దెందులూరు నియోజకవర్గంలో సాగునీటి పైపుల చోరీ వివాదం..

దెందులూరు నియోజకవర్గంలో సాగునీటి పైపుల చోరీ వివాదం..

ప.గో.జిల్లా దెందులూరు నియోజకవర్గంలో సాగునీటి పైపుల చోరీ వివాదం అంతకంతకూ ముదురుతోంది. పెదవేగి(మం) జానంపేటలో సాగునీటి పైప్‌లను మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎత్తుకెళ్లిపోయారంటూ స్థానిక రైతులు ఆందోళనకు దిగారు. వైసీపీ నేతల మద్దతుతో ఆందోళనకు దిగారు. పోలవరం కుడికాలువ నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లందించేందుకు కొన్నాళ్ల క్రితం ఇక్కడ పైప్‌లు ఏర్పాటు చేయించారు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఒక్కోటి 100 అడుగుల పొడవుతో ఉండే 260 పైపులు ఏర్పాటు చేశారు. కాలువలో నీటి ప్రవాహం ఉన్న సమయంలో పైపుల గ్రావిటీ ద్వారా నీళ్లను చుట్టుపక్కల మండలాల్లోని పొలాలకు అందిస్తున్నారు. ఐతే.. సోమవారం ఈ పైప్‌లలో కొన్నింటిని చింతమనేని వర్గీయులు తమ పొలాల్లోకి తీసుకువెళ్లడం వివాదాస్పదమైంది. ఈ విషయం తెలిసిన రైతులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకుదిగారు. పెదపాడు రైల్వే స్టేషన్‌లో కేసు పెట్టారు.

స్థానిక వైసీపీ నేతల మద్దతుతో కొందరు రైతులు చింతమనేనికి చెందిన పామాయిల్ తోటకు వెళ్లి అక్కడున్న 18 పైప్‌లను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మరోవైపు, కేసు పెట్టిన విషయం తెలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన చింతమనేని వర్గీయులు.. ఆ పైప్‌లు తమ సొంత డబ్బుతో కొన్నట్టు చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన బిల్లులను కూడా చూపించారు. ప్రభుత్వం నుంచి పైపులు కొని వెయ్యడానికి ఆలస్యం అవుతుందన్న కారణంతో గతంలో.. చింతమనేని ప్రభాకర్ తన సొంత ఖర్చుతో పైప్‌లను కొని వేయించారని అంటున్నారు. ఇప్పుడు ఖరీఫ్‌లో నీళ్లు వచ్చే పరిస్థితి లేనందున ఆ పైప్‌లను తీసుకెళ్లినట్టు చెప్పారు. తమ పైపులను తాము తీసుకెళ్లడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు.

వైసీపీ నేతలు మాత్రం దీనిపై మరో రకమైన వాదన వినిపిస్తున్నారు. అప్పట్లో పైప్‌ల కొనుగోలు కోసం రైతుల నుంచి కూడా చింతమనేని డబ్బు వసూలు చేశారని చెప్తున్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుచేయాలన్న ఉద్దేశంతోనే పైప్‌లు తీసుకెళ్లిపోయారని మండిపడుతున్నారు. రైతులు చందాలు వేసుకుని కొన్న పైపులను రాత్రికి రాత్రే దొంగతనంగా తీసుకెళ్లడం దారుణమని వైకాపా జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు అన్నారు. రైతులు ఆందోళనకు తాము మద్దతు ఇస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేసేందుకు కొందరు కుట్రపన్నారని ఆరోపించారు.

మూడేళ్ల క్రితం రైతుల పొలాలకు నీరందించేందుకు పెదవేగి మండలం జానంపేట అక్విడెట్‌కు సమీపంలో పోలవరం కుడికాలువ గట్టు వద్ద పైపులను ఏర్పాటు చేశారు. దాదాపు 260 పైపుల ద్వారా నీటిని దిగువన ఉన్న పొలాలకు వెళ్లే ఏర్పాటు చేశారు. దీని కోసం స్థానిక రైతులు ఎకరానికి వెయ్యి నుంచి రూ.1500ల వరకూ చందాలు వేసుకుని ఎమ్మెల్యేకి ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. ఐతే.. రైతుల డబ్బుతో కొన్న పైపులను అలాగే వదిలిపెట్టామని చింతమనేని వర్గీయులు వివరణ ఇస్తున్నారు. అదనంగా తమ సొంత ఖర్చుతో ఏర్పాటు చేసిన పైపులనే తీసుకెళ్లినట్టు చింతమనేని చెప్తున్నారు. వైసీపీ నేతలు కావాలనే దీన్ని వివాదం చేయాలని.. తమను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడుతున్నారు. పైపుల వివాదంలో వైసీపీ, టీడీపీలు పోటాపోటీగా విమర్శలు ప్రతి విమర్శలకు దిగడంతో.. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు దీనిపై పూర్తి విచారణ జరిపి వివాదం పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story