ఒకే ఒక్క మొనగాడు.. రాష్ట్రం మెచ్చిన నాయకుడు..

ఒకడే ఒక్కడు మొనగాడు. రాష్ట్రం మెచ్చిన నాయకుడు. అతడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల సారథిగా ఎన్నికల్లో విజయం సాధించారు. పదేళ్ల శ్రమ, పట్టుదలా, వ్యూహరచనా.. ఇలా ఆయన విజయం వెనుక చాలా చరిత్ర ఉంది. తండ్రి మరణం తరువాత పార్టీని స్థాపించిన జగన్ కు అడుగడుగునా అవాంతరాలు ఎదురయ్యాయి.

జగన్.. జగన్.. జగన్.. ఏ నోట విన్నా ఆ పేరే. ఏ చోట చూసినా ఆయన కటౌటే. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైసీపీకి లభించిన విజయం అలాంటిది. చేరుకున్న మైలురాయి అటువంటిది. ప్రజలే ఆయన బంధువులు. వారి అభిమానమే ఆయన ఊపిరి. వారి సంతోషమే ఆయన ఆశయం. ఒక్కడు.. ఒకే ఒక్కడు సాధించిన విజయం ఇది. ఇన్నాళ్లూ ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారు. ఆ అభిమానమే.. జన ప్రభంజనం సృష్టించేలా చేసింది. 1972 డిసెంబర్ 21న జన్మించిన జగన్.. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా రాజకీయ అరంగేట్రం చేసినా.. జస్ట్ పదేళ్లలో అంటే 2019లో వైఎస్ జగన్మోహనరెడ్డిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకున్నారు. పదేళ్ల కష్టం.. పదేళ్ల శ్రమ.. పదేళ్ల వ్యూహ రచన, పదేళ్ల మొండి పట్టుదల.. ఇవన్నీ కలిపితేనే జగన్ విజయం. అవును. పదేళ్లలో ఎన్నో ఆటుపోట్లు.. ప్రతికూల పరిస్థితులు… అవాంతరాలు. అయినా లక్ష్యం వీడలేదు. మాట తప్పలేదు. మడమ తిప్పలేదు. టార్గెట్ ఒక్కటే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడం. ఆశయం ఒక్కటే.. ప్రజాసేవ. అదే ఆయనకు ఈ విజయాన్ని సాధించి పెట్టింది.

2009 సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. అప్పటికి జగన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి కొద్ది కాలమే అయ్యింది. తండ్రి మరణంతో దుఃఖంలో ఉన్నారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేని ఎంతోమంది ఆయన అభిమానులు అసువులు బాశారు. వారి కుటుంబాలను ఓదార్చాల్సిన బాధ్యత తనపై ఉందంటూ ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు. కాని ఈ యాత్రకు కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి ఇవ్వలేదు. ఓదార్పు యాత్ర విషయంలో తల్లి విజయమ్మతో కలిసి సోనియాకు విజ్ఞప్తి చేసినా, ఆరు నెలల పాటు వేచి చూసినా ఫలితం లేదు. పైగా ఓదార్పు యాత్ర ఆపాలంటూ హైకమాండ్ శాసించింది. ప్రజలకు దూరం చేసే పార్టీ వద్దూ, పదవులూ వద్దంటూ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు జగన్. ఆయన నిర్ణయానికి పెద్ద ఎత్తున మద్దతు లభించింది.

ప్రజలే తన ఆత్మబంధువులంటూ ధైర్యంగా అడుగు ముందుకేశారు. వైఎస్ఆర్ పేరు ఉండేలా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఓదార్పు యాత్రను ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రజల్లోనే ఉంటూ.. వారి బాధలు తెలుసుకుంటూ, వారి కష్టాల్లో పాలుపంచుకుంటూ అడుగులు వేశారు. అన్ని వేళలా, అన్ని సందర్భాల్లో ఆ ప్రజలే ఆయనకు ధైర్యంగా నిలిచారు. ఇప్పుడు తమను పరిపాలించమంటూ అధికారాన్ని అందించారు.

Tags

Read MoreRead Less
Next Story