాల కల్పనపైన, అభివృద్ధిపైన ఏమాత్రం దృష్టి సారించలేదని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బఘేల్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌లో ఓడిపోయిందని...జగన్‌ విషయంలోనూ అదే జరగనుందని అభిప్రాయపడ్డారు.

MK Stalin : కోయంబత్తూరులో ఆధునిక క్రికెట్‌ స్టేడియం

కోయంబ‌త్తూరులో అత్యాధునిక క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయ‌డానికి కృషి చేస్తామ‌ని త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ చెప్పారు. సోష‌ల్ మీడియా వేదిక `ఎక్స్ (మాజీ ట్విట్ట‌ర్‌)` వేదిక‌గా రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల‌శాఖ మంత్రి టీఆర్బీ రాజా ఈ విష‌య‌మై సీఎం స్టాలిన్‌కు విజ్ఞ‌ప్తి చేశారు. క్రీడ‌లు, క్రికెట్ ఔత్సాహికుడిగా డీఎంకే ఎన్నిక‌ల మేనిఫెస్టోలో మ‌రో హామీ జ‌త ప‌రుస్తున్న‌ట్లు స్టాలిన్ తెలిపారు. కోయంబ‌త్తూరులో అత్యాధునిక స్టేడియం ఏర్పాటు కృషి చేస్తామ‌న్నారు.

 మంత్రి రాజా పేర్కొన్నట్లుగా.. ఈ స్టేడియాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించేందుకు కృషిచేస్తామన్నారు. తమ ప్రభుత్వం, క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ రాష్ట్రంలో ప్రతిభను ప్రోత్సహించేందుకు, క్రీడారంగంలో మౌలికవసతుల్ని మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉన్నారని సీఎం తెలిపారు. ఇప్పటికే చెన్నైలో ఎంఏ చిదంబరం స్టేడియం ఉండగా.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కోయంబత్తూరులో అంతర్జాతీయ ప్రమాణాలతో మరో క్రికెట్‌ స్టేడియం నిర్మాణం చేపట్టేందుకు కృషిచేస్తామని సీఎం హామీ ఇవ్వడం గమనార్హం.

REVANTH: ఏది పడితే అది మాట్లాడితే జైల్లో వేస్తాం

కేసీఆర్‌ పదేళ్లు తెలంగాణను దోచుకున్నారని... పదేళ్లలో వందేళ్ల విధ్వంసం సృష్టించారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఏం మాట్లాడినా చూస్తూ ఊరుకుంటా అని కేసీఆర్‌ అనుకుంటున్నారని... అలా ఊరుకోవడానికి నేను జానారెడ్డిని కాదు.. రేవంత్‌రెడ్డిని అని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎలాబడితే అలా మాట్లాడితే కేసీఆర్‌ను జైలులో పెడతామని. ఆయనకు చర్లపల్లి జైల్లో డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇల్లు కట్టిస్తామన్నారు. ఆయన కాలు విరిగింది. కూతురు జైలుకెళ్లారని జాలి చూపించాం. దిల్లీ నుంచి తెలంగాణకు నిధులు కావాలంటే.. 14 మంది ఎంపీలను గెలిపించండని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని రేవంత్‌ పిలుపునిచ్చారు. జూన్‌ 9న ఢిల్లీలో కాంగ్రెస్‌ జెండా ఎగరాలని హస్తం శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. హైదరాబాద్‌ తుక్కుగూడలో నిర్వహించిన ‘ కాంగ్రెస్‌ జనజాతర’ సభలో రేవంత్‌ కేసీఆర్‌, మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను తుక్కుతుక్కుగా ఎలా ఓడించామో.. కేంద్రంలో బీజేపీని అలాగే ఓడించాలన్నారు. కార్యకర్తలు సైనికుల్లా పోరాడాలని కోరారు. కార్యకర్తల కష్టం వల్లే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు. గుజరాత్‌ మోడల్‌పై ‘వైబ్రెంట్‌ తెలంగాణ’ ఆధిపత్యం చూపిస్తోంది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారు. పదేళ్లలో మోదీ 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు 17 నెలలు పోరాడారు. ఈ క్రమంలో 750 మంది చనిపోయారు. బాధిత కుటుంబాలను మోదీ పరామర్శించలేదన్నారు.

The Guardian: పాక్‌ ఉగ్రవాదులు, ఖలిస్థానీల హత్యకు భారత్‌ ఆదేశాలు.

విదేశాల్లోని ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్‌లో ముష్కరులను భారత ఇంటర్నేషనల్‌ నిఘా ఏజెన్సీ హత్యచేస్తున్నదని బ్రిటన్‌ పత్రిక ది గార్డియన్‌ సంచలన కథనాన్ని ప్రచురించింది. అలాగే ఖలిస్థానీలను కూడా టార్గెట్‌గా చేసుకున్నదని పేర్కొన్నది. కెనడాలో సిక్కు వేర్పాటువాదుల హత్యలపై ఆ దేశ ప్రధానితో పాటు అమెరికాలో కూడా భారత్‌పై బహిరంగంగానే విమర్శలు వచ్చాయని పేర్కొన్నది. 2020 నుంచి పాకిస్థాన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో 20 మంది మరణించారని వివరించింది. కాగా, దిగార్డియన్‌ కథనాన్ని భారత్‌ కొట్టివేసింది. ఇవి నిరాధార ఆరోపణలని పేర్కొన్నది.

Iran: ఇరాన్‌లో ఎదురుకాల్పులు.

 ఇరాన్‌లో మ‌రోసారి కాల్పుల మోత మోగింది. ఇరాన్ మిలిటెంట్లు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల మ‌ధ్య గురువారం పెద్దఎత్తున కాల్పులు చోటు చేసుకున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో జ‌రిగిన ఈ కాల్పుల్లో 10 మంది భ‌ద్ర‌తా ద‌ళాల స‌భ్యులు, 18 మంది మిలిటెంట్లు మృతి చెందారు. సిస్తాన్, బ‌లూచిస్థాన్, ర‌స్కా, స‌ర్బ‌జ్, చాబ‌హ‌ర్‌లో ముష్క‌రులు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. పౌరుల‌ను బందీలుగా చేసుకుని కాల్పుల‌కు పాల్ప‌డ్డారు. అప్ర‌మ‌త్త‌మైన భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఎదురుకాల్పులు జ‌రిపి పౌరుల‌ను కాపాడారు. కాల్పుల‌కు పాల్ప‌డింది జైష్ అల్ అదిల్ ఉగ్ర ముఠా అని స‌మాచారం.

AP: యథేచ్ఛగా బహుమతులు పంపిణీ చేస్తున్న వైసీపీ

వైసీపీ నాయకులు ఎన్నికల కమిషన్ ఆదేశాలను తుంగలోకి తొక్కుతున్నారు. అనంతపురంలోని వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి బహుమతుల సంచులను ఆటోలో స్థానిక కార్యకర్తల, నాయకుల ఇళ్లకు సరఫరా చేస్తున్నారు. బహిరంగంగానే బహుమతుల సంచులు తరలిస్తున్నప్పటికీ ఎన్నికల అధికారులు, పోలీసులు గాని అటువైపు చూసిన పాపాన పోలేదని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. బహుమతుల సంచులు వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి తరలించే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

Fire Accident: ద్వారకలో ఘోర అగ్ని ప్రమాదం

గుజరాత్‌లోని ద్వారకలో ఘోర ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఏడు నెలల పాప, భార్యాభర్తలు, అమ్మమ్మ సహా నలుగురు సజీవ దహనమయ్యారు. తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగి ఈ దారుణ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పాటు దట్టమైన పొగలు రావడంతో ఇంట్లో ఉన్నవారు ఊపిరాడక మంటల్లో సజీవ దహనమయ్యారు. మృతులను పవన్ కమలేష్ ఉపాధ్యాయ్ (30 ఏళ్లు), భావన ఉపాధ్యాయ్ (27 ఏళ్లు), ధ్యాన ఉపాధ్యాయ్ (7 నెలల బాలిక), పవన్ తల్లి భామినీబెన్ ఉపాధ్యాయ్‌గా గుర్తించారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

AP: సీఎం జగన్ సిద్ధం బస్సుపైకి చెప్పు

అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని గుత్తిలో సీఎం జగన్ ‘సిద్ధం’ బస్సు వైపు గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసరడం కలకలం రేపింది. బస్టాండు సమీపంలో బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కర్నూలు జిల్లాలో..నిరసన సెగ తగిలింది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా....... తుగ్గలి నుంచి అనంతపురం జిల్లాకు వెళుతుండగా జొన్నగిరి వద్ద మహిళలు...... సీఎం బస్సును అడ్డుకున్నారు. తమ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని....... పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జొన్నగిరి చెరువును హంద్రీ జలాలతో నింపుతామని చెప్పి..... నింపలేదన్నారు. మహిళలు బిందెలు తీసుకొని రోడ్డు మీదకి వస్తుండగా.... పోలీసులు అడ్డుకున్నారు. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వారిస్తున్నా.... ప్రజలు వినకుండా ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్ బస్సు దిగి వచ్చి... మహిళలతో మాట్లాడి వెళ్లిపోయారు.

CBN: జగన్‌ను ఇంటికి పంపడమే లక్ష్యం కావాలి

ప్రజాగళం ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. పర్యటించారు. తొలుత రాప్తాడులో నిర్వహించిన సభలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ పాలనలో నాశనమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడానికే తెలుగుదేశం, బీజేపీ, జనసేన జట్టు కట్టాయన్నారు.ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను జగన్‌ నిలువునా ముంచేశారని ఆరోపించారు. కేసులు, బెదిరింపులకు భయపడవద్దని సూచించిన ఆయన.. జగన్‌ను ఇంటికి పంపడమే అందరి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. రాయలసీమకు గోదావరి నీళ్లు తెచ్చిచ్చే బాధ్యతను తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

తర్వాత శింగనమల నియోజకవర్గంలోని.. బుక్కరాయసముద్రంలో నిర్వహించిన సభలో పాల్గొన్న చంద్రబాబు జగన్‌ ఐదేళ్లుగా ఎస్సీలను దగా చేశారని విమర్శించారు. 1997లో నాడు తాను తెచ్చిన ఎస్సీ వర్గీకరణను ఇప్పుడు దేశమంతా ఆచరించే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ప్రొద్దుటూరులో వివేకా హత్యపై జగన్‌ చేసిన వ్యాఖ్యలకు..ఘాటుగా బదులిచ్చారు. తాను ప్రజల గుండెల్లో ఉన్నానంటూ జగన్‌ చెప్పిన మాటలను చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్‌ని శాశ్వతంగా ఇంటికి సాగనంపేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

TG: వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీ

వైద్య ఆరోగ్య శాఖలో పదేళ్ల నుంచి పెండింగ్ ఉన్న పోస్టుల భర్తీ కోసం... కసరత్తు చేస్తున్నట్టు తెలంగాణ సర్కార్ ప్రకటించింది. ఇటీవల ఇన్ ఛార్జి DMEగా వాణిదేవి నియామకంపై స్పందించిన హైకోర్టు.... పూర్తిస్థాయి DMEని నియమించాలని ఆదేశించిన వేళ..త్వరలోనే DME సహా DPH, DCA, కమిషనర్, TVVP పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఆరోగ్య శాఖలోపలు కీలక పోస్టులను భర్తీ చేయకుండా ఇన్ ఛార్జీలతోనే నెట్టుకు వస్తోంది. DME కేటగిరిలో డాక్టర్ రమేష్ రెడ్డిని అప్పటి ప్రభుత్వం నియమించగా.... పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు ఇచ్చిన ఆదేశాలతో 2023లో పూర్తిస్థాయి DMEపోస్టును ప్రభుత్వంఏర్పాటు చేసింది. ఆ స్థానాన్ని ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. ఈ పోస్టు భర్తీ కోసం రేవంత్ సర్కార్ ఫిబ్రవరి 6న డిపార్ట్ మెంటల్ ప్రమోషన్ కమిటీ-DPCని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సీనియారిటీ జాబితాను తయారు చేసినప్పటికీ.. ఎన్నికల కోడ్ కారణంగా నియామకాన్ని చేపట్టలేదు. లోక్ సభ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వైద్యారోగ్య శాఖలో నియామకాలు చేపట్టనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. 

NDA: పవన్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తాం: వర్మ

పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలుగుదేశం ఇన్ ఛార్జ్ వర్మ పునరుద్ఘాటించారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీమంత్రి సుజయ కృష్ణ రంగారావుతో కలిసి పవన్ తో సమావేశమయ్యారు. పిఠాపురంలో పవన్ పోటీ చేస్తున్నందున చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఇద్దరు నేతలు జనసేనానికి వివరించారు. త్వరలో ప్రచారం ప్రారంభిస్తున్నట్లు పవన్ స్పష్టం చేశారు. శ్రీ దత్త పీఠాన్ని దర్శించుకున్న అనంతరం వర్మ ఇంటికి వెళ్లి.. తెలుగుదేశం నాయకులను కలుస్తానని పవన్ చెప్పారు. మూడు పార్టీలు సమన్వయంతో పని చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.

HOLI: ఉత్సాహంగా హోలీ సంబరాలు

తెలంగాణలో హోలీ సంబరాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఈవెంట్స్‌లో యువతీ, యువకులు రంగులు పూసుకుని సంతోషంగా గడిపారు. కేరింతలు కొడుతూ డ్యాన్స్‌లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ముందస్తూ హోలీ వేడుకలు సందడిగా సాగాయి.


హైదరాబాద్‌లో ప్రత్యేక ఈవెంట్స్‌లు నిర్వహించారు. విద్యార్థులు, స్నేహితులంతా ఒక చోట చేరి సంబరాలు జరుపుకున్నారు. హైదరాబాద్ మోడల్స్ ఆధ్వర్యంలో కూకట్‌పల్లి వై జంక్షన్‌లోని H.M.D.A ప్లే గ్రౌండ్‌లో.... 'కంట్రీ క్లబ్‌ హోలీ' పేరుతో వేడుకలు నిర్వహించారు. సేంద్రీయ రంగులతో ఐదు గంటల పాటు సాగిన 'కంట్రీ క్లబ్ హోలీ' సంబరాల్లో యువత పెద్ద సంఖ్యల్లో పాల్గొని జోష్‌గా రెయిన్‌ డాన్స్‌లు చేశారు. మ్యూజిక్ మస్తీలో ఉర్రూతలూగారు. ఆత్మీయులంతా ఒకరికొకరు రంగులు పూసుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.


పలు జిల్లాల్లో యువతీ, యువకులు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ జరుపుకున్నారు. తొలిసారి ఖమ్మంలో ఏర్పాటు చేసిన హోలీ వేడుకల్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రత్యేకంగా పాండిచ్చేరి నుంచి తెప్పించిన DJ , సంగీత శబ్ధాలకు యువత డ్యాన్స్‌ చేస్తూ ఉత్సాహంగా గడిపారు.


హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో గార్డెన్ గ్యాలరీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో బీజేపీ పా హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవిలత పాల్గొన్నారు. ఈ వేడుకల్లో రాజస్థానీ, మార్వాడీ కుటుంబాలు పాల్గొని ఉత్సాహంగా, సందడిగా ఒకరికొకరు రంగులు పూసుకోని నృత్యాలు చేస్తూ... హొలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు

Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం: భారతీయ మహిళ మృతి

విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు పలు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల భారతీయ విద్యార్థులు పలు ప్రమాదాల బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరో ఇండియన్ అమ్మాయి చనిపోయింది. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో జరిగిన కారు ప్రమాదం జరిగింది. అర్షియా జోషి (24) అనే భారతీయ యువతి మృతి చెందింది. ఆమె డెడ్ బాడీని వీలైనంత త్వరగా భారత్ కు తరలించేందుకు అన్ని విధాలా సహకరిస్తామని న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ తెలిపింది. మార్చి 21న పెన్సిల్వేనియాలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్టు, ప్రొఫెషనల్ అర్షియా జోషి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని న్యూయార్క్లోని భారత కాన్సులేట్ జనరల్ ఆదివారం ఉదయం ట్వీట్ చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరలంటూ స్పందించింది.

ఆమె డెడ్ బాడీని వీలైనంత త్వరగా ఇండియాకు తరలించేందుకు అన్ని విధాలా సహకరిస్తామని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం, కాన్సులర్, పాస్పోర్ట్, వీసా (సీపీవీ) విభాగాన్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. కాగా అర్షియా జోషి గత ఏడాది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లు తెలిపింది. అయితే సంక్షోభ పరిస్థితుల్లో విదేశాల్లో నివసిస్తున్న ప్రజలకు సహాయం చేసే అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ టీమ్ ఎయిడ్ జోషి పార్థివదేహాన్ని ఢిల్లీలోని ఆమె కుటుంబానికి పంపడానికి సహాయం చేస్తోంది.

Rajasthan కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు

 రాజస్థాన్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జైపూర్‌ జిల్లాలోని బస్సీ ప్రాంతంలో ఉన్న ఓ కెమికల్‌ ఫ్యాక్టరీలోని బాయిలర్‌ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. ఆదివారం ఉదయం మరో కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో కార్మికుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, 9 ఫైరింజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు.

కాగా, కెమికల్‌ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంపై రాజస్థాన్‌ సీఎం భజన్‌ లాల్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బాధితులను ఆదుకుంటామని.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు

Notifaction: ఈఏపీసెట్‌, ఐసెట్‌ తేదీల్లో మార్పులు

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో నిర్వహించాల్సిన పలు పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేయగా, మరికొన్నింటిని ముందుగానే నిర్వహించాలని నిర్ణయించింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ (వెటర్నరీ మొదలైనవి) కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ను ముందుగానే నిర్వహించాలని నిర్ణయించారు. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు మే 9 నుంచి 12 వరకు జరగాల్సి ఉంది. రాష్ట్రంలో మే 13 నుంచి లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల తేదీలను ప్రభుత్వం మార్పుచేసింది. మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా.. మే 9, 10, 11 ఇంజనీరింగ్ తేదీల్లో నిర్వహించనున్నారు. అలాగే, జూన్ 4, 5 తేదీల్లో ఐసెట్ నిర్వహించాల్సి ఉండగా, జూన్ 4న పార్లమెంటు ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఐసెట్‌ను జూన్ 5, 6 తేదీల్లో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు గమనించాలని కోరింది.

INS Kolkata: ముంబైకి చేరిన ఐఎన్ఎస్ కోల్‌కతా

సోమాలియా తీరంలో సముద్రపు దొంగలతో భారత యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా ఈ ఉదయం ముంబై తీరం చేరింది. 35 మంది సముద్రపు దొంగలను ముంబై పోలీసులకు అప్పగించింది. అరేబియన్‌ సముద్రం, గల్ఫ్‌ ఆఫ్‌ అడెన్‌లో వాణిజ్య నౌకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోయేందుకు ఇండియన్‌ నేవీ ‘ఆపరేషన్‌ సంకల్ప్‌’ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నెల 15న అరేబియా సముద్రంలో పైరేట్ల నౌక ఎక్స్‌-ఎంవీ రూయెన్‌ను అడ్డగించిన భారత నౌక ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా 40 గంటల ఆపరేషన్‌ అనంతరం 35 మంది సముద్రపు దొంగలను బంధించింది. ఈ ఆపరేషన్‌లో ఐఎన్‌ఎస్‌ కోల్‌కతాకు సాయంగా ఐఎన్‌ఎస్‌ సుభద్ర, భారత వాయుసేన కూడా రంగంలోకి దిగి ఆపరేషన్‌ను పూర్తి చేశాయి. 35 మంది పైరేట్లతో అక్కడి నుంచి బయలుదేరిన నౌక ఈ ఉదయం ముంబై తీరం చేరుకుంది.


Suicide Bombing: ఆఫ్ఘానిస్థాన్‌ లో ఆత్మాహుతి దాడి.. ముగ్గురు మృతి

 తాలిబన్‌ పాలిత దేశం ఆఫ్ఘానిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. గురువారం ఉదయం కాందహార్‌ నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు స్వదేశీయులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రావిన్స్‌ అధికారులు వెల్లడించారు. గురువారం ఉదయం 8 గంటల సమయంలో కొందరు స్థానికులు తమ జీతాలను తీసుకునేందుకు సెంట్రల్ కాందహార్ నగరంలోని న్యూ కాబూల్ బ్యాంక్ బ్రాంచ్ వెలుపల వేచి ఉన్నట్లు తెలిపారు. వారిని లక్ష్యంగా చేసుకొని ఈ దాడికి పాల్పడినట్లు చెప్పారు. ఈ ఘటనలో ముగ్గరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మంది గాయపడినట్లు చెప్పారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

Assam: సీనియ‌ర్ పోలీసు అధికారి అరెస్టు

అస్సాంలో డీఎస్సీ పై లైంగిక వేధింపుల కేసు న‌మోదు అయ్యింది. ఆ కేసులో అత‌న్ని అరెస్టు చేశారు. ఇంట్లో ప‌నిచేసే ఓ మైన‌ర్‌ను లైంగికంగా వేధించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ ఆఫీస‌ర్‌ను కిర‌ణ్ నాథ్‌గా గుర్తించారు. గోలాఘాట్ జిల్లాలోని లాచిత్ బోర్‌పుకాన్ పోలీసు అకాడ‌మీలో ప‌నిచేస్తున్నారు. 15 ఏళ్ల బాధితురాలను ఆ ఆఫీస‌ర్ ప‌దేప‌దే రేప్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. త‌న‌ను ఆ ఆఫీస‌ర్ ఇంట్లో బంధించిన‌ట్లు బాధితురాలు చెప్పుకున్న‌ది. కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి డీఎస్పీ త‌న‌ను వేధించిన‌ట్లు ఆ యువ‌తి పేర్కొన్న‌ది. డేర్‌గావ్ పోలీసు స్టేష‌న్‌లో ఆ అమ్మాయి పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. ఆదివారం కేసు న‌మోదు చేశారు. విచార‌ణ ద్వారా ఆధారాల‌ను సేక‌రించి డీఎస్పీ నాథ్‌ను అరెస్టు చేసిన‌ట్లు డీజీపీ జ్ఞానేంద్ర ప్ర‌తాప్ సింగ్ తెలిపారు. ఐపీసీలోని 376, 506, పోక్సోలోని సెక్ష‌న్ 6 కింద నాథ్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.

AP: మహిళలకు చీరలు పంచిన వైసీపీ నేతలు

పల్నాడు జిల్లా వైసీపీ నేతలు ఎన్నికల కోడ్ ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ.. వాలంటీర్ల ద్వారా ఓటర్లకు తాయిలాల పంపిణీకి తెరలేపారు. మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెడ్డిగూడెంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. చీరలు పంచుతున్నారనే సమాచారం అందుకుని గ్రామానికి చేరుకున్న వీఆర్వోను చూసి..వాలంటీర్లు చీరల మూటలు ఎక్కడివక్కడ వదిలి పరారయ్యారు.

CBN: వైసీపీ కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌

ఎన్నికల షెడ్యూల్ విడుదలవటంతో వైసీపీకు కౌంట్ డౌన్ ప్రారంభమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సదస్సులో పాల్గొన్న ఆయన ఎన్నికల్లో న్యాయపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, న్యాయపరమైన అంశాలపై చర్చించారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలనేదే తమ నినాదమని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రాల్లో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే అని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన కుమారుడు రాఘవరెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డిలు తెలుగుదేశంలో చేరారు. అద్దంకి వైసీపీ నేతలు బాచిన కృష్ణ చైతన్య ,గరటయ్య పసుపు కండువా కప్పి చంద్రబాబు తెలుగుదేశం లోకి ఆహ్వానించారు. 

ELECTIONS: బీఆర్‌ఎస్‌-బీఎస్పీ పొత్తు ఖరారు

లోక్ సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌- బీఎస్పీ మధ్య పొత్తు ఖరారైంది. ఈ పొత్తులో భాగంగా బీఎస్పీకి నాగర్ కర్నూల్, హైదరాబాద్ లోక్ సభ స్థానాలను కేటాయించినట్టు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ప్రకటించారు. నాగర్ కర్నూల్ నుంచి బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు RSప్రవీణ్ కుమార్ పోటీ చేసే అవకాశముంది. త్వరలోనే... ఈ అంశంపై అధికారిక ప్రకటన రానుంది. ఈ ఎన్నికల్లో రెండు పార్టీలు.... పరస్పర సహకారంతో పయనిస్తాయని ప్రవీణ్ కుమార్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు చేశారు. తెలంగాణలో తమ లౌకిక కూటమి విజయం సాధిస్తుందని ప్రవీణ్ కుమార్ విశ్వాసం వ్యక్తంచేశారు. అటు...... నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానాన్ని బీఎస్పీకి కేటాయించడంపై... మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత నిరంజన్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ఇక్కడ పోటీ చేసే బీఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ విజయానికి... కృషి చేస్తామని నిరంజన్ రెడ్డి చెప్పారు.

ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చాం

ఎన్నికలకు సై అంటున్న ఏపీ ప్రధాన ప్రతిపక్షం,34 మందితో రెండో జాబితా విడుదల చేసిన టీడీపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన చంద్రబాబు

ఎప్పటిలాగే ఈ జాబితాలో కూడా ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చాం: చంద్రబాబు

Prathibha Patil: మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు అనారోగ్యం.

భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో మహారాష్ట్రలోని పుణెలో ఉన్న భారతీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆమె జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. బుధవారం రాత్రి నుంచి చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు. వైద్యుల బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

మన దేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన తొలి మహిళగా ప్రతిభా పాటిల్‌ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆమె 2007 నుంచి 2012 వరకు పదవిలో ఉన్నారు. ఆమె భర్త దేవీసింగ్‌ షెకావత్‌ గతేడాది ఫిబ్రవరిలో గుండెపోటుతో కన్నుమూశారు.ప్రతిభాపాటిల్‌.. 1962లో మహారాష్ట్రలోని జాల్‌గావ్‌ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985 వరకు వరుసగా నాలుగుసార్లు ఎద్లాబాద్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 1985 నుంచి 90 వరకు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. 1991 సాధారణ ఎన్నికల్లో అమరావతి నుంచి ఎంపీగా గెలుపొందారు.

Dogs ban : 23 కుక్క జాతులపై కేంద్రం నిషేధం

 కుక్కలను ప్రాణప్రదంగా పెంచుకునే వారికి కేంద్రం పిడుగులాంటి వార్త చెప్పింది. పిట్‌బుల్‌ టెర్రీర్‌, అమెరికన్‌ బుల్‌డాగ్‌, రాట్‌వీలర్‌, మాస్టివ్స్‌, షెపర్డ్‌ తదితర 23 జాతుల(బ్రీడ్స్‌)కు చెందిన కుక్కలపై నిషేదం విధిస్తున్నట్లు తెలిపింది. వాటి దాడి వల్ల మనుషులు చనిపోతుండటంతో ఈనిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్‌ సెక్రటరీలకు మార్చి 12న కేంద్ర పశుసంవర్ధకశాఖ ఆదేశాలు జారీచేసింది. జాబితాలోని 23 జాతుల కుక్కల అమ్మకాలను, వృద్ధి(బ్రీడింగ్‌)ని నిలిపివేయాలని, కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సదరు కుక్కలకు సంబంధించి లైసెన్సులు జారీ చేయకూడదని ఆదేశించింది.

Japan private Rocket: లాంచ్ అయిన వెంటనే పేలిపోయిన జపాన్ తొలి ప్రైవేట్ రాకెట్.

వాణిజ్య పరంగా అంతరిక్షంలో ప్రయోగాలు చేయడానికి ప్రయత్నిస్తున్న జపాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఉదయం నింగిలోకి బయల్దేరిన తొలి ప్రైవేట్ రాకెట్  కైరోజ్…లాంచ్ అయిన సెకన్ల వ్యవధిలోనే పేలిపోయింది. టోక్యోకు చెందిన స్పేస్‌ వన్‌ సంస్థ నిర్మించిన కైరోస్‌ రాకెట్‌చిన్న ప్రభుత్వ ప్రయోగ ఉపగ్రహాన్ని  తీసుకొని నింగిలోకి ఎగిరింది. అయితే, గాల్లోకి ఎగిరిన క్షణాల్లోనే 60 అడుగుల పొడవైన ఆ రాకెట్‌ ఒక్కసారిగా పేలిపోయింది. భారీగా పొగ, మంటలు వ్యాపించాయి. ఈ ఘటన పశ్చిమ జపాన్‌లోని వకయమ ప్రిఫిక్షర్‌లోని లాంచ్‌ ప్యాడ్‌లో చోటు చేసుకుంది. ఈ పేలుడుతో లాంచ్‌ ప్యాడ్‌ ప్రాంతమంతా నల్లటి పొగ కమ్మేసింది. ఈ ప్రయోగం విజయవంతమై ఉంటే ఆ దేశంలో శాటిలైట్‌ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తొలి ప్రైవేట్‌ సంస్థగా స్పేస్‌ వన్ అవతరించేది. 

Flight crash: టేకాఫ్ అయిన వెంటనే కూలిన సైనిక విమానం

రష్యాలో సైనిక విమానం కుప్పకూలింది. రష్యా సైన్యానికి చెందిన ఐఎల్‌-76 రవాణా విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే రష్యా రాజధాని మాస్కోకు 125 మైళ్ల దూరంలోగల ఇవనోవోలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 15 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 8 మంది విమాన సిబ్బంది, మరో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు.

మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం గురించి రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఘటనపై దర్యాప్తు కోసం హుటాహుటిన మిలిటరీ కమిషన్‌ను ఇవనోవో ఎయిర్‌బేస్‌కు పంపినట్లు తెలిపింది. కాగా, గత రెండేళ్ల నుంచి ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతుండటంతో రష్యాలో సైనికులు, సైనిక సామాగ్రి రవాణా బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఇరుదేశాల సరిహద్దుల్లో ఉక్రెయిన్‌ తమ ఐఎల్‌-76 సైనిక విమానాన్ని కూల్చేసిందని రష్యా ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది.

LOKESH: మాయ.. మాయ.. మాయ.. అంతా మాయ...

మేదరమెట్ల వైసీపీ సిద్ధం సభలో చూపించిన జనమంతా గ్రాఫిక్స్ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. ఒక గుంపు జనాన్ని పలుచోట్ల అమర్చారంటూ కొన్ని ఫొటోలను ఆయన బయటపెట్టారు. ఏకంగా మార్ఫింగ్‌ ఫొటోలు వేసిన వైనం చరిత్రలో ఎప్పుడైనా చూశారా?అని ప్రశ్నించారు.


డ్రోన్‌ చిత్రాలు, గ్రీన్‌ మ్యాట్‌తో దొరికిపోయారని.. ఇప్పుడు ఏకంగా మార్ఫింగ్‌ చేసి ఫొటోలు వదిలారని ఎద్దేవా చేశారు. జగన్‌కు ప్రజల మద్దతు లేదని.. ఎంత ప్రయత్నించినా ఆయన్ను చిత్తుగా ఓడించడం ఖాయమని లోకేశ్‌ పేర్కొన్నారు. 

Vande Bharat: నేడే  వందే భారత్‌ రెండో ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభం

ప్రధాని నరేంద్ర మోదీ.. ఇవాళ దేశవ్యాప్తంగా 85వేల కోట్ల రైల్వే అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా.. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య పరుగులు తీసే రెండో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును దృశ్యమాధ్యమం ద్వారా జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైలు సాధారణ సేవలు.. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు మార్చి 13, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు మార్చి 15 నుంచి అందుబాటులోకి వస్తాయి. టిక్కెట్‌ బుకింగ్స్ నేటి నుంచి అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. గురువారం మినహా ప్రతీ రోజు ఈ రైలు సేవలు అందించనుంది. ప్రస్తుతం సేవలందిస్తున్న వందేభారత్ రైలు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ 100శాతం కంటే ఎక్కువ ఆక్యుపెన్సీతో నడుస్తుండటంతో.. అవసరాల దృష్ట్యా దీన్ని పట్టాలెక్కిస్తున్నారు. వందేభారత్‌ రైలుతో పాటు దక్షిణమధ్య రైల్వే పరిధిలో 193 వన్‌ నేషన్‌- వన్‌ ప్రొడక్ట్‌ స్టాల్స్‌, 9 గతిశక్తి కార్గో టెర్మినల్స్‌, 11 గూడ్స్‌ షెడ్స్‌ను ప్రధాని జాతికి అంకితం ఇవ్వనున్నారు. 2 జన్‌ ఔషధీ కేంద్రాలు, డబుల్‌ లైన్‌, థర్డ్‌ లైన్‌, గేజ్‌ కన్వర్షన్‌, బైపాస్‌ లైన్‌ 14 సెక్షన్లు, 3 రైల్‌ కోచ్‌ రెస్టారెంట్లు ప్రధాని జాతికి అంకితం ఇస్తారు.