తెల్ల రేషన్‌ కార్డు ఉన్న ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే స్కూల్‌ విద్యార్థులకు అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చిన ఏపీ ప్రభుత్వం... తాజాగా ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపు జేయాలని నిర్ణయించింది. క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌...ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల్లో చదివే ఇంటర్‌ విద్యార్థులందరికి ఈ పథకం ద్వారా ఏటా 15 వేలు అందజేయాలని నిర్ణయించారు. తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రతి తల్లికి ఏటా 15 వేల రూపాయలు ఇవ్వనున్నారు.

ఫీజు రీఎంబర్సమెంట్‌ను వాస్తవిక దృక్పథంతో అమలు చేయాలని అన్నారు సీఎం జగన్‌. ఫీజు రీఎంబర్స్‌మెంట్ సమయానికి ఇవ్వడం లేదన్న జగన్‌.. కాలేజీలు ఎలా బతుకుతాయని అధికారులను ప్రశ్నించారు. ప్రతి మూడు నెలలకొకసారి ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ ఇచ్చేలా చూడాలని ఆదేశించారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇవ్వకపోతే పేద, మధ్య తరగతి పిల్లలు చదువుకునే పరిస్థితి లేదన్నారు ఏపీ ముఖ్యమంత్రి.

సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ, గిరిజన మెడికల్‌ కాలేజీని అరకులో.. ట్రిపుల్‌ ఐటీ ఒంగోలులో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్‌. వెంటనే యూనివర్సిటీలకు సెర్చ్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. నెల రోజుల్లోగా యూనివర్సిటీలకు వీసీల నియామకం పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి.. పోస్టుల భర్తీని పారదర్శకంగా చేయాలని ఆదేశించారు.

ప్రభుత్వ స్కూళ్లలో పరిస్థితిపై కూడా ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రభుత్వ స్కూళ్లలో 20 నుంచి 25 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నందున టీచర్లకు శిక్షణ ఇవ్వాలని సూచించారు సీఎం జగన్.

Tags

Read MoreRead Less
Next Story