ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. నల్గొండ, వరంగల్‌, రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సునాయాసంగా గెలిచింది. నల్గొండ, రంగారెడ్డిలో కాంగ్రెస్‌కి కాస్త బలం కనిపించినా.. వరంగల్‌లో విజయం ఏకపక్షమైంది. నల్గొండలో తేరా చిన్నపరెడ్డి విజయం సాధించారు. ఇక వరంగల్‌లో భారీ మెజార్టీతో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గెలిచారు. రంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి కూడా విజయం సాధించడంతో.. MLC ఎన్నికల్లో కార్ తీర్‌మార్ కొట్టనట్టయ్యింది. నల్గొండలో తేరా చిన్నపరెడ్డి 226 ఓట్లతో గెలిస్తే.. వరంగల్‌లో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి 825 ఓట్ల మెజార్టీ సాధించారు. ఇక పట్నం మహేందర్‌రెడ్డి 244 ఓట్ల ఆధిక్యంతో విక్టరీ కొట్టారు. మండలి పోరులో విజయం సాధించిన నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు.

నల్గొండలో తేరా చిన్నపరెడ్డికే ఎంపీటీసీలు, జెడ్పీటీసీల మద్దతు లభించింది. జిల్లాలో మొత్తం 1086 ఓట్లు ఉంటే వాటిల్లో 1073 పోలయ్యాయి. తీరా లెక్కింపులో 19 ఓట్లను చెల్లనివిగా గుర్తించారు. మిగతావాటిలో TRS అభ్యర్థికి 640 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్తి కోమటిరెడ్డి లక్ష్మికి 414 ఓట్లు వచ్చాయి. దీంతో.. 226 ఓట్ల తేడాతో తేరా చిన్నపరెడ్డి విజయం సాధించినట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ, భువనగిరి స్థానాల్లో TRS ఓటమి పాలైంది. దీంతో.. స్థానిక సంస్థల కోటా MLCల్లో ఎలాంటి ఫలితం వస్తుందనే దానిపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికను పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకోవడంతో.. చిన్నపరెడ్డి విజయం ఖాయమైంది. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైనా.. ఈసారి ఎమ్మెల్సీగా విజయంతో మండలిలో అడుగుపెట్టబోతున్నారు.

ఇక వరంగల్‌ జిల్లాలో కారుపార్టీ విజయం ఏకపక్షమైంది. TRS అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఘన విజయం సాధించారు. ఎనుమాముల మార్కెట్‌యార్డులో జరిగిన కౌంటింగ్‌లో మొదట్నుంచి కారు దూసుకెళ్లింది. కాంగ్రెస్ నుంచి ఇనుగాల వెంకట్రాంరెడ్డి పోటీలో ఉన్నా ఆయన ఎలాంటి ప్రభావం చూపించలేకపోయారు. కాంగ్రెస్‌కి ఇక్కడ 23 ఓట్లు మాత్రమే రాగా.. 10 ఓట్లు చెల్లనివిగా ప్రకటించారు. పోరుగడ్డ ఓరుగల్లులో విజయంతో TRS శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. జిల్లాలో మొత్తం 902 ఓట్లు ఉంటే పోలైనవి 883. వీటిల్లో 848 ఓట్లు పోచంపల్లి శ్రీనివాసరెడ్డికే పడ్డాయి. దీన్ని బట్టే అక్కడ గులాబీ పార్టీ జోరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 825 ఓట్ల మెజార్టీతో శ్రీనివాసరెడ్డి విజయం సాధించడం విశేషం. వరంగల్ జిల్లా వరికొలు గ్రామాన్ని అభివృద్ధి చేసిన లీడర్‌గా శ్రీనివాసరెడ్డికి మంచి పేరుంది.

ఇక రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే ఇక్కడ మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి విజయం సాధించారు. మొత్తం 797 ఓట్లు పోలవగా.. చెల్లని 21 ఓట్లు తీసేస్తే.. పట్నం మహేందర్‌రెడ్డికి 510 ఓట్లొచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డికి 266 ఓట్లు పోలయ్యాయి. దీంతో.. 244 ఓట్ల తేడాతో మహేందర్‌రెడ్డి విజయం సాధించినట్టయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో పట్నం మహేందర్‌రెడ్డి అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి పైలెట్ రోహిత్‌రెడ్డి గెలిచారు. ఈనేపథ్యంలో.. తాజాగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక జరగడంతో ఆయన బరిలో నిలిచారు. విజయం సాధించి ఇప్పుడు మండలిలో అడుగుపెడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story